వీసా నిబంధనలకు విరుద్ధంగా సికింద్రాబాదులో విదేశీ మతప్రచారకుడు పాల్గొనాలనుకున్న క్రైస్తవ మతప్రచార సభను ఇమ్మిగ్రేషన్, పోలీసు అధికారులు అనుమతి నిరాకరించారు.
నగరానికి చెందిన పాస్టర్ సుధాకర్ రావు బేగంపేటలోని చికోటి గార్డెన్స్ వద్ద ‘ప్రొఫెటిక్ హీలింగ్ కాన్ఫరెన్స్’ పేరిట జులై 5, 6, 7 తేదీల్లో మూడురోజుల పాటు నిర్వహించ తలపెట్టిన సభకు దక్షిణాఫ్రికా నుండి మషాలాని అనే క్రైస్తవ ప్రచారకుడిని ముఖ్య అతిధిగా ఆహ్వానించారు.
అయితే విదేశీయులు భారతదేశంలో ఎటువంటి వీసా మీద వచ్చినా మతప్రచారం చేయరాదు అనేది నిబంధన. దీని ఆధారంగా లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ సంస్థ హైదరాబాద్ ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ అధికారి మరియు న్యూఢిల్లీలోని కేంద్ర ఇమ్మిగ్రేషన్ బ్యూరో కమిషనర్ కి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదుతో పాటు “విదేశీయులు భారతదేశంలో మతప్రచారం చేయరాదు” అంటూ కేంద్ర హోంశాఖ తమకు ఆర్టీఐ చట్టం కింద ఇచ్చిన సమాచారం కాపీని కూడా జతచేసింది.
కేంద్ర హోంశాఖ ఆర్టీఐ చట్టం కింద ఇచ్చిన సమాచారం ఆధారంగా నగరానికి చెందిన హిందూ సంఘటన్ సంస్థ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో పోలీసులు, ఇమ్మిగ్రేషన్ అధికారులు విదేశీ క్రైస్తవ పాస్టర్ పాల్గొనాల్సిన సభకు అనుమతి నిరాకరించారు.