Home Telugu Articles వాల్మీకి రామాయణం ‘వాలి వధ’, ‘విభీషణుడి సహకారం’, ‘సీతా అగ్నిప్రవేశం’ లాంటి సంఘటనల్లోని నిజానిజాలు

వాల్మీకి రామాయణం ‘వాలి వధ’, ‘విభీషణుడి సహకారం’, ‘సీతా అగ్నిప్రవేశం’ లాంటి సంఘటనల్లోని నిజానిజాలు

0
SHARE
సంపాదక వర్గ సూచన:

వాల్మీకి రామాయణం గురించి, శ్రీరాముడి గురించి ఇటీవల అనేక వాదోపవాదాలు జరుగుతున్నాయి. వీటిన్నిటికి మూలమైన వాల్మీకి రామాయణంలో అసలు ఏమి ఉన్నదన్నది తెలుసుకోవాలి. అందుకు వాల్మీకి రామాయణాన్ని చదివి, అర్ధం చేసుకునే ప్రయత్నం చేయాలి. వాల్మీకి రామాయణంలో ఉన్న విషయాలను ప్రస్తావించడానికి ఒక రచయిత చేసిన ప్రయత్నమే ఈ వ్యాసం. ఇది రెండు భాగాలలో పాఠకులకు అందిస్తున్నాము.

మొదటి భాగం: 

రామాయణం పైనా, శ్రీ రాముడి పైనా బురద జల్లే ప్రయత్నాలు మంద బుద్ధులు, వక్రపు బుద్ధులు కలిగిన వారు ఏనాటి నుంచో చేస్తూనే ఉన్నారు. కానీ అవి ఏవీ నిలువలేదు. పైగా ఆ నిశాచరులు సృష్టించిన చీకటి వలన మరింతగా వెలుగులోకి వచ్చి దేదీప్యమానంగా వెలుగొందుతోంది. రామాయణపు విలువను రామ నామానికున్నఆదరాభిమానాలను చూస్తున్నా ఆ చీకటి బుద్ధులకు తెలియడంలేదు. ఎప్పటివరకు ఈ భూమి పైన నదులూ, పర్వతాలూ, చెట్లూ, మనుష్యులూ ఉంటారో అప్పటి వరకు రామ నామమూ, రామాయణమూ గానం చేయబడుతూనే ఉంటాయని సాక్షాత్తు బ్రహ్మ ఉవాచ.

వారు బుద్ధి తక్కువతో లేదా వక్రబుద్ధితో చేస్తున్న నిందారోపణలు కొన్ని తీసుకుంటే వాటిలో వాలి వధ, విభీషణుడి సహకారం, రావణుడి గుండె కిందకు బాణము వేసాడన్న అపోహ, సీతా అగ్నిప్రవేశం వంటి ముఖ్యమైన వక్రపు నిందారోపణల నిజానిజాలను ప్రామాణికంగా అతి క్లుప్తంగా పరిశీలిద్దాం.

1) రాముడు రావణుడి గుండెకు కాక పొట్టలోకి బాణం వేశాడా? :

(వాల్మీకి రామాయణం 111వ సర్గము 18, 19, 20 శ్లోకములు)

స విసృష్టో మహా వేగః శరీరాంతకరః శరః ! బిభేద హృదయం తస్య రావణస్య దురాత్మనః !!
రుధిరాక్తః స వేగేన జీవితాఽన్తకరః శరః ! రావణస్య హర న్ప్రాణాన్ వివేశ ధరణీ తలమ్ !!
స శరో రావణం హత్వా రుధిరాఽర్ద్రీ కృత చ్ఛవిః ! కృత కర్మా నిభృతవత్ స్వ తూణీం పునః ఆవిశత్ !!

తా: రాముడు మహా వేగముగా విడిచిపెట్టిన బ్రహ్మాస్త్రము వెళ్ళి దురాత్ముడైన రావణుడి వక్షస్థలమున నాటుకొని అతడి హృదయముని చీల్చి వేసెను. శత్రువులను సంహరించుటలో తిరుగులేని ఆ అస్త్రము రావణుని ప్రాణములు హరించి రక్తసిక్తమై, మరుక్షణమే భూమిలోని ప్రవేశించి ఆ పిమ్మట తిరిగి శ్రీరాముని తూణీరమున చేరెను.

ఇందులో అసలు రాముడు రావణాసురుడు పొట్టపైన గురి పెట్టడం ఎక్కడ ఉంది? గుండె కిందకు బాణాలు వేయడం ఎక్కడ ఉన్నది? అంత స్పష్టంగా ఉంటే ఈ విధంగా అనాలోచిత  ఆరోపణలు ఎలా చేస్తున్నారు? ఇటువంటి వక్రీకరణలకు  ప్రమాణీకంగా సమాధానం చెప్పవలసిన అవసరము అప్పుడప్పుడూ ఉంటుంది.

2) రావణ వధలో విభీషణుడి సహకారం :

విభీషణుడు చేసిన ధర్మ హితభోధ రుచించక అతడిని రావణ ఇంద్రజిత్తులు ఎంతగానో తూలనాడి నిందించారు. (యుద్ధకాండ 15వ 16వ సర్గలు). విభీషణుడు ఎంతగా హెచ్చరించినా రావణుడు వినకపోయెసరికి ఇక తప్పని పరిస్థితిలో  అధర్మ పరుడైన రావణుడిని వదలి విభీషణుడు ధర్మాత్ముడైన రాముడిని శరణు కోరాడు.(యుద్ధకాండ 17వ సర్గ).

సకృదేవ ప్రసన్నాయ తవాస్మీతి యాచతే | అభయం సర్వ భూతేభ్యో  దాదామ్యే తద్వ్రతం మమ ||
ఆనయైనం హరిశ్రేష్ఠ దత్తమాస్యాభయం మయా |విభీషణోవా సుగ్రీవ యది వా రావణః స్వయం ||

* *(యుద్ధకాండ 18వ సర్గలో 35, 36 శ్లోకాలు)

తా: “నేను నీవాడను అని పలుకుతూ ఎవరు నన్ను శరణుజొచ్చిననూ నేను తప్పక అభయమిస్తాను. ఇది నేను పూనిన వ్రతము. సుగ్రీవా! విభీషణుడికి నేను అభయమిచ్చుచున్నాను అతనిని తీసుకొని రమ్ము, అతనికే కాదు స్వయంగా రావణుడు వచ్చి శరణుకోరినా నేను అభయమిస్తాను ఇది నా వ్రతము” అని  తాను శరణార్ధులను ఆదుకునే వ్రతము బూనిన విషయమును శరణాగత వత్సలుడైన శ్రీ రాముడు ప్రకటించి, విభీషణుడుకి శరణమిచ్చి తనవాడిగా స్వీకరించాడు. విభీషణుడు ధర్మం కోసం శ్రీరాముడుకి రావణుడి బలాబలాలు చెప్పడంలో ఎలాంటి దోషం లేదు. ఎందుకంటే విభీషణుడు అప్పుడు రాముడి పక్షంలో వాడు.

తేన చేమం మాహాప్రాజ్ఞమ్ అభిషించ విభీషణమ్ | రాజానం రక్షసాం క్షిప్రం ప్రసన్నే మయి మానద ||
ఏవ ముక్తస్తు సౌమిత్రిః అభ్యషించద్విభీషణమ్ | మధ్యే వానరముఖ్యానాం రజానాం రాజాశాసనాత్ ||

(యుద్ధకాండ 19వ సర్గ 26, 27 శ్లోకములు)

తా: శ్రీరాముడు విభీషణుడి ధర్మనిరతికి సంతుష్ఠుడైన వాడై లంకా రాజ్యానికి ఇటువంటి ధర్మాత్ముడే రాజుగా ఉండవలెనని ఎరిగిన వాడై లక్ష్మణుడితో వెంటనే సముద్ర జలమును తీసుకువచ్చి విభీషణుడికి ఆ జలముతో పట్టాభిషిక్తుని గావించ మని చెప్పెను. ప్రభువైన శ్రీ రాముడి ఆదేశము శాసనముగా భావించిన లక్ష్మణుడు వానర ప్రముఖుల సమక్షమున ఆ సముద్రజలములతో లంకకు విభీషణుని రాజుగా అభిషిక్తుని చేసెను.

శ్రీరాముడి యుద్ధము లంక పైన  కనుక లంక తనదే అవుతుంది కావున లంకకు విభీషణుడుని ముందుగానే రాజ్యాభిషేకం చేసెను. అప్పుడు లంకలో ఉన్నవాడు రావణుడుని సంహరించడానికి తన సామంతుడైన వాడు అందునా శరణార్తిగా వచ్చి తన వాడైన విభీషణుడి సలహాలే  కాదు అతడిని యుద్ధములో పాల్గొనమని ఆదేశించడం కూడా ధర్మమే అవుతుంది.

3) వాలి వధ :

తాను మరణిస్తున్నప్పుడు వాలియే శ్రీ రాముణ్ణి ఇలా అడుగుతాడు -‘ధర్మావతార శ్రీ రామా ఈ విధంగా నేను వేరొకరితో యుద్ధము చేస్తుంటే  నా పై బాణం వదలడం నీకు తగునా?’ అని. దానికి శ్రీరాముడు ఇచ్చిన ధర్మయుక్త సమాధానం

కిష్కిందకాండ 18వ సర్గలో 4 నుంచి 12 శ్లోకములు

తా: “ఓ వాలీ ధర్మార్ధ కామములను లౌకిక ఆచారములను తెలుసుకొనక నన్ను తప్పుబడుతున్నావు, ఈ భూమి (జంబూద్వీపము) అంతయూ ఇక్ష్వాకు ప్రభువుల ఆధీనములోనిది, పాదుకా పట్టాభిషేకము చేసి రాజుగా భరతుడు దీనిని ధర్మయుక్తముగా పాలించుచున్నాడు. మేము మరియు ఇతర రాజులు ధర్మబద్ధులై ధర్మాన్ని రక్షించడానికి ఈ భూమిపై సంచరించుచున్నాము. అటువంటి ఈ ధర్మముతో నిండిన రాజ్యములో అధర్మ వర్తనులుగా ఉన్నవారిని దండించడము ధర్మమును నిలుపడమూ మా కర్తవ్యము.

కిష్కిందకాండ 18వ సర్గలో 13, 14, 17, 18, 19, 20 ,21, 28 శ్లోకములు

తా: నీవు ధర్మము తప్పి ఉన్నావు, ధర్మము ప్రకారము తన తమ్ముడు, తన కడుపున పుట్టిన వాడు, తన వద్ద విద్యనభ్యసించిన వాడు వీరు ముగ్గురూ పుత్రుల వంటి వారు. నీవు నీ కొడుకు వంటి తమ్ముడు బతికి ఉండగానే నీ కోడలి వంటి అతని భార్యను బలవంతముగా పొంది  సుఖిస్తున్నవాడివి. ఒక తండ్రి కూతురిని బలవంతముగా పొందినటువంటి అధర్మము ఇది. దీనికి మరణమే దండనము. నీ తమ్ముడు నావద్దకు వచ్చి దుఃఖించి  మొరపెట్టుకున్నప్పుడు ధర్మము రక్షించవలసిన నేను అతనికి మాట ఇచ్చితిని నిన్ను దండించి తనకు రాజ్యమును తన భార్యను ఇస్తానని..

కిష్కిందకాండ 18వ సర్గలో 39, 40, 41, 42, 43, 44 శ్లోకములు 

తా: పైగా ధర్మముగా జీవించు వారిపై దాడి చేసే క్రూర జంతువులను వేటాడి సంహరించి వారిని కాపాడుట క్షత్రియ ధర్మము ఎందుకనగా ధర్మమున నివసించు వారిని కాపాడి, వారి ప్రగతి కోసం కృషి చేసేది రాజే. నీవు శాఖా మృగమైన వానరుడవు, మృగములను వల వేసిగాని, ఎదురుగాకాని, లేక పొంచి ఉండి కానీ అనేక ఉపాయములలో వేటాడవచ్చును. నిన్ను ఎటునుంచి అయిననూ నేను వేటాడి సంహరించవచ్చును, ఎందుకనగా ధర్మములో ఉన్న వారిపైన నీవు ధర్మము తప్పి క్రూరముగా దాడి చేసిన శాఖా మృగానివి. కాబట్టి  ఏ విధంగా చూసినా నిన్ను ఈ విధముగా వధించడము ధర్మమే.” అని ఈ విధముగా శ్రీ రాముడు ధర్మమును వాలికి తెలియజేయగా వాలి దానికి పూర్వము రాముడిని నిందించినందుకు భాధపడి రాముడి ధర్మ భోధను అంగీకరించి నమస్కరించి తన పుత్రుడైన అంగదుడిని శ్రీరాముడికి అప్పగించాడు.

కిష్కిందకాండ 18వ సర్గలో 47, 48, 49, 50, 51, 52, 53, 54 శ్లోకములు

వాలి వధ విషయంలో ధర్మాన్ని శ్రీరాముడు చెపితే వాలియే దానిని తెలుసుకుని, మనస్ఫూర్తిగా అంగీకరించి, తన అధర్మవర్తనను ఎరిగి, శ్రీరాముడికి  నమస్కరించి తన కుమారుడిని శ్రీరాముడి చేతిలో పెట్టిన అంశాలన్నీ స్పష్టంగా వాల్మీకి రామాయణములో వివరించి ఉంటే, వాలికి లేని భేదాభిప్రాయం, రాముడిని దూషిoచాలనే ఆలోచన కుహానా మేధావులకు ఎందుకు? కారణం లేకుండా రామాయణం పై విషము చిమ్మే వారిది వక్రపు బుద్ధి కాదా ?

4) సీతమ్మ అగ్నిప్రవేశం:
రావణ సంహారణాంనంతరం సీతమ్మ అగ్ని ప్రవేశం చేసిన విషయం అందరికీ తెలిసినదే. కానీ ఈ కాలంలో కుహనా మేధావుల కుట్ర పూరిత వ్యాఖ్యల వలన శ్రీ రాముడికి అపవాదులు తప్పడం లేదు.  దానికి రామాయణం చదవని వారి సంఖ్య ఎక్కువ ఉండడమే కారణం అనడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు.

ఆ ఘట్టము క్లుప్తముగా ఒకసారి చూస్తే – రావణ సంహారణాంతరము విభీషణుడు సీతమ్మను పల్లకీలో శ్రీరాముడి ముందుకి తీసుకురాగా..

తాం తు పార్శ్వస్థితాం ప్రహ్వాం రామః సంప్రేక్ష్య మైధిలీమ్ |హృదయాంతర్గత క్రోధో వ్యాహర్తుమ్ ఉపచక్రమే ||

(యుద్ధకాండ 118వ సర్గ 1వ శ్లోకం)

తా:  అంతట శ్రీరాముడు తనపక్కనే వినమ్రతతో నిలబడి ఉన్నసీతాదేవిని చూసి తన మనస్సులో ఉన్న లోకాపవాద భయమును ఆమెతో ఈ విధముగా ప్రకటించాడు..  అంటే ఆ తరువాత తాను మాట్లాడబోయే ప్రతిమాట తాను ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నది కాదు కేవలం లోకులు కాకులనే ఉపమానం ఉన్నది కనుక లోకులు రావణుడి అపహరణలో ఉన్న సీతాదేవిని గురించి అపవాదాలుగా చేసే వ్యాఖ్యలకు ఒక ప్రజాపరిపాలకుడిగా, అపవాదులకు అతీతంగా జీవించవలసిన అవసరం ఉన్నందున, తాను సీతాదేవి పాతివ్రత్యాన్ని అందరికీ నిరూపితం చేయడం కోసమే ఇలా మాట్లాడినట్టు ఈ ఘట్టం మొట్ట మొదటి శ్లోకములోనే తేటతెల్లంగా ఉంది. అది చూడకుండా, పట్టించుకోకుండా కొందరు రాముడి మీదనే అపవాదులు వేయడం వారి అజ్ఞానానికి పరాకాష్ఠ.

రాముడు ఆ సందర్భంలో పరుషంగా మాట్లాడుతూనే ఒక మాట అంటాడు –

ప్రాప్త చారిత్ర సందేహా మమ ప్రతిముఖే స్థితా ! దీపో నేత్రాఽఽతుర స్యేవ ప్రతికూలాఽసి మే దృఢమ్ !! (యుద్ధకాండ 118వ సర్గ 17వ శ్లోకం)

నీవు రావణుడి అపహరణలో కొంత కాలముండి ఇప్పుడు నా ముందు ఉండడం వలన నీ ప్రవర్తన విషయములో నాకు సందేహం కలుగుతున్నది ఎందుకనగా నేత్ర రోగికి దీపకాంతి ఇష్టము కానట్లు నీ విషయములో నాకు ఇలా కనిపిస్తున్నది అని అంటాడు..

దానిలోనే అర్ధమవుతున్నది అసలు సీతాదేవిలో ఏ దోషమూ లేదన్న విషయం తనకి తెలుసునని కానీ ఇంతకు ముందు తను అనుకున్న విధంగా తనకు, సీతాదేవికి అపవాదులు రాకూడదని తనను తానే అనుకుంటున్నట్టుగా నేత్ర రోగము ఉన్నవారి కంటికి కాంతిని చూడటం ఇష్టముండదు. నీవు దీపపు కాంతివి అనగా నీలో ఎటువంటి దోషమూ లేదు అని రాముడు చెప్పకనే చెప్పాడు.

ఆ తరువాత జరిగిన సంఘటనలు అందరికీ తెలిసినవే రాముడు సీతమ్మను రావణుడి అపహరణలో ఉన్న తనను రాజుగా స్వీకరించలేను అనడం, సీతమ్మ దానికి ఆవేదనతో సమాధానం చెప్పి, అగ్ని ప్రవేశం చేయడం, శివ బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమై శ్రీరాముడికి చెబుతునట్టుగా అందరికీ సీతాదేవి పాతివ్రత్యాన్ని, రాముడి వైశిష్త్యాన్ని చెప్పడం రామాయణములో చూడవచ్చును. ఆ తరువాత అగ్ని దేవుడు ప్రత్యక్షమై తాను దహించలేని సీతమ్మ పాతివ్రత్యాన్ని  ప్రకటితం చేయడం తెలిసినదే.

దేవతలతో సహా అక్కడి వారందరికీ అదే విధంగా రాబోయే కాలంలో, యుగ యుగాలలో అందరికీ తెలిసేలా తన అసలు ఉద్దేశం  శ్రీ రాముడు ఇలా చెప్పాడు –

యుద్ధకాండ 121వ సర్గ 14, 15, 16, 17 శ్లోకములు

అవశ్యం త్రిషు లోకేషు న సీతా పాప మఽర్హతి ! దీర్ఘ కాలోషితా చేఽయం రావణాఽన్తః పురే శుభా !!
బాలిశః ఖలు కామాఽత్మా రామో దశరథాఽత్మజః ! ఇతి వక్ష్యన్తి మాం సన్తో జానకీ మఽవిసోధ్య హి !!
అనఽన్య హృదయాం భక్తాం మ చ్చిత్త పరివర్తినీమ్ ! అహ మఽప్యఽవగచ్ఛామి మైథిలీం జనకాఽఽత్మజామ్ !!
ప్రత్యయార్ధం తు లోకానాం త్రయాణాం సత్యా సంశ్రయః |ఉపేక్షే చాపి వైదేహీం ప్రవిశంతీం హుతాశనం ||

తా: “అగ్నిదేవా సీతాదేవి యందు ఎటువంటి దోషమూ లేదు తను పవిత్రురాలు, కానీ రావణుని అపరహరణలో  ఉండుట చేత లోకాపవాదములు రాకుండగా తన పాతివ్రత్యము ముల్లోకముల వారికీ నిరూపించుటకు ఈ పరీక్ష నెరపవలసి వచ్చినది. ఎటువంటి పరీక్ష లేకుండా నేను స్వీకరిస్తే దశరధ రాముడు మూర్ఖుడు, కామాతురుడునని లోకులు నిందిస్తారు. జానకి తన మనస్సు నాయందే నిలుపుకుని నా మనసు ఎరిగే ప్రవర్తించునని నేను ఎరుగుదును. సత్య వ్రతుడనైన నేను సీతాదేవి శీలమును ముల్లోకములకు ప్రకటించుటకు సీతాదేవి అగ్ని ప్రవేశము చేస్తున్ననూ ఉపేక్షించినాను. అంతే కానీ ఈమెను నేను పరిత్యజించుట అసంభవము. “

ఇలా రాముడే తన ఉద్దేశములను పూర్తిగా  తేటతెల్లం చెప్పినప్పుడు, దానికి సీతమ్మతో సహా అందరూ రాముడి  ధర్మనిష్ఠను గుర్తించినప్పుడు, కొందరు కుహనా మేధావులకు మానసిక అశాంతి కలగవలసిన అవసరం ఏమీ లేదు.

– మునిపల్లె జ్యోతీ స్వరూప్

(సీతాదేవిని అడవిలో విడిచిపెట్టడం, శంబూక వధ వంటి ఆరోపణలకు సమాధానం రెండవ  భాగం లో )

రెండవ భాగం