Home News హైదరాబాద్ పాతబస్తీలో లో ఓటరు జాబితా.. తప్పుల తడక!

హైదరాబాద్ పాతబస్తీలో లో ఓటరు జాబితా.. తప్పుల తడక!

0
SHARE
  • ఓల్డ్‌హౌస్‌ పేరుతో 2,530 ఓట్లు!
  •   ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన వికారుద్దీన్‌కూ ఓటు
  •   17-1-181/ఏ/38లో 586 మంది
  • పరిశీలనలో వెల్లడైన జాబితా డొల్లతనం

ఎన్ని సర్వేలు చేసినా ఓటరు జాబితా తీరు మారడం లేదు.. పాతబస్తీ నియోజకవర్గాలకు సంబంధించి పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. ఒక్క యాఖుత్‌పురలోనే ఓల్డ్‌హౌస్‌ అనే డోర్‌ నంబరుతో 37, 289, 267, 281 పోలింగ్‌ బూత్‌ల పరిధిలో 2,530 ఓట్లు ఉన్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అదే సెగ్మెంట్‌లోని ఇంటి నంబరు 17-1-181/ఏ/38లో 586 మంది, చార్మినార్‌ సెగ్మెంట్‌లోని 2-2-676/1 డోర్‌ నంబరుతో 176 ఓట్లు ఉండగా… ఆయా డోర్‌ నంబర్లు క్షేత్రస్థాయిలో కనిపించకపోవడం గమనార్హం. ఈ తరహాలో నగరంలోని 3,971 డోర్‌ నంబర్లలో వందల కొద్దీ   ఓటర్లుండటం జాబితాలోని డొల్లతనాన్ని స్పష్టం చేస్తోంది.

పలుసార్లు సవరించినా…

జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముందు ఒకసారి, ఎన్నికలయ్యాక మరోసారి, తాజాగా ఇప్పుడు ఓటరు జాబితా సవరణ ప్రక్రియ జరిగింది. అయినప్పటికీ దోషాలు అలాగే కొనసాగుతున్నాయి. ఈ దుస్థితి కొన్ని నియోజకవర్గాల్లో మరీ ఎక్కువగా ఉంది. తాజాగా గత సెప్టెంబరు 10న ప్రకటించిన ముసాయిదా జాబితాయే అందుకు నిదర్శనమని నేతలు గగ్గోలు పెడుతున్నారు. తప్పుల తడకగా ఉన్న జాబితాతో ఎన్నికలు నిర్వహించడం వల్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వికారుద్దీన్‌కు ఓటు.. ఐఎస్‌ఐ, సిమీ ఉగ్రవాద సంస్థలకు చెందిన వికారుద్దీన్‌, మరో నలుగురు అనుచరులు నల్గొండ జిల్లా ఆలేరులో జరిగిన ఎదురుకాల్పుల్లో చనిపోయారని ఏప్రిల్‌, 2015లో రాష్ట్ర పోలీసులు ప్రకటించారు. కానీ వికారుద్దీన్‌కు మలక్‌పేట్‌ నియోజకవర్గంలో ఓటరు గుర్తింపుకార్డు ఉండటం గమనార్హం.

ఎంత వెతికినా దొరకని జాడ.. స్థానిక పోలీసు కానిస్టేబుల్‌, గ్యాస్‌ సరఫరాదారు, జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య విభాగం సిబ్బందితో కలిసి ‘ఈనాడు’ ప్రతినిధులు యాఖుత్‌పుర, చార్మినార్‌ నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో వందల కొద్దీ ఓటర్లున్న పలు ఇంటి నంబర్లను వెతికే ప్రయత్నం చేశారు. చార్మినార్‌ పరిధిలోని దూద్‌బౌలి, జామియా నిజామియా, సిప్లిగంజ్‌ ప్రాంతాల్లో, యాఖుత్‌పురలోని కుర్మగూడ డివిజన్‌, సంతోష్‌నగర్‌, దారాబ్‌జంగ్‌, వికాస్‌నగర్‌, రెయిన్‌బజార్‌ ప్రాంతాల్లో పరిశీలించగా అధిక సంఖ్యలో ఓటర్లతో జాబితాలో ఉన్న పలు ఇళ్లు కనిపించలేదు. దీన్ని బట్టి ఆయా వందల ఓట్ల మర్మమేమిటో ఇట్టే అర్థమవుతోందని స్థానికులే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిస్థితి అనేక చోట్ల ఉన్నట్లు ‘ఈనాడు’ పరిశీలనలో వెల్లడైంది.

ఇలాంటి నకిలీలెన్నో..

* యాఖుత్‌పురలోని 17-2-314/1/5 ఇంటి నంబరులో ఇద్దరమే ఉంటున్నామని యజమాని దశరథ్‌ స్పష్టం చేశారు. కానీ ఆ నంబరుపై 210 మంది ఓటర్లున్నట్లు జీహెచ్‌ఎంసీ గణాంకాలు చెబుతున్నాయి. చమన్‌బజార్‌లో 374 ఓటర్లతో ఉన్న 17-1-175, వికాస్‌నగర్‌లో 586 ఓట్లున్న 17-1-181/ఏ/38 ఇళ్ల ఆచూకీ లభించలేదు.

* చార్మినార్‌లోని 20-2-676/1 డోర్‌ నంబరు గల ఇంటితోపాటు మరో ఐదు డోర్‌ నంబర్ల గురించి వాకబు చేయగా ఆచూకీ తెలియకపోవడం గమనార్హం.

* కనిపించలేదంటున్న డోర్‌ నంబర్లలో కొన్ని ఇళ్లు కూలిపోయి, మరికొన్ని కొత్తగా నిర్మాణమై ఉండొచ్చు. కానీ జాబితాలోని మెజార్టీ డోర్‌నంబర్లు కనిపించకపోవడమే అనుమానాలకు తావిస్తోంది.

సమగ్ర విచారణ జరిపిస్తేనే.. తాజా ఓటరు జాబితాను చూస్తే అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌, పకడ్బందీ పరిశీలన విధానం, ఇంటింటికి జియోట్యాగింగ్‌ అంటూ 2017లో జరిగిన ఐఆర్‌ఈఆర్‌ (ఇంటెన్సివ్‌ రివిజన్‌ ఆఫ్‌ ఎలక్ట్రోరల్‌ రోల్‌) పూర్తిగా విఫలమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తప్పుల తడకగా ఉన్న జాబితా, పోలింగ్‌ బూత్‌ల సరిహద్దులే అందుకు నిదర్శనం. ఐఆర్‌ఈఆర్‌ పేరుతో వెచ్చించిన నిధులు దుర్వినియోగం అయ్యాయని, విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

160 లేఖలు వెనక్కి..: పొన్న వెంకటరమణ, పాతబస్తీ నేత

ఎక్కువ మొత్తంలో ఓటర్లున్న 250 డోర్‌ నంబర్లకు తెల్లకాగితాన్ని రిజిస్టర్డ్‌ పోస్టు చేశా. వాటిలోని 160 వెనక్కి వచ్చాయి. ఇదేంటని అడిగితే ఆ డోర్‌ నంబర్లు కనిపించడం లేదని పోస్టల్‌ సిబ్బంది జవాబిచ్చారు.

(ఈనాడు సౌజన్యం తో)