
గ్రామగ్రామాలలో వాయువేగంతో విస్తరిస్తున్న మతమార్పిడి మహమ్మారిని ఎదుర్కోవటంలో మన ‘దర్శన సేవ’ రామబాణంలా పనిచేయ గలదని ముఖ్య అతిథి శ్రీ అమర లింగన్న గారు పేర్కొన్నారు. సమాజాన్ని అనేక పద్ధతులలో విడగొట్టేందుకు నేడు అనేక భావజాలాలతో అనేక సంస్థలు నిరంతరం పని చేస్తుండగా మనం మాత్రం సామాజిక సమరసత సాధించే దిశగా ‘దర్శన సేవా’ కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతో సముచితమని వారు తెలిపారు.
శ్రీ అమర లింగాన్న గారు నిజామాబాద్ లో 12 మార్చ్ నాడు నూతనంగా ఏర్పాటయిన ‘దర్శన సేవ’ సంస్థ తొలి సమావేశంలో మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల వలన ధర్మ రక్షణ కొరకు ఒకరికి ఒకరు సహాయం చేయడం వలన హిందువులలో సంఘటన శక్తి పెరుగుతుందన్నారు.

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన శ్రీ నరేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఒక స్టార్ట్ అప్ వంటిదనీ, అనతి కాలంలో ఇది రాష్ట్ర వ్యాప్తమూ దేశవ్యాప్తమూ కాగలదని ప్రశంసించారు.
‘దర్శన సేవా సంస్థ’ వారు మొదట విడతగా జానకి పేట కు చెందిన 12 మంది హిందూ బంధువుల కుటుంబ సభ్యులను శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనమునకు పంపించడం జరిగింది. పరకామణి/లడ్డూ ప్రసాద సేవకులచే నిర్వహించబడిన తొలిబ్యాచ్ ను తోడ్కొని వెళ్తున్న శ్రీ రాజమౌళి దంపతులకు వీడ్కోలు కార్యక్రమంలో శ్రీ అమర లింగన్న, రాజులదేవి గోవర్ధన్ , కృష్ణాజి, పండరి, వేణుగోపాల రావు, పోతు గణేశ్ , గంగ నర్సయ్య, శ్రీనివాస్ గార్లు రైల్వే స్టేషన్ కు వచ్చారు.