Home Telugu Articles గాంధీజీ హత్య – నెహ్రూ అధికార సమీకరణ

గాంధీజీ హత్య – నెహ్రూ అధికార సమీకరణ

0
SHARE

ప్రతి సంవత్సరం జనవరి 30న హిందూ జాతీయవాదం గురించి కువ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్, కమ్యూనిస్ట్ నాయకులకు అలవాటైపోయింది. జనవరి 30, 1948న మహాత్మా గాంధీ హత్య జరిగింది. దీనికి కొన్ని నెలల ముందే భారత్ రాజకీయ స్వాతంత్య్రం సాదించు కుంది. ఆ స్వాతంత్య్రానికి కొన్ని గంటల ముందే దేశం రెండుగా విభజితమయ్యింది.

కాంగ్రెస్ మెతకవైఖరి, ముస్లిం లీగ్ మొండి వైఖరి మూలంగానే దేశ విభజన జరిగింది. అలాగే తాము వదిలిపోయేటప్పుడు భారత్ ను అల్లకల్లోల పరచాలన్న బ్రిటిష్ వారి కుతంత్రం కూడా ఇందుకు కారణం. అన్నిటికంటే మించి దారుల్ ఇస్లాం అనే రాజకీయ సిద్ధాంతం, భావన ఈ విభజనకు ముఖ్య కారణం.

“పాకిస్థాన్ ఏమిటి? ఈ దేశాన్ని సంపూర్ణంగా పాదా క్రాంతం చేసుకోవాలన్న వారి(ముస్లింలు)1200 సంవత్సరాల కల నెరవేరడానికి 20 శతాబ్దంలో పడిన మొట్టమొదటి విజయవంతమైన అడుగు” అని అర్నాల్ టాయన్బీ అన్నాడు. దేశ విభజనకు దారితీసిన పరిస్థితుల గురించి మరింత వివరంగా తెలుసుకోవాలనుకున్నవారు ‘ట్రాజిక్ స్టోరీ ఆఫ్ పార్టిషన్’ (కాళరాత్రి) అనే పుస్తకం చదవవచ్చును.

విభజన సమయంలో దేశం ఎన్నడూలేని మారణకాండకు గురైంది. కాంగ్రెస్ నాయకులు దేనిని నివారించాలనుకున్నారో ఆ జనాభా మార్పిడి అనివార్యమయ్యింది. ఈ బాధాకరమైన ప్రక్రియలో అనేకమంది చనిపోయారు. పెద్ద ఎత్తున దోపిడీలు, అత్యాచారాలు జరిగాయి. ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద వలసలు సాగుతున్న ఆ సమయంలో దేశ రాజధానిలో ప్రమాదకరమైన మరో పరిస్థితి ఏర్పడింది.

విభజన మూలంగా పెద్ద సంఖ్యలో ప్రజలు పాకిస్తాన్ నుండి తరలి రావడం వల్ల డిల్లీలో ప్రతి నాలుగవ వ్యక్తి అలాంటి కాందిశీకుడయ్యాడు. ఇది కాంగ్రెస్ నాయకత్వం పట్ల ప్రజల్లో ఆగ్రహాన్ని కలిగించింది. ఈ ఆపద సమయంలో కాందిశీకులకు అనేక స్వచ్ఛంద సంస్థలు ఆహారం, నివాసం ఏర్పాటు చేశాయి. పాకిస్థాన్ లోని సమస్యాత్మక ప్రాంతాల నుంచి చివరి హిందువు సురక్షితంగా భారత్ కు చేరుకునేదాకా సంఘ స్వయంసేవకులు అక్కడ నుంచి కదలకూడదని గురుజీ గోల్వాల్కర్ ఆదేశించారు. అలా హిందువులను రక్షిస్తూ అనేక వేలమంది స్వయంసేవకులు తమ ప్రాణాలు త్యాగం చేశారు. ఆ వివరాలన్నీ ‘జ్యోతి జల నిజ్ ప్రాణ్ కీ’ అనే పుస్తకంలో లభిస్తాయి.

గాంధీజీ హత్య
దేశ విభజనకు మహాత్మా గాంధీయే పూర్తిగా బాధ్యులని భావించినవారిలో నాథూరాం గాడ్సే కూడా ఉన్నారు. జనవరి 30, 1948 రోజున సాయంత్రం 5.17 గం.లకు గాంధీజీ ప్రార్ధన సమావేశానికి వస్తున్నప్పుడు గాడ్సే ఆయనను సమీపించారు. గాంధీజీకి నమస్కారం చేస్తున్నట్లుగా ముందుకు వంగి అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. ఆ తరువాత స్వయంగా తానే “పోలీస్” అంటూ పిలిచి లొంగిపోయారు. ఆయన కోర్ట్ లో వినిపించిన వాదన ౠమే ఇట్ ప్లీజ్ యువర్ ఆనర్’ అనే పుస్తకంగా వెలువడింది.

అయితే హత్యప్రయత్నం జరిగిన వెంటనే గాంధీజీని ఆసుపత్రికి తరలించకుండా బిర్లా హౌస్ కు ఎందుకు తీసుకువెళ్లరాన్న ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం దొరకదు.

ఆర్.ఎస్.ఎస్ పై కాంగ్రెస్ దుష్ప్రచారం:
ఈ సంఘటనకు ఆర్ ఎస్ ఎస్ కు సంబంధం ఉందనడానికి ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ, ఇందులో ఆర్ ఎస్ ఎస్ పాత్ర లేదని సాక్షాత్తు సర్దార్ వల్లభాయి పటేల్ చెపుతున్నప్పటికీ ఆర్ ఎస్ ఎస్ పై నిషేధాన్ని విధిస్తున్నట్లు నెహ్రూ ప్రకటించారు. ఈ విషయం నెహ్రూ, పటేల్ ల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాల్లో తెలుస్తుంది.

గాంధీజీ హత్య జరిగి నెలరోజులు కాకుండానే 27 ఫిబ్రవరి 1948న పటేల్ ఒక ఉత్తరం వ్రాసారు. గాంధీజీ హత్యలో ఆర్ ఎస్ ఎస్ ప్రమేయం ఉందనడానికి తగిన ఆధారాలు అన్వేషించాలంటూ నెహ్రూ వ్రాసిన లేఖకు సమాధానంగా పటేల్ ఇలా వ్రాసారు- “బాపు హత్య కేసుకు సంబంధించిన దర్యాప్తును నేను ప్రతి రోజు పర్యవేక్షిస్తూనే ఉన్నాను. ఈ కేసులో దొషులందరి వాంగ్మూలాలను నమోదు చేశారు. వీటిని బట్టి ఆర్ ఎస్ ఎస్ కు ఈ సంఘటనతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టమవుతోంది”.

ఆర్ ఎస్ ఎస్ ను నిషేధించడానికి బలమైన ఎలాంటి ఆధారం లేకపోయినా నెహ్రూ ఆ పని చేయాలనుకోవడానికి గల కారణం గురుజి గోల్వాల్కర్ లో ఆయన బలమైన రాజకీయ ప్రత్యర్ధిని చూసి ఉండవచ్చనిపిస్తుంది. నిజానికి గాంధీజీ హత్యకు సరిగ్గా ఒక రోజు ముందు, జనవరి 29న నెహ్రూ మాట్లాడుతూ “నేను ఆర్ ఎస్ ఎస్ ను తొక్కివేస్తాను” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

గోల్వాల్కర్ కు ఎంతో ప్రజాదరణ ఉందని 1949లో బీబీసి కూడా వ్యాఖ్యానించింది. బీబీసి రేడియో ప్రసారం చేసిన ఒక రిపోర్ట్ లో ‘భారత ఆకాశమండలంలో ఉద్భవించిన, ఉజ్వలంగా ప్రకాశిస్తున్న తార గోల్వాల్కర్. ఆయన తరువాత అంతటి సంఖ్యలో ప్రజా వాహినిని కదిలించే వారు ప్రధాని నెహ్రూ మాత్రమే’ అంటూ పేర్కొంది. గోల్వాల్కర్ అప్పుడు ఆర్ ఎస్ ఎస్ సర్ సంఘచాలక్ గా ఉన్నారు.

ఫిబ్రవరి 4,1948న ప్రభుత్వం ఆర్ ఎస్ ఎస్ పై నిషేధం విధించింది. నిషేధానికి వ్యతిరేకంగా సంఘ స్వయంసేవకుల సుదీర్ఘమైన పోరాటం తరువాత సెప్టెంబర్ 14,1949న ప్రభుత్వం బేషరతుగా నిషేధాన్ని తొలగించింది.

బొంబాయి శాసనసభకు సమర్పించిన లిఖితపూర్వక ప్రకటనలో(శాసన సభ పత్రాలు పుట.2126) ఆర్ ఎస్ ఎస్ పై నిషేధాన్ని కొనసాగించడానికి ఎలాంటి అవసరం కనిపించడం లేదని, కనుక బేషరతుగా నిషేధాన్ని ఎత్తివేస్తున్నామని, ఆర్ ఎస్ ఎస్ ఎలాంటి హామీ పత్రం ఇవ్వలేదని హోమ్ మంత్రి మొరార్జీ దేశాయి పేర్కొన్నారు.

ఇలా ఆర్ ఎస్ ఎస్ పై ఎలాంటి నేరారోపణ చేయడానికి ఆధారాలు లేవని స్పష్టమైనప్పటికి కాంగ్రెస్ మాత్రం ఈ వ్యవహారాన్ని అక్కడితో వదిలిపెట్టలేదు. నెహ్రూ కుమార్తె అయిన ఇందిర 1966లో విశ్రాంత సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ జె ఎల్ కపూర్ నేతృత్వంలో మరో కమిషన్ ను ఏర్పాటు చేసింది.

ఆ కమిషన్ 100 మంది సాక్ష్యులను విచారించిన తరువాత 1969 లో అంతిమ నివేదిక సమర్పించింది. కపూర్ కమిషన్ తన నివేదికలో ఇలా పేర్కొంది – “..మహాత్మా గాంధీ హత్యలో ఆర్ ఎస్ ఎస్ కు ఎలాంటి పాత్ర లేదు. ఈ ఘోరమైన నేరంలో ఆ సంస్థ పేరును ప్రస్తావించడానికి ఎవరికి వీలులేదు. దోషులు ఎవరు ఆర్ ఎస్ ఎస్ సభ్యులని ఎక్కడా నిరూపితం కాలేదు..”.

వీర సావర్కర్ పైన కూడా దుష్ప్రచారం
భగత్ సింగ్ వంటి అనేకమంది స్వాతంత్య్ర యోధులకు స్ఫూర్తిని కలిగించారు స్వతంత్ర వీర సావర్కర్. ఆయనపైనా కూడా ప్రభుత్వం గాంధీజీ హత్య నేరాన్ని మోపింది. ఎలాంటి ఆధారాలు లభించనప్పటికీ, అవి ఏవి నిరూపితం కానప్పటికీ కాంగ్రెస్ మద్దతుతో కమ్యూనిస్టులు ఈ ఆరోపణలను పదేపదే చేస్తూ వచ్చారు. 2013లో కూడా ఇవే ఆరోపణలు మళ్ళీ చేశారు. కమ్యూనిస్ట్ ఆరోపణలను ప్రచారం చేస్తూ ది హిందూ పత్రిక వ్యాసం కూడా ప్రచురించింది. ఈ ఆరోపణలను ఖండిస్తూ అనేకమంది, అనేక వ్యాసాలు కూడా వ్రాసారు.

నెహ్రూ గురించి సమాధానం దొరకని కొన్ని ప్రశ్నలు
దేశ ప్రధానిగా పటేల్ కావాలంటూ పెద్ద ఎత్తున ప్రజాభిప్రాయం వెల్లువెత్తినా నెహ్రూ ప్రధాని అయ్యారు. దేశ విభజన విపత్కర సమయంలో కాంగ్రెస్ రెండుగా చీలకుండా అడ్డుకునేందుకే గాంధీజీ నెహ్రూ అభ్యర్ధిత్వానికి మద్దతు తెలిపారని అప్పటి కొన్ని పత్రాల ద్వారా మనకి స్పష్టమవుతోంది. పటేల్ నెహ్రూ కింద పనిచేస్తారుకానీ, నెహ్రూ పటేల్ మాట వినరని గాంధీజీకి అనిపించింది.

నెహ్రూ అమలు చేసిన కొన్ని విధానాలను వ్యతిరేకించిన గాంధీజీ ఆ విధానాలపై బహిరంగ చర్చ జరగాలన్నారు. దీనితో వెనకడుగు వేసిన నెహ్రూ అలాంటి చర్చకు ఎప్పుడు సిద్ధం కాలేదు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ కనిపించకుండా పోవడం, గాంధీజీ హత్యకు గురికావడం, సావర్కర్ పై హత్యారోపణ,గోల్వాల్కర్ పై దుష్ప్రచారంతో నెహ్రూకు తిరుగన్నదే లేకపోయింది.

1953లో నెహ్రూకు ప్రత్యర్ధి కాగలరని భావించిన శ్యామప్రసాద్ ముఖర్జీ అనుమానాస్పద పరిస్థితుల్లో జమ్ము కాశ్మీర్ జైల్ లో మరణించారు. అప్పట్లో ఆ రాష్ట్రపు వ్యవహారాలు పూర్తిగా నెహ్రూ చేతిలో ఉండేవి.

పై పరిణామాలన్నీ మూలంగా నెహ్రూ బాగా లాభపడ్డారు. ఆయన 17 ఏళ్లపాటు దేశ ప్రధానిగా ఉన్నారు. నిజానికి కాంగ్రెస్ ను పూర్తిగా రద్దు చేయాలని గాంధీజీ భావించారు.

ఇలా దేశంలో ప్రముఖులను లక్ష్యం చేసుకుని ఆరోపణలు ఎందుకు చేశారన్నది తెలుసుకునేందుకు ఇప్పటివరకు ఎలాంటి విచారణ జరగలేదు. గొప్ప స్వాతంత్య్ర యోధుడైన వీర్ సావర్కర్, ఋషితుల్యులైన గోల్వాల్కర్ లపై ఇలా బురద జల్లడానికి ఎందుకు ప్రయత్నించారని ఎందుకు నెహ్రూ, కాంగ్రెస్ లను ఎవరూ అడగలేదన్నదే ప్రశ్న.

మరికొన్ని ప్రశ్నలు
కాల్పులు జరిగిన వెంటనే గాంధీజీని ఆసుపత్రికి కాకుండా బిర్లా హౌస్ కు ఎందుకు తరలించారు?

హత్య గురించి గూఢచారి సమాచారం ఏది లభించలేదా? అంతకు ముందే గాంధీజీ పై 4సార్లు హత్యా ప్రయత్నం జరిగిన నేపధ్యంలో ఎలాంటి ముందుజాగ్రత్త చర్యలు నెహ్రూ ప్రభుత్వం చేపట్టింది? ఈ సంఘటనకు ఎవరినైనా అధికారులను బాధ్యులను చేశారా?

వ్యక్తిగత స్థాయిలోనే తాను హత్యకు పాల్పడ్డానని ఒక పక్క గాడ్సే చెపుతున్నప్పటికీ ఈ సంఘటనను ఒక సంస్థతో ముడిపెట్టాలని నెహ్రూ అంతగా ఎందుకు తాపత్రయపడ్డారు?

అవుట్ లుక్ (జనవరి 1998) పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్ ఎస్ ఎస్ 4వ సర్ సంఘచాలక్ ప్రొ. రాజేంద్ర సింహ్ గాడ్సే గురించి ఇలా చెప్పారు -ౠౠమొదట కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్న గాడ్సే ఆతరువాత కొంతకాలానికి ఆర్ ఎస్ ఎస్ లో చేరారు. కానీ ఎక్కువ కాలం అక్కడ ఉండలేదు.

అది చాలా నిదానమైన సంస్థ అంటూ బయటకు వచ్చేశారు. తరువాత సొంతంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. “గాంధీజీ హత్యలో ప్రమేయం ఉన్నదా, లేదా అని ఆర్ ఎస్ ఎస్ పై విచారణ జరిగినప్పుడు అంతకు ముందు గాడ్సే సభ్యుడిగా ఉన్న కాంగ్రెస్ పైన కూడా అలాంటి విచారణ ఎందుకు జరగలేదు?” అని రాజేంద్ర సింహ్ ప్రశ్నించారు.

రాజ్య శక్తిని ఉపయోగించి హిందూ జాతీయవాదులను అణచివేయాలన్న తన ప్రయత్నానికి గాంధీజీ హత్యను ఒక సాకుగా నెహ్రూ వాడుకున్నారు. అలాగే హిందూ ఫాసిజం అంటూ దేశంలో ప్రధాన అంశాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రయత్నించారు.

ఇది ప్రజల దృష్టిని మరల్చేందుకు మార్క్సిస్ట్ లు అనుసరించే పద్దతికి చక్కని ఉదాహరణ . ఇలా దేశానికి సంబంధించిన ప్రధాన విషయాల నుంచి ప్రజల దృష్టిని మరాల్చాలనుకోవడానికి నెహ్రూ, కాంగ్రెస్ లు ఎందుకు ప్రయత్నించారన్నది ప్రతి భారతీయుడు అడగవలసిన ప్రశ్న.

ఆయూష్ నడింపల్లి  

Source: VijayaKranthi