– డాక్టర్ జె. లలిత
“ప్రతి ఒక్కరు తమ మాతృభూమిని, సంస్కృతిని, మాతృభాషను గౌరవించాలి. అవి మనకు ఆనందాన్ని కలిగించేవి” – ఋగ్వేదం
2000 సంవత్సరం నుంచి ప్రతి ఏటా మాతృభాషా పరిరక్షణ కార్యక్రమాన్ని యునెస్కో ప్రకటించింది. ప్రపంచంలో చిన్న, పెద్ద భాషలన్నిటినీ రక్షించుకోవాలని, భాషా సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవడం ద్వారానే మనం జీవ వైవిధ్యాన్ని కాపాడుకోగలమని యునెస్కో చెబుతోంది. బహుభాషల విధానాన్ని ప్రోత్సహించాలని, అది విశాల దృష్టిని, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తుందని యునెస్కో ప్రకటించింది. అయితే మాతృభాషను కాపాడుకుంటూనే దాని ద్వారానే తక్కిన భాషల్ని నేర్చుకోవడం, అనంత విజ్ఞానాన్ని పొందడం సరైన మార్గం అని యునెస్కో వెల్లడించింది.
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఏటా ఒక థీమ్‌ను కూడా యునెస్కో ప్రకటిస్తోంది. ‘ఈ ఏడాది యునెస్కో 2024 నేపథ్యం – “బహుభాషా విద్య అనేది ఇంటర్‌జెనరేషన్ లెర్నింగ్‌కి మూలస్తంభం.”
మాతృభాష – సాంస్కృతిక హక్కు,
సామాజిక- భాషాపర గుర్తింపునకు మూలము మాతృభాష, ముఖ్యంగా తన తల్లి ఒడిలో నేర్చుకునే భాష. ఒక జాతి సాంస్కృతికంగా పురోగతి సాధించాలంటే ప్రథమ భాషదే కీలక పాత్ర. భాషకి, మనసుకి దగ్గర సంబంధం వుంది. అందుకే మొదట నేర్చుకున్న భాషకి, మెదడుకి, అది ఆలోచించే ధోరణి మనసుకి అతి సన్నిహిత సంబంధం ఉంది. దాని ద్వారానే ఇతర భాషలు తేలిగ్గా నేర్చుకుని ప్రపంచం మొత్తంతో సంబంధం ఏర్పరుచుకోవచ్చు. భాషా సంస్కృతులు ఒక సమాజపు ఆర్ధిక పురోభివృద్ధిని ప్రభావితం చేయగలవు. బహుళ సాంస్కృతిక సమాజాలలో, భాషా ప్రణాళికలూ భాషా ప్రయోజనాలూ సామాజిక ఆర్థిక కోణంలో ప్రత్యక్ష సంబంధాలకు సాధనాలుగా ఉపయోగపడుతున్నాయి.
యునెస్కో ప్రకారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం బహుభాషా విద్య- విద్యను మార్చడానికి ఒక ఆవశ్యకత అనే అంశంపై దృష్టి సారిస్తుంది. ఫిబ్రవరి 21న యునెస్కో నిర్వహించే కార్యక్రమం జీవితకాల అభ్యాస దృక్పథం నుంచి విభిన్న సందర్భాల్లో విద్యను మార్చడానికి బహుభాషావాదం సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా యునెస్కో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.
జ్క్షాన సముపార్జనలో భాష- సిద్ధాంతపరమైన చర్చ
పిల్లలు తమ చుట్టూ ఉన్న ప్రపంచంతో మమేకమై పరస్పర ప్రతిచర్యలు, అన్వేషణలు, ప్రతిస్పందించడం, కనుగొనడం, పాల్గొనడం ద్వారా అర్ధవంతమైన భావనలను పొందుతారు. ఇదే జ్ఞానం అవుతుంది.
1950 -60 దశకంలో జరిగిన భాషా పరిశోధన క్రింది సైద్ధాంతిక భావనలను విశదీకరించింది.
• మాతృభాషలో అభ్యసనం చేసిన విద్యార్థుల్లో మేధో వికాసం ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారించారు.
• మానవ వికాస సూచికగా మనం సంస్కృతిని పరిగణిస్తాం. సంస్కృతి స్వీకరణ , పరిరక్షణ విద్యా లక్ష్యంగా గుర్తిస్తే , మాతృభాషను సంస్కృతి మాధ్యమంగా గుర్తించాల్సిందే.
• వ్యక్తిత్వ వికాసంలో భాగంగా మాతృభాష పిల్లవానికి తన మీద తనకు విశ్వాసం కలిగేందుకు చక్కని దారిని ఏర్పరుస్తుంది.
• జ్ఞానాన్ని పొందేందుకు అవసరమైన అభ్యాసన నైపుణ్యాలు- తార్కిక ఆలోచన, విమర్శనాత్మక ఆలోచన పెరగాలంటే మాతృభాషలోన సాధ్యపడుతుంది.
• విద్యార్థి జీవితంలో వ్యక్తిగత, సామాజిక, సాంస్కృతిక ఉనికి, గుర్తింపు ఏర్పడటానికి మాతృభాష పునాది వేస్తుంది. ఈ గుర్తింపు నుండే మేధస్సు , నైతిక పరమైన అంశాల పిల్లల్లో వికసిస్తాయి.
• అలవాట్లు, విలువలు, నమ్మకాలూ అన్నీ ఏర్పడటంలో మాతృభాషదే ముఖ్యపాత్ర.
పిల్లల ఆలోచన, భావ వ్యక్తీకరణ అమ్మభాషనుండే పరిణతి చెందటం మొదలవుతుంది.
ప్రాథమిక విద్యలో కీలక లక్ష్యాలైన చదవడం, రాయడం, లెక్కలు చేయడం మొదలైన అక్షరాస్యతా నైపుణ్యాలను సాధించడం ప్రధానం. ముఖ్యంగా, చదవడం, రాయడంలో నైపుణ్యాలంటే భాషలోని శబ్దాలను అక్షరాలతో గుర్తించే సామర్ధ్యాన్ని పెంపొందించుకోవడం. పిల్లలు మాట్లాడడం, వినడమే పునాదిగా ఈ నైపుణ్యాలను అలవరుచుకుంటారు.
అంతర్జాతీయ, జాతీయ విద్యా విధానాలు
బాషా, సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవడం ద్వారా జీవ వైవిధ్యాన్ని కాపాడుకోగలమని యునెస్కో 2000వ సంవత్సరంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ సంస్థలన్నీ- యునెస్కో, వరల్డ్‌బ్యాంక్, వరల్డ్ డిక్లరేషన్ ఆన్ ఎడ్యుకేషనల్ ఫరాల్ (ఎఫ్‌ఎఫ్‌ఏ) జనరల్ అసెంబ్లీ లాంటి సంస్థలన్నీ పిల్లలకు ప్రాథమిక విద్యని మాతృభాషలో నేర్చుకునే హక్కుందని నిర్ధారించాయి.
బహుభాషావాదం, భాష శక్తి
1986 విద్యా విధానం, విద్యా హక్కు చట్టం – 2009 రెండూ కూడా మాతృభాష వినియోగాన్ని సలహా మార్గదర్శకంగా ప్రోత్సహించాయి.
జాతీయ విద్యా విధానం 2020 కనీసం గ్రేడ్ 5 వరకు మాతృభాష/స్థానిక భాష/ప్రాంతీయ భాషను బోధనా మాధ్యమంగా నొక్కిచెప్పింది. అయితే గ్రేడ్ 8, అంతకు మించి ఉంటుంది. త్రిభాషా ఫార్ములాతో సహా విద్యార్థులకు ఒక ఎంపికగా పాఠశాల, ఉన్నత విద్య అన్ని స్థాయిలలో సంస్కృతం అందించబడుతుంది. భారతదేశంలోని ఇతర సాంప్రదాయ భాషలు మరియు సాహిత్యాలు కూడా ఎంపికలుగా అందుబాటులో ఉంటాయి. ఏ విద్యార్థిపైనా భాష విధించబడదు. ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కార్యక్రమం కింద 6-8 తరగతుల్లో ‘ది లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియా’పై విద్యార్థులు సరదాగా ప్రాజెక్ట్/కార్యకలాపంలో పాల్గొనేందుకు సెకండరీ స్థాయిలో అనేక విదేశీ భాషలు కూడా అందించబడతాయి. భారతీయ సంకేత భాష (ISL) దేశవ్యాప్తంగా ప్రమాణీకరించబడుతుంది. వినికిడి లోపం ఉన్న విద్యార్థుల ఉపయోగం కోసం జాతీయ, రాష్ట్ర పాఠ్యాంశాలు అభివృద్ధి చేయబడతాయి.
ప్రపంచ వ్యాప్తంగా విద్యావేత్తలు ఏ విజ్ఞాన శాస్త్రం నేర్చుకోవడానికైనా, పరాయిభాష నేర్చుకోవడానికైనా మాతృభాషా మాధ్యమమే సరైనదని చెబుతున్నారు. ప్రాథమిక స్థాయిలో మాతృభాషా మాధ్యమం అనివార్యమైన అవసరమని భారత రాజ్యాంగం (అధికరణం 350ఎ), కొఠారీ కమిషన్ చెప్పింది. యునెస్కోనే కాదు అభివృద్ధి చెందిన దేశాల చరిత్ర, వర్తమానం అదే చెబుతున్నాయి. వస్తూత్పత్తిలో అత్యధికాభివృద్ధిని సాధించిన జపాన్ అత్యున్నతస్థాయి వరకు మాతృభాషా మాధ్యమాన్నే అమలుచేస్తోంది. 2010లో భారత ప్రభుత్వం తెచ్చిన విద్యాహక్కు చట్టం విభాగం 29(2)లో ఎలిమెంటరీ స్థాయిలో వీలైనంతవరకు మాతృభాషా మాధ్యమాన్నే అమలు చేయాలని నిర్ధేశించింది.
కనె్వన్షన్ ఆన్ ది రైట్స్ ఆఫ్ ది చైల్డ్ (సిఆర్‌ఎస్) ఆర్టికల్ 29, 1ఓ సెక్షన్ 269లో ఆర్టికల్ 29 ప్రకారం మాతృభాషలోనే నేర్చుకునే తెవివితేటలు ఎక్కువగా వుంటాయని స్పష్టం చేశారు. అందుకని దాని ద్వారా ప్రపంచంలోకి చూసే హక్కు పిల్లలందరికీ వుందని నిర్ధారిస్తున్నాయి. ఏ భాషని మాధ్యమంగా విద్య గరిపించాలనుకుంటున్నామో ఆ భాషని ముందు క్షుణ్ణంగా నేర్పాలి. అందుకు పిల్లలకున్న భాషాపర హక్కుని గుర్తుంచుకోవాలి. డాకర్ ఫ్రేమ్ వర్క్ ఫర్ యాక్షన్ (2000) వరల్డ్ డిక్లరేషన్ ఆన్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ (1990) యునెస్కో లాంటి సంస్థలు పిల్లల భాషాపర హక్కుని తెలియజేస్తున్నాయి. మాతృభాషలో చదువు చెప్పడం, పిల్లలకు వాళ్ల జాతి సంస్కృతుల్ని చెప్పడం కూడా అంటున్నారు భాషా శాస్తజ్ఞ్రులు. ఇలా ఎందరో పరిశోధకులు, శాస్తజ్ఞ్రులు మాతృభాషా ప్రాధాన్యాన్ని చెబుతున్నారు పాఠశాలలో ప్రారంభ దశలో!
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మాతృభాషలు అంతర్థానమయ్యే స్థితిలో వున్నాయి. ఆంగ్లభాష కిందపడి ఇప్పటికే బక్కచిక్కిన మాతృభాషలెన్నో నలిగి కనుమరుగైపోయాయని. ఇటీవలి యునెస్కో సర్వే తేల్చింది. ప్రపంచంలో సుమారు ఏడు భాషల్లో, 230 భాషలు అంతరించాయి. ఇంకా 3 వేల భాషలు అంతరించే దశలో ఉన్నాయని యునెస్కో వెల్లడించింది. ఈ భాషల జాబితాలో తెలుగు భాష ఉందని యునెస్కో ప్రకటించింది. ఒక భాషను మాట్లాడే జనాభాలో ముప్ఫై శాతం మంది ఆ భాషను చదవకుండా, తల్లి భాషకు దూరమైతే ఆ భాష కాలక్రమంలో మృతభాషగా మారుతుందని యునెస్కో సూత్రీకరించి, తెలుగుకు ఆ పరిస్థితి రాబోతుందని ప్రకటించింది. ఇది తెలుగు భాషాభిమానులను కలవరపర్చే విషయం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి రెండు వారాలకు ఒక భాష కనుమరుగవుతోందట.
తల్లి బాస నెరిగి ఎల్ల బాసలు నేర్వ
ప్రతిభ పదును తేరు బాగుగాను
ఇంట గెలిచి రచ్చ కెక్కుటయే తాను
తెలిసి మెలగ మేలు తెలుగు బాల
(గుమ్మా సాంబశివరావు : 2000)
3. మాతృభాషా మాధ్యమంలో విద్య -ప్రస్తుత కర్తవ్యం
విద్య మానవ మేధో భాండాగారాన్ని నింపే వ్యవస్థ కాదు, పరిశీలన, అనుభూతులు, ప్రవర్తనను ప్రతిబింబించే తత్త్వం, ఒక స్వయం చోదక శక్తి- జాతీయ ప్రణాళిక ఛట్రం 2005 ,పాఠశాల విద్య.
జ్ఞాన నిర్మాణం అంటే అభ్యసనమే. అర్ధవంతమైన అభ్యసనం అంటే నిరంతర భావనాఅభివృద్ధి.
ఇలా పిల్లలు తమ జ్ఞాన ఆవిష్కరణ చేయడంలో తోడ్పడేవి ఆలోచన, భాష.. రెండు విడదీయరాని అంశాలు.
భాష వ్యవహార రూపాలు వాగ్రూప, లిఖిత రూపాలు.
మాతృభాష, మిగతా భాషలు నేర్చుకోవడానికి తాళపు చెవి లాంటిది!
మాతృభాషా మాధ్యమంలో నేర్చుకున్నవారే గణితం, విజ్ఞానశాస్త్రాలు సృజనాత్మకంగా అర్థం చేసుకోగలరు. వారే ఆంగ్లాన్ని కూడా బాగా నేర్చు కోగలరు. ఇందుకు బలమైన రుజువులే ఉన్నాయి.
ప్రపంచీకరణ అంటే ఆంగ్లీకరణ కాదు స్థానికీకరణ మాత్రమే.
లౌకిక, నాగరిక, సభ్య, స్వేచ్ఛా సమాజాలు మాతృభాషలోనే చదువుకోవడం సాధారణం, సహజం, తార్కికం, ఆనవాయితీ.
మాతృ భాష లేదా పిల్లలకు అర్థమయ్యే భాష కన్నా ఇంగ్లిష్ మీడియం బోధనకు ప్రాధాన్యం ఇవ్వటానికి అనుకూలంగా, వ్యతిరేకంగా చేస్తున్న వాదనలు ప్రాథమిక పాఠశాల విద్యా రంగంలో నెలకొన్న భారీ సంక్షోభాన్ని చూపుతున్నాయి.
శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించినప్పుడు మాతృభాషా మాధ్యమంలో చదివినవారు చక్కని అవగాహనా నైపుణ్యం గలవారిగానూ, విద్యావంతులుగానూ వుంటారని స్పష్టం చేశారు. బోధన అనేది ఒక నిర్బంధ పదం. పిల్లలు అర్థం చేసుకోగల మాధ్యమంలో వారికి బోధించాల్సిన అవసరముంది. కానీ.. ఇక్కడ అలా అర్థం చేసుకునే మాధ్యమం అనేది రాజకీయ ప్రజాకర్షణకు ఒక పనిముట్టుగా మారింది. ‘‘అర్థం చేసుకోగల భాషలోనే రాయటం, చదవటం చేస్తే.. రెండో భాష నేర్చుకోవటం పిల్లలకు ఇంకా సౌకర్యవంతంగా ఉంటుంది. ఒక చిన్నారి రెండో, మూడో భాషను నేర్చుకోవటానికి మారే క్రమంలో మాతృభాష పోషించే బోధనాత్మక పాత్రను మనం అర్థం చేసుకోవటం లేదు’’ అని విద్యావేత్త అభిప్రాయపడ్డారు.
మొదట ఏ భాషతో సమాజానికి కలపబడతాడో అదే మాతృభాష. మాతృభాషే మనల్ని ఒక జాతిగా గుర్తించేట్టు చేస్తుంది. ఆ మాతృభాషే లేకపోతే పాఠశాలకు వెళ్లమని మారాం చేస్తారు. చదువంటే ఒక విధమైన భయం ప్రారంభమవుతుంది. అలా కాకుండా పాఠశాలలోకి వచ్చిన తరువాత ఇంట్లో మాట్లాడే భాషలో బోధన ప్రారంభమైతే ఆ భాషలో రాయడం, చదవడం నేర్చుకునేసరికి కొద్దిగా ఊహ తెలుస్తుంది. ప్రాధమిక పాఠశాల చదువు పూర్తవుతుంది. అక్కడినుంచి ఏ భాషలో విద్యాబోధన జరిగినా జంకు లేకుండా మాతృభాష ద్వారా ఆ భాష నేర్చుకోగలుగుతారు.
“భాషలకు వాడుకే ఊపిరి. వాడుకరులే బలం. ప్రాణులలానే భాష జీవభౌతిక అంశాలు కలగలిసిన మనోసామాజిక వ్యవస్థ. భాష మనిషికి ఒక అవయవం. ఉన్న అవయవాన్ని పోగొట్టుకోవటమంటే అంగవైకల్యాన్ని కొనితెచ్చుకోవటమే. అంటే సామాజిక వైకల్యానికి చేరువవ్వటమే. ఇది అనర్థదాయకం. భాషలు మానవ వికాస పరంపరలో ఏర్పడిన జీవభౌతిక సృజనలేకాదు అవి తరతరాల సామాజిక సాంస్కృతిక వారసత్వ సంపదలు కూడా. వాటిని పక్కన పెట్టించే పనులు ఆ సమాజంపై దాడితో సమానం.” – (గారపాటి ఉమామహేశ్వరరావు)
మాతృభాష పిల్లలకు అనేక విధాలుగా సహాయపడుతుంది. సంస్కృతితో ప్రతిధ్వనిస్తుంది, మంచి సమగ్ర అభివృద్ధికి హామీ ఇస్తుంది ,ఇతర భాషల అభ్యాసానికి మద్దతు ఇస్తుంది. విద్యా ప్రమాణాలను అభివృద్ధి చేయడానికి, భాషా విధానాలు మాతృభాష అభ్యాసాన్ని ఉపయోగించుకోవాలి.
“మాతృభాష ద్వారా గరపని (నేర్వని) ప్రాథమిక విద్య అసలు విద్యే కాదు ” – మహాత్మా గాంధీజీ
రచయిత్రి : విద్యావిభాగం, ఉస్మానియా యూనివర్సిటీ