Home News గౌరి లంకేష్ హత్య కేసు : పరశురామ్ వగ్మర్ కు శిక్షణ ఇచ్చి, బులెట్లు అందించింది...

గౌరి లంకేష్ హత్య కేసు : పరశురామ్ వగ్మర్ కు శిక్షణ ఇచ్చి, బులెట్లు అందించింది కాంగ్రెస్ ఎమ్మెల్సీ వ్యక్తిగత సహాయకుడు

0
SHARE

గౌరి లంకేష్ హత్య కేసులో 10వ నిందితుడు రాజేశ్ డి. బంగెరా ప్రత్యేక విచారణ బృందం (సిట్)ముందు తన నేరాన్ని అంగీకరించాడు. తాను గౌరి లంకేష్ పై కాల్పులు జరిపినట్లు భావిస్తున్న పరశురాం వగ్మర్ కు ఆయుధాలు ఉపయోగించడంలో శిక్షణ ఇవ్వడమేకాక, బుల్లెట్లు కూడా అందజేశానని ఒప్పుకున్నాడు. కొడగు జిల్లాకు చెందిన రాజేశ్ స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్సీ వీణా అచ్చయ్య వ్యక్తిగత సహాయకుడుగా(పీఏ) పనిచేస్తున్నాడు. రాజేశ్ అంతకు ముందు విద్యా శాఖలో అధికారిగా పనిచేసి ఆ తరువాత జిల్లా పంచాయత్ అధికారి శేరిన్ సుబ్బయ్య వ్యక్తిగత సహాయకుడుగా ఉన్నాడు. ప్రస్తుతం వీణా అచ్చయ్య దగ్గర పనిచేస్తున్నాడు.

రాజేశ్ బంగెరా ఒకప్పుడు సనాతన్ సంస్థ సభ్యుడిగా ఉండేవాడు. ప్రభుత్వోద్యోగం వచ్చిన తరువాత సంస్థకు దూరంగా ఉంటున్నాడు. వారం క్రితం కొడగులో అడుగుపెట్టిన సిట్ బృందం చివరికి రాజేశ్ ను అరెస్ట్ చేసింది.

రాజేశ్ వాగ్మూలం రికార్డ్ చేసిన పత్రాలను ఒక సీల్డ్ కావర్లో సిట్ కోర్ట్ కు సమర్పించింది. గౌరి లంకేష్ హత్యలో తన పాత్ర ఉన్నట్లు రాజేశ్ ఒప్పుకున్నాడని తెలుస్తోంది. “అతని దగ్గర లైసెన్స్ ఉన్న రెండు తుపాకులు ఉన్నాయి. తుపాకి కాల్చడంలో అతనికి మంచి ప్రావీణ్యం ఉంది. రాజేశ్ కు అమోల్ కాలే, ఇతరులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గౌరి లంకేష్ హత్యలో పాల్గొన్న వారికి రాజేశ్ 20 బుల్లెట్లు అందజేశాడు. అంతకు ముందు పరశురామ్ కు శిక్షణ ఇచ్చినట్లు కూడా ఒప్పుకున్నాడు. కర్ణాటక, మహారాష్ట్రాల్లోని పలు ప్రదేశాల్లో ఈ శిక్షణ సాగింది.’’అని ఒక సిట్ అధికారి వెల్లడించారు. కాలే నుంచి స్వాధీనం చేసుకున్నా ఒక డైరీ లో రాజేశ్ పేరు కనిపించింది. “ కాలే తన డైరీలో `రాజేశ్ సర్’ అంటూ రాసుకున్నాడు.  అప్పుడు మాకు  రాజేశ్ గురించి తెలిసింది. ఆ ఆధారాన్ని పట్టుకుని మరింత సమాచారం సేకరించాం’’అని ఆ అధికారి తెలియజేశారు.

(న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్  సౌజన్యం తో)