జూన్ 10న మహారాష్ట్ర జల్గావ్ జిల్లాలోని జంనీర్ తాలూకాకు చెందిన వాకాడి గ్రామంలో ఇద్దరు అబ్బాయిలపై దాడి జరిగింది. వారిని విపరీతంగా కొట్టారు. బాధితులు ఇద్దరు షెడ్యూల్ కులానికి చెందినవారు.
అయితే ఈ సంఘటనలో నిందితుడు (ఈశ్వర్ జోషి) నిజానికి సంచార జాతులకు (నోమాడిక్ ట్రైబ్) చెందినవాడు. మీడియాలో ప్రచారం జరిగిన విధంగా అతను బ్రాహ్మణ వర్గానికి చెందినవాడు కాదు.
ఇద్దరు అబ్బాయిలకు నిందితుడికి చెందిన బావిలో నగ్నంగా ఈత కొట్టడం అలవాటు. చుట్టుపక్కల నివసించే ప్రజలంతా ఆ బావి నీళ్లే తాగడానికి ఉపయోగిస్తారు.
దానితో అలా బావిలో ఈత కొట్టవద్దని వారికి చాలాసార్లు హెచ్చరించారు. ఇదే విషయాన్ని వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చెప్పారు. కానీ వారిమాట పట్టించుకోకుండా మరోసారి వాళ్ళు అదే పని చేయడంతో ఈసారి బావి యజమాని (ఈశ్వర్ జోషి) వాళ్ళను పట్టుకుని బాగా కొట్టి పంపించాడు. వాళ్ళు అప్పటికే విప్పి బయటపెట్టిన బట్టలు తొడుక్కుని అక్కడ నుంచి వెళ్ళిపోయారు.
అంతేకాని కొందరు అనుకుంటున్నట్లుగా వారి బట్టలు ఊడదీసి కొట్టలేదు, నగ్నంగా ఊరేగించలేదు. ఈత కోసం ముందే వాళ్ళు బట్టలు విప్పి బావిలోకి దూకారు. ఈ ఉదంతాన్ని నిందితుడు వీడియో తీసి దానిని వాట్స్ అప్ లో ఉంచాడు. వీడియో క్లిప్ చూసిన కొందరు ఉద్యమకారులు నిందితుడిపై కేసు పెట్టలంటూ బాధిత అబ్బాయిల తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చారు. నిందితుడిపై పోస్కో (వేధింపుల నిరోధక చట్టం) 323,504,506 సెక్షన్ ల ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అయితే ఈ సంఘటనకు కుల వివక్షగానీ, దళిత వ్యతిరేక ధోరణిగాని కారణం కాదని స్పష్టమవుతోంది. ఇందులో ఏ `అగ్ర కుల’ వ్యక్తికి సంబంధం లేదని కూడా తెలుస్తోంది.