Home Telugu Articles మావోయిస్టుల బండారం బయటపెట్టిన సినిమాలు

మావోయిస్టుల బండారం బయటపెట్టిన సినిమాలు

0
SHARE

‘బుద్ధ ఇన్ ఏ ట్రాఫిక్ జామ్’.. ఇదొక హిందీ సినిమా పేరు.  వైవిధ్యం గల పేరుకు దగ్గ చలన చిత్రమిది. 2014 సంవత్సరంలో దీన్ని వివేక్ అగ్నిహోత్రి అనే దర్శకుడు తీశాడు. థియేటర్లలో, మల్టీప్లెక్స్‌లలో విడుదల కాకపోయినా ఇప్పటికీ అనేక విశ్వవిద్యాలయాల్లో, కళాశాలల్లో, చలన చిత్రోత్సవాలలో బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శితమై సంచలనం సృష్టించింది. యూట్యూబ్‌లోనూ అందుబాటులో ఉంది. ఈ చిత్రం చాలావరకు హైదరాబాద్ నగరంలో చిత్రీకరించడం విశేషం. హైదరాబాద్ బిజినెస్ స్కూల్  నేపథ్యంలో అర్బన్ నక్సల్స్, అర్బన్ మావోయిస్టుల కథాంశంతో ఈ సినిమా సాగడం ఓ సంచలనాంశం.

సంప్రదాయ సినిమా కథలకు, కథనానికి భిన్నంగా మావోయిస్టుల, వామపక్ష తీవ్రవాద వ్యవహారాలు, ఈ ఉద్యమం పేర జరిగే ‘వ్యాపారం’ (బిజినెస్) ఎంతో సమర్థవంతంగా ఈ సినిమాలో దర్శకుడు చూపారు. అర్బన్ నక్సల్స్/ అర్బన్ మావోలన్న పదాన్ని తొలుత ఈ దర్శకుడే ఉపయోగించాడన్నది వాస్తవం. ఈ పేరుతో ఆయన పుస్తకం రాశారు.ఇప్పుడు ఆ పదం అనేక పత్రికల్లో  వాడుతున్నారు. ఇటీవల ఈ పదం ఎక్కువ వినబడుతోంది. బస్తర్ ఆదివాసీల, నిరక్షరాస్యుల, అమాయకుల పేర జరుగుతున్న “జూదం” అర్థిక జూదం.. అధికార జూదం. తమ ఆకాంక్షలను నెరవేర్చుకునేందుకు జూదం ఇందులో నగ్నంగా కనబడుతోంది.

ఈ సినిమాలో కనిపించే ప్రొఫెసర్లు, విద్యార్థులు, మావోయిస్టులు స్వచ్ఛంద సంస్థల ముసుగులో జరిగే మావోయిస్టుల కార్యక్రమాలు అరణ్యంలోని మావోలకు, అర్బన్ మావోయిస్టులకు మధ్యగ ల అపవిత్ర సంబంధాలు, సహాయ సహకారాలు, సాయుధ ఆలోచనలు సంకర సంస్కృతి ఆసరాగా భావోద్వేగాలను రెచ్చగొట్టడం ఇట్లా ఒకటా.. రెండా అనేక అంశాల కలబోతగా ఈ చిత్రం చాలా మంది కళ్లు తెరిపిస్తున్నది. మనషులపై చెరగని ముద్ర వేస్తోంది. ఇందులోని పాత్రలను నిజజీవితంలోని కొంతమంది ప్రొఫెసర్ల, నాయకుల వ్యక్తులతో సరిపోల్చుకునే వీలుంది. వాస్తవ సంఘటనలపై ఆధారపడి  తీసిన చిత్రం కావడం వల్ల అది సాధ్యం. మాటల గారడీతో, మాయమాటలతో, విశ్లేషణలతో చురుకైన విద్యార్థులను ఎలా ఊబిలోకి లాగుతారో ఇందులో రేఖా మాత్రంగా కనిపిస్తుంది.

అంతిమంగా ఆ ఉద్యమంలోని డొల్లతనం, కరడుగట్టిన తనం కొంతమంది వ్యక్తుల ఊహాప్రపంచానికి ఎంతమంది ప్రాణాలు ఆహుతవుతున్నాయో, ఆదివాసీల పట్ల ఎంత ఆటవికంగా ప్రవరిస్తున్నారో, తమ మాట చెల్లుబాటు కావడం కోసం ఎంత దూరమైనా ఎలా కదులుతారో ద్యశ్యమానంగా  ఇందులో దర్శకుడు చూపించారు. విప్లవం విందు భోజనం కాదు అన్న మావోసూక్తిని సినిమా చివర పేర్కొన్న ఉద్యమం కొందరికి భోజనం సమకూరుస్తోందన్నది పరమ సత్యం. విందుభోజనం అందిస్తుతున్నదన్నా అతిశయోక్తి అవదు!

పేద ప్రజల పట్ల, ఆదివాసీల పట్ల, అమాయకుల పట్ల ఆర్తితో పోరాడుతున్నారన్న విషయం వెనుక గల డొల్లతనం, ద్వైద్వీభావం, మొరటుదనం, వ్యాపార ధోరణి, విలువలకు పాతరవేసే నైజం, అనేక అసాంఘిక శక్తులపై, దుష్టశక్తులపై ఆధారపడి రోజులు దొర్లించడం చూస్తే భయంకరమైన ‘ట్రాఫిక్ జామ్‌లో’ చిక్కుకున్న  భావన బుద్ధునిలాంటి శాంతికాముక సాధారణ ప్రేక్షకుడికి కలుగుతుంది. ఏది సత్యం.. ఏదీ అసత్యం.. ఏది నిజం.. ఏది అబద్ధం? ఏది అసలు?.. ఏది నకిలీ తెలియక పక్కనున్న వాడిని సైతం మావోయిస్టుగా అనుమానించే వాతావరణం ఏర్పడడం చూస్తే నిజంగానే దారుణమైన ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయామా? అనిపిస్తుంది.

సహజ ఆప్యాయతలు, ఆదర్శాలు, నిజాయితీ, నిండుదనం, త్యాగగుణం, పరోపకారం వీటన్నింటికీ మావోయిస్టులు ఎలా పాతర వేస్తారో కూడా ఈ చిత్రంలో గమనించవచ్చు. మెట్రో నగరాలు అందిచే సుఖం, సౌఖ్యం, మేధావితనానికి గిలిగింతలు పెట్టే వాతావరణం, మాటల మేటలు, గారడీ, వ్యవహరాంతో పాటు విప్లవం కోసమే తాము జీవిస్తామన్న ‘నటన’ అన్నీ నగ్నంగా ఇందులో కనిపిస్తాయి. బిజినెస్ స్కూల్ ప్రొఫెసర్‌గా అనుపమ్‌కేర్ తన నటనా విశ్వరూపాన్ని ప్రదర్శించారు. మరో నటి పల్లవీ జోషి అతని భార్య పాత్రను పోషించారు.

విద్యాధికుడైన దర్శకుడు ఎన్నో సంవత్సరాల పరిశోధన అనంతరం మావోయిస్టుల నాయకుల మానసిక స్థితి అధ్యయనం చేశాక సత్యాన్ని ప్రజల ముందుకు తీసుకురావాలన్న లక్ష్యంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ నిజాయితీ నిండుగా కనిపిస్తోంది.

రెడ్ అలర్ట్

2009 సంత్సరంలో రెడ్ అలర్ట్ అన్న హిందీ చిత్రం థియేటర్లలో ప్రదర్శితమైంది. నల్లమల అడవుల్లో నక్సలైట్లు చురుగ్గా ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో మావోయిస్టుల నేపథ్యంలోనే సినిమా చిత్రీకరణ జరిగింది. ఇదికూడా వాస్తవ సంఘటనల  ఆధారంగా రూపొందింది. నరసింహా అనే వ్యక్తి ఎదుర్కొన్న సంఘటన ఇది. అడవుల్లో గెరిల్లా జీవితం, వారి కార్యక్రమాలు, వ్యవహారాలు, దాడులు దర్శకుడు అనంత మహదేవన్ నగ్నంగా చూపించారు. ఈ సినిమాలో తెలుగు పేర్లు వినిపిస్తాయి. హిందీ చిత్రమైనప్పటికీ నల్లమల అటవీ స్థానికతను చూపించారు. ఈ చిత్రంలోనూ మావోల (అప్పటి పీపుల్స్ వార్ నక్సలైట్ల) డొల్లతనం, దౌర్జన్యం, దుష్టత్వం, అరాచకం అన్ని దృశ్యమానంగా చూపారు. ఈ చిత్రం ముగింపులోనూ మావోయిస్టు నాయకుడి నిజస్వరూపం, వ్యాపారాత్మక సత్యం, విద్రోహవైఖరి, మనుషులతో ఆట ఆడుకునే వైనాన్ని స్పష్టంగా దర్శకుడు చూపించాడు.

మావోయిస్టు ఉద్యమంలోని డొల్లతనం, ద్వైదీభావం, విలువలకు పాతర వేయడం ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. నసీరుద్దీన్ షా, సునీల్ సెట్టి, వినోద్ ఖన్నా, సమీరారెడ్డి తదితరులు ఇందులో జీవించారు. పైరెండు చిత్రాలు క్లుమైక్స్ గమనిస్తే ప్రేక్షకుడి బుర్ర గిర్రున తిరుగుతుంది. మావోయిస్టుల పట్ల ఏమాత్రం సానుభూతి, మంచితనం మనసులో పెట్టుకుని ఈ చిత్రాల్లో చూసినా అది పటాపంచలవుతుంది. వారి పట్ల అసహ్యమేస్తుంది. పెట్టుబడిదారి వ్యవస్థలో భత్యం, లాభం, మోహం, మదం, మత్సరం ఉన్నందువల్ల ఆ వ్యవస్థను నాశనం చేస్తామని కంకణం కట్టుకున్న వామపక్ష తీవ్రవాదుల్లో వాటినే నగ్నంగా ఉండటాన్ని దర్శకుడు చూపారు.

మానవుని నుంచి విడదీయరాని అనేక లక్షణాలు కుప్పపోసి ఉన్న తీరు ఈ వామపక్ష తీవ్రవాదుల్లో కనిపిస్తుంది. ఈ వాస్తవాంశాలను ఈ రెండు సినిమాల్లో చూడొచ్చు. మార్కెట్ రహిత ఎకానమీ గురించి మాట్లాడుతూ మరో రూపంలో ఆ మార్కెట్ ఎకానమీనే వారు మరింత మొరటుగా అమలు జరపడం విచిత్రం. మానవ జీవనంలో మార్కెట్ ఎకానమీ గూడుకట్టుకుని ఉందన్న విషయం పట్టించుకోకుండా మాటల వరకే మార్కెట్ రహిత సిద్ధాంతాన్ని పరిమితం చేసి ఆచరణలో పూర్తిగా బిజినెస్ మాడ్యూల్‌ను నక్సల్స్ పాటిస్తున్నారు. పెట్టుబడిదారులకన్నా వీరు రెండాకులు ఎక్కువే చదువుకున్నారు.

మరెందుకు రక్తపాతం?

ఈ మాత్రం దానికి ఇంత మానవహననం, రక్తపాతం జరగాలా? ఒక నాణానికి బొమ్మా బొరుసులా ప్రస్తుత వ్యవస్థ  మావోయిస్టుల వ్యవహారం కనిపిస్తున్నప్పుడు, వారి సిద్ధాంతం ప్రపంచమంతటా తిరస్కరణకు గురైందని, ఒకప్పటి కమ్యూనిస్టు దేశాలే ఆ మార్గాన్ని విడనాడి మార్కెట్ అనుకూల వైఖరి అనుసరిస్తూ తమ ప్రజల కనీస అవసరాలు తీరుస్తూ కాలానుగుణంగా అభివృద్ధిని సాధిస్తున్నారు. ప్రపంచంతో కలిసి అడుగులు వైస్తున్న వైనాన్ని గమనిస్తూ ఇలా జనారణ్యంలో దండకారణ్యంలో విప్లవం కోసం నక్సల్స్, అర్బన్ నక్సల్స్ మార్కెట్ రహిత వ్యవస్థ కోసం ఓవర్ టైమ్ పని చేయడంలో అర్థం లేదు. ప్రజాసంక్షేమం అసలే లేదు. ఈ విషయాన్ని సృజనాత్మకతతో చలన చిత్రాలు చెప్పడమే గాక నిజజీవితంలోనూ గమనించవచ్చు. నిజజీవితంలోని అనేక సంఘటనల ఆధారంగానే ఈ చలన చిత్రాలు రపొందాయన్న మాటను విస్మరించరాదు.

ప్రధాని నరేంద్రమోడీ హత్యకు, హైద్రాబాద్ విశ్వవిద్యాలయం వి.సి. హత్యకు కుట్ర పన్నినా, మందుపాతరలతో భద్రతా బలగాలను అంతమొందించినా, ఇన్‌ఫార్మర్ల పేరు అమాయక ఆదివాసీలను కాల్చిచంపినా, అటవీ ప్రాంత గ్రామాల్లో రోడ్ల నిర్మాణాన్ని అడ్డుకున్నా, పాఠశాల భవనాలను మందుపాతరలతో పేల్చేసినా, రాజకీయ నాయకులను అపహరించినా, కాల్చి చంపినా, దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న దుష్ట శక్తులతో, వ్యక్తులతో జతకట్టినా, అసహనం పేర హంగామా సృష్టించినా, అరుంధతీరాయ్ లాంటి రచయితల, కవుల, మేధావుల, వివిధ సంస్థల, సంఘాల సంఘీభావాన్ని కూడగట్టినా, మావోయిస్టుల వాదనకు, భావజాలానికి, మార్కెట్ రహిత వ్యవస్థకు ఆహ్వానం పలికేవారు ఎవరూ లేరు. ప్రపంచం ఒకవైపు వేగంగా పయనిస్తూ మందుకు పరిగెడుతూ ఉంటే దానికి బ్రేకులు వేయగల శక్తి వారికి లేదని ప్రత్యామ్నాయ సిద్ధాంతం వారిది కాదని తేలిపోయింది. వామపక్ష తీవ్రవాదులు తమ బిజినెస్ మాడ్యూల్‌ను మార్చుకుంటేనే వారికి మాన్యత లభిస్తుంది తప్ప ఇలా ఎన్ని దశాబ్దాలు అయుధాలతో తిరిగినా ఫలితం శూన్యం. వారు ఆశిస్తున్న ‘రాజ్యం’ పూజ్యం,

కొత్త వ్యూహం

చైనాలో గ్రామాలను విముక్తి చేసి నగరాలను చుట్టుముట్టే వ్యూహం అనుసరిస్తే, భారతదేశంలో కొత్తగా నగరాలు, పట్టణాల్లో అర్బన్ నక్సల్స్ ద్వారా అల్లకల్లోలం సృష్టించి, సమాంతరంగా అడవిలో, పల్లెల్లో పటాలాల కవాతు జరిపి 2025 నాటికి ఎర్రకోటపై ఎర్రజెండా ఎగురవేయాలన్న యోచన. యోజన.. కుట్ర కుత్సితమైనది. వక్రబుద్ధి గల వారి మానసిక సంతృప్తికి అది ఉపకరిస్తుంది తప్ప విశాల ప్రజానీకానికి జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, కడుపునిండా తిండిని, ఒంటి నిండా బట్టను అందించజాలదు. ఈ విషయాన్ని మావోలు ఎంత త్వరగా గుర్తిస్తే ప్రజలకు అంత తక్కువ నష్టం జరుగుతుంది.

–  నరసింహం
9985787799

(విజయక్రాంతి సౌజన్యం తో)