కాశీకి పోతే కాటికి పోయినట్టే’ అనే నానుడి భారతీయులకు తెలిసిందే. జీవితంలో ఒక్కసారైనా కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకోవాలని కోరుకోని హిందువు ఉండడు. ఎందుకంటే విశ్వనాథుని దర్శనంతో మోక్షం లభిస్తుందనే విశ్వాసం అనాది నుంచి ఉంది. అంతేకాకుండా ప్రళయ కాలంలో కూడా కాశీ పట్టణం మునగ లేదు. ఇక్కడి గంగా నదిలో మునిగితే సర్వ పాపాలకు పరిహారం లభిస్తుందని పురాణేతి హాసాలు చెబుతున్నాయి. అందుకే హిందువులకు కాశీ పట్టణం ఎంతో పవిత్రమైన పుణ్య తీర్థం. అంతటి పుణ్య తీర్థాన్ని కాపాడేందుకు, అక్కడి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కషి చేస్తోంది.
ఒకప్పుడు ఆధ్యాత్మికంగానే భారతీయులకు తెలిసిన వారణాసి నేడు పర్యాటకంగా కూడా అభివృద్ధి చెందుతోంది. కేవలం దేశీయులనే కాకుండా విదేశీయులను కూడా తన వైపు ఆకర్షిస్తోంది. ఎందరినో భక్తి, ముక్తి మార్గాల వైపు నడిపిస్తోంది. ఇక్కడ కేవలం దైవీయ పూజలే కాకుండా కర్మకాండలు కూడా జరుగుతాయి. శరీరం తుచ్ఛమైనదనే సందేశాన్ని కళ్ళకు కడుతుంటాయి వారణాసిలో ఎదురయ్యే అనుభవాలు. పట్టణంలోని వీధులలో, ఆలయ పరిసరాలలో నాగా సాధువులు కనిపిస్తుంటారు. ఒంటిపై బూడిద పూసుకొని ఎప్పటికైనా మట్టిలో కలవాల్సిందేననే సందేశానికి నిలువెత్తు రూపాలుగా నిలుస్తారు. కాశీకి వెళ్లినప్పుడు మనకు ఏదైనా ఇష్టమైనదాన్ని వదులుకోవాలనే సందేశం కూడా ప్రాచుర్యంలో ఉంది. ఇలా చేసినా, కాశీలో కర్మకాండలను జరిపినా, గంగలో అస్తికలను కలిపినా మోక్షం ప్రాప్తిస్తుందని అనాదిగా భారతీయుల ప్రగాఢ విశ్వాసం.
అందుకే మనదేశంలో చాలా మంది మరణించిన వారి దహన సంస్కారాలను కాశీలో నిర్వహిస్తారు. పూర్వం ప్రయాణ సాధనాలు లేని కారణంగా చాలా మంది వానప్రస్థంలో కాశీకి వచ్చి అక్కడే శేష జీవితాన్ని గడుపుతూ తుది శ్వాస విడిచేవారు. అలా మృతిచెందిన వారికి నాగా సాధువులు కర్మకాండలు జరిపేవారు. కాలక్రమంలో రవాణా వ్యవస్థ మెరుగు పడింది. నేడు అనేక మంది భక్తులు దర్శనార్థం వచ్చి వెళ్తున్నారు. స్థోమత కలిగినవారు మృతిచెందిన వారి కర్మకాండలను జరిపిస్తున్నారు. ఇలా గత కొద్ది సంవత్సరాలుగా వారణాసిలో దహన సంస్కారాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. దీంతో కాలుష్యం కూడా పెరగడం ప్రారంభమైంది. గంగా నది కూడా కలుషితం అవ్వడం ఆరంభమైంది. కాలుష్యాన్ని నివారించ డానికి, పర్యావరణ పరిరక్షణకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. దేహ దహనానికి కలప స్థానంలో దేశీయ ఆవు పేడతో చేసిన పిడకలను వినియోగించాలని తీర్మానించింది.
ఇందుకు వారణాసి పాలక వర్గాలు తగిన ప్రణాళికలు రూపొందించాయి. పిడకల తయారీ ద్వారా ఉపాధి కల్పించడం, గోవులను రక్షించడం ఒక వైపు అయితే ఆ పిడకలను ఉపయోగించి చెట్లను రక్షించడం మరో కోణం. అంతేకాకుండా దేశీయ ఆవు పేడతో చేసిన పిడకలు పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించవు. అయితే సనాతన ధర్మాన్ని ఆచరించేవారు ధర్మ శాస్త్రాలకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. శాస్త్రాలకు అనుగుణంగా దహన సంస్కారాలను నిర్వహించాలని అనుకుంటారు. ఈ నేపథ్యంలో కట్టెలకు బదులు పిడకల వినియోగం శాస్త్రబద్ధమైనదేనా అనే సందేహం వారణాసి పాలక వర్గాలకు వచ్చింది. ఇందుకు వారు పండితులను సంప్రదించి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. పిడకలతో మృత శరీరాన్ని దహనం చేయడం వల్ల ఎటువంటి దోషం ఉండదని పండితులు అధికారులకు తెలిపారు. దీంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. దేశీయ గోమయంతో తయారుచేసిన పిడకలను దహన సంస్కారాల నిర్వహణకు అందుబాటులోకి తెచ్చారు. వారి ప్రయోగం మెల్లగా ఫలించింది.
కలి ప్రభావం కారణంగా ఎటువంటి శుభకార్యాన్ని ప్రారంభించినా ఆదిలో విఘ్నాలు రావడం సాధారణమైన విషయమే. అటువంటి సమస్యలనే వారణాసి అధికార యంత్రాంగం ఎదుర్కొంది. ముఖ్యంగా స్థానిక కట్టెల వ్యాపారులు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు, నిరసనలు తెలిపారు. వారికి పలువురు మద్ధుతు కూడా తెలిపారు. అయితే అధికారులు మాత్రం తమ నిర్ణయాన్ని మార్చుకోలేదు. నిశ్చయంగా ముందడుగు వేశారు. స్థానిక ఆధ్యాత్మిక సంస్థల సహకారాన్ని పొందారు. అలా దేశీయ ఆవు పేడతో చేసే పిడకలను దహన సంస్కారాలకు ఉపయోగించేలా అవగాహన కార్యక్రమాలను ప్రారంభించి మార్పు వైపు విజయవంతంగా అడుగులు వేస్తున్నారు.
వారణాసిలోని మణికర్ణిక ఘాట్‌లో రోజుకు 100కు పైగా కర్మకాండలు జరుగుతాయి. ఒక్కో దేహ దహనానికి 300ల నుంచి 400ల కి.లో గ్రాముల వరకు కట్టెలు అవసరం అవుతాయి. అంటే సగటునా 4000 కేజీల కట్టెలు అవసరమవుతాయి. కేవలం ఒక్క ఘాటులో వినియోగించే కట్టెల బరువు ఇది. అంటే రోజుకు వేలాది చెట్లు గొడ్డలివేటుకు బలవు తాయి. మృత శరీరాలతో పాటు బూడిదవుతాయి. అలా చెట్లను ఇష్టానుసారంగా నరకడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. టన్నుల కొద్ది బూడిద నీటిలో కలిసి గంగానది కలుషిత మవుతోంది. అటువంటి సమస్యలను నివారించేందుకే దేశీయ ఆవు పేడతో చేసిన పిడకలను దహన కార్యానికి ఉపయోగించాలని వారణాసి పాలక వర్గాలు కోరుతున్నాయి. అలాగే కట్టెల వ్యాపారులకు కూడా ప్రత్యామ్నాయ ఉపాధిని కల్పిస్తామని అధికార యంత్రాంగం చెబుతోంది.
దేశీయ ఆవుపేడతో చేసిన పిడకలతో ఇప్పటికే నాగపూర్, జైపూర్, రోహతక్, జలగావ్, ఇండోర్, రాయ్‌పూర్, రూర్కెలాల్లో దహన సంస్కారాలు నిర్వ హిస్తున్నట్లు కాశీ మోక్ష దాయని సమితి స్పష్టం చేసింది. గోమూత్రం, గోమయం ఎంతో పవిత్రమై నవని ఈ సమితి చెబుతోంది. అందుకే గో ఆధారితమైన పిడకలను వాడడం వల్ల పర్యావరణానికి హాని కలుగదని, దహన సంస్కారాలలో దోషం ఉండదని ఈ సమితి ప్రచారం చేస్తోంది. ఈ ఆచరణీయమైన కార్యానికి ప్రతి ఒక్క హిందువు మనస్ఫూర్తిగా సహకరించాలని పిలుపునిస్తోంది. భారతీయ సంస్కృతి పర్యావరణ హితకారి అని నిరూపించడానికి హైందవులు ముందుకు రావాలని వారణాసి పాలక వర్గం కోరుతోంది.
దేశీయ ఆవు పిడకల వినియోగానికి పర్యావరణవేత్తలు కూడా ఆమోదం తెలుపుతున్నారు. వాటిని వినియోగించడం వల్ల కాలుష్యానికి ఆస్కారం ఉండదని పేర్కొంటున్నారు. అంతేకాకుండా అడవులను కాపాడుకున్న వారమవుతామని చెబుతున్నారు. దేశీయ ఆవు పిడకల వినియోగాన్ని ప్రోత్సహించేలా మరిన్ని చర్యలు ప్రభుత్వం చేపట్టాలని కోరుతున్నారు. కేవలం దహన సంస్కారాలకే కాకుండా ఎరువుల తయారీకి కూడా ఆవు పిడకలతో చేసిన బూడిద ఎంతగానో ఉపయోగపడుతుందని, సారవంతమైన ఎరువుల తయారీకి దోహదం చేస్తుందని చెబుతున్నారు. అంతేకాకుండా గోహత్యలను కొంత వరకు నివారించి గోసంపదను కాపాడు కోవడంతోపాటు వేలాది మందికి ఉపాధి కల్పించనట్లవుతుందని పేర్కొంటున్నారు. ఇంతటి ఆచరణాత్మక కార్యానికి హిందువులు మద్ధతు తెలిపి గోవులను, గంగను కాపాడుకోవాలని ఆధ్యాత్మిక వేత్తలు పిలుపునిస్తున్నారు.
ఆవు పిడకలతో ఆన్‌లైన్ వ్యాపారం
హిందూ సాంప్రదాయం ప్రకారం ఏ పండగొచ్చినా, ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగినా తప్పక ఉండాల్సింది ఆవు పేడ, పిడకలు. కానీ ప్రస్తుతమున్న కాంక్రీట్ సమాజంలో ఆవుపేడ సేకరించి పిడకలు తయారుచేయటం చాలా శ్రమతో కూడుకున్న పని. కానీ ఆవుపిడకలు లేనిదే కొన్ని కార్యక్రమాలు చేయలేరు. సరిగ్గా ఈ అవకాశాన్నే తన విజయ సోపానంగా మార్చుకుంది ఆ అమ్మాయి. పేరు ప్రీతికర్లా.. ఉండేది ఢిల్లీలో.. నాగరికత పెరుగుతున్న నేపథ్యంలో ఆవు పిడకలను అందరికీ అందుబాటులోకి తేవాలనుకుంది. అందుకోసం ఆన్‌లైన్‌లో పిడకల వ్యాపారాన్ని ప్రారంభించింది. ఢిల్లీలో మతపరమైన పూజలకు అవసరమయ్యే పూజాసామాగ్రిని అమ్మే వ్యాపార సంస్థ ఉంది తనకి. తన దగ్గరికి వచ్చిన వాళ్లంతా ఆవు పిడకలను అడగడం చూసి అవి ఎంత ఆవశ్యకమో గుర్తించింది. అందుకే ఈ విషయాన్ని అవకాశంగా తీసుకుని ఆవుపిడకల ఆన్‌లైన్ వ్యాపారాన్ని షురూ చేసింది. 8 పిడకలు ఉన్న ప్యాకెట్‌ను రూ.419 ధర పెట్టి ఆన్‌లైన్లో పెట్టేసింది. దీనికి ప్రముఖ ఆన్ లైన్ కంపెనీ అమెజాన్ తోడైంది. ప్రస్తుతం ఆమె నెలకు 3 వేల పిడకల ప్యాకెట్లు అమ్ముతోంది. క్రమక్రమంగా తన వ్యాపారం లాభాలబాటలో నడుస్తోంది. ఏది ఏమైనా ఎక్కడికి వెళ్లి పిడకల్ని కొనాలో తెలియక ఇబ్బంది పడే నగర ప్రజలు మాత్రం ఆన్‌లైన్లో పిడకలు కొనుక్కుంటూ ప్రీతికర్లాను అభినందనలతో ముంచెత్తుతున్నారు.
– విజేత
(జాగృతి సౌజన్యం తో)