జమ్ముకశ్మీర్‌లో తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్ జరిగింది. రెండు చోట్ల వేర్వేరు ఎన్కౌంటర్లలో ఐదురుగు ఉగ్రవాదులను భారత భద్రత దళాలు హతం చేశాయి. జమ్ము కశ్మీర్‌లోని అవంతిపొరా జిల్లా త్రాల్‌లోని నౌబాగ్ ప్రాంతంలో ముష్కరులు ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రతా బలగాలతో పాటు కశ్మీర్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సమయంలో వారిపై ఒక్కసారిగా ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. వెంటనే స్పందించిన భారత భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులతో ఉగ్రవాదులకు ధీటుగా బదులిచ్చింది. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు గుర్తు తెలియని ఉగ్రవాదులు మృతి చెందినట్లు కశ్మీర్ పోలీసులు తెలిపారు. మృతి చెందిన ఉగ్రవాదులు ఏ సంస్థకు చెందినవారనే విషయం తెలియాల్సి వుందని కశ్మీర్ జోన్ పోలీసులు వెల్లడించారు.
అంతకముందు గురువారం నాడు షోపియాన్ జిల్లాలోని ఒక మసీదులో అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్ (ఎ.జి.యు.హెచ్) ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో.. ఉగ్రవాదులపై భద్రతా దళాలు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయినట్టు భద్రతా సిబ్బంది వెల్లడించింది. గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నట్టు పోలీసలు తెలిపారు.