Home News గిరిజనుల సేవలో సేవాభారతి

గిరిజనుల సేవలో సేవాభారతి

0
SHARE

– గిరిజనులలో వెలుగులను నింపుతున్న సేవాభారతి విజయవాడ

– 17 సంవత్సరాలుగా నిరంతర సేవ

– సేవాభారతి ద్వారా చదువుకొని ఉద్యోగులైన గిరిజనులు

– ప్రభుత్వ, ప్రైవేటు సహకారంతో మరిన్ని సేవా కార్యక్రమాలు

ఆ గిరిజన గ్రామాలలో విద్య లభించదు, వైద్యం చేసేవారు కనబడరు. రోగం వస్తే దగ్గర్లో ఉన్న పట్టణానికి పరుగెత్తాల్సిందే. దీనికితోడు ప్రతి సంవత్సరం మలేరియా వంటి అంటురోగాలు మేమున్నామంటూ పలకరిస్తాయి. ఇన్ని బాధల మధ్య కరువు, వరదలు కూడా మేమూ ఉన్నామంటూ ముందుకొస్తాయి.

అక్షరం ముక్క రాని మహిళలు; ఒకవేళ ఎవరైనా తమ పిల్లలను పాఠశాలకు పంపిస్తే, అది ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగటం గగనమే. బడికి వెళ్ళే పిల్లలు మధ్యలో ఎప్పుడైనా చదువు మానెయ్యవచ్చు. ఈ అవిద్య వల్ల, పోషకాహారం తీసుకోవాలనే అవగాహనా రాహిత్యం వల్ల ఆ గ్రామాలలో మాతా-శిశు మరణాలూ ఎక్కువగానే ఉంటున్నాయి. ఇక బతికి బట్టకట్టిన కొద్దిమంది కూడా అంటువ్యాధులు, రోగాలబారిన పడి దీనావస్థలో బతుకులు వెళ్ళదీస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రధాన జీవన స్రవంతికి పది ఆమడల దూరంలో ఉన్నారు అక్కడి గిరిజనులు.

తూర్పు గోదావరిలో..

ఈ దీనస్థితి ఎక్కడో ఉన్న ఈశాన్య రాష్ట్రాలలో అనుకుంటే పొరబడినట్లే. అభివృద్ధి పథంలో ముందుకెళుతున్న తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో గల చింతూరు, వరరామచంద్రపురం, కూనవరం, వేలేరుపాడు మండలాలలో గల గ్రామాలలోనిది. ఈ 4 మండలాలలో గల దాదాపు 200 గ్రామాలలో ఇదే స్థితి కొనసాగుతున్నది.

ప్రభుత్వమూ, ప్రభుత్వ యంత్రాంగమూ ప్రజా సంక్షేమం కోసం ఎన్నో వేల కోట్ల ఖర్చు పెడుతూ ఉంటుంది. కాని వారెవ్వరికీ ఇటువంటి గిరిజన గ్రామాల దుస్థితి పట్టదు.

వెలుగులు నింపిన సేవాభారతి

అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న ఆ గిరిజన గ్రామాలలోకి ప్రవేశించింది సేవాభారతి. సహాయం కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న వారికి అభయహస్తం అందించి, వారి జీవితాలలో వెలుగులు నింపడమే సేవాభారతి స్వచ్చంద సంస్థ లక్ష్యం. ఆ లక్ష్యంతోనే సేవాభారతి విజయవాడ శాఖ 2000 సంవత్సరంలో ఈ 4 మండలాలపై తన దృష్టి కేంద్రీకరించింది.

కార్యరంగం

మొదట సేవాభారతి వారు ఆ గ్రామాలలోని విద్యార్థులలో ఉత్సాహం ఉన్న వాళ్ళను గుర్తించి, వారికి బోధించటంలో శిక్షణనిచ్చి ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దారు. ఇలా తయారైన గిరిజన ఉపాధ్యాయులే ఆధారంగా అక్కడి చుట్టుపక్కల గ్రామాలలో ఏకోపాధ్యాయ పాఠశాలలు ప్రారంభించింది సేవాభారతి. అప్పటివరకు పాఠశాలకు వెళ్ళని పిల్లలు, చదువు మధ్యలో ఆపివేసిన వారికి చదువు ఉచితంగా నేర్పటం ప్రారంభించారు. అలా మొత్తం 28 గ్రామాలలో పాఠశాలలు ప్రారంభించింది సేవాభారతి. అలా 2 సంవత్సరాలు గడిచాయి. ఈ రెండు సంవత్సరాలలో సేవాభారతి ఈ గిరిజన గ్రామాలలో చేస్తున్న కృషికి మెచ్చి I.T.D.A. (సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ) వారు సేవాభారతి నిర్వహిస్తున్న పాఠశాలలను తాము స్వీకరించి, వాటి నిర్వహణను చేపట్టారు.

ఈ వెసులుబాటుతో సేవాభారతి వారు మరికొన్ని కొత్త గ్రామాలలో వారి పనిని ప్రారంభించి, అక్కడ పాఠశాలలను ప్రారంభించారు. అలా 2007 నాటికి (అంటే 7 సంవత్సరాలలో) మొత్తం 130 గ్రామాలలో పాఠశాలలను ప్రారంభించారు.

వైద్యసేవలు, పోషకాహారం కూడా

సేవాభారతి అడుగుపెట్టిన గ్రామాలలో విద్యతో పాటు వైద్య సేవలు, పోషకాహారం కూడా అందిస్తుంటారు. దానితో ఆ గిరిజన గ్రామాలలో రోగాలు తగ్గుముఖం పట్టాయి. విద్యపై ప్రజలకు మక్కువ పెరిగింది. గిరిజనులు తమ పిల్లలను పాఠశాలలకు పంపడానికి ఇష్టపడుతున్నారు.

బ్రిడ్జ్‌ కోర్సు పాఠశాల

కొంతమంది చదువు మధ్యలో ఆపేసి ఉంటారు. అటువంటి వారిని మళ్ళీ బడి బాట పట్టించాలంటే వారికి మరచిపోయిన చదువును మళ్ళీ గుర్తుచేయాలి. అలా గుర్తుచేశాక వారిని పూర్తిస్థాయి పాఠశాలకి పంపి పై తరగతిలో వేస్తారు. అలా మరచిపోయిన చదువును మళ్ళీ గుర్తుచేసే కార్యక్రమమే బ్రిడ్జ్‌ కోర్సు పాఠశాల (RBC Schools). ఈ బ్రిడ్జికోర్సు పాఠశాలలను సేవాభారతి వారు రేఖపల్లిలో 2, కోతులగుట్టలో 1, బూర్గంపాడులో 1 ప్రారంభించారు. వీటిద్వారా గత 4 ఏళ్ళలో మొత్తం 2400 మంది చదువు మధ్యలో ఆపేసిన బాలబాలికలను మళ్ళీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు.

విద్యార్ధి వికాస యోజన

గంగాధర్

అన్ని వర్గాలలోనూ కొంతమంది ప్రతిభ గల విద్యార్థులుంటారు. అటువంటి విద్యార్థులను మంచి పాఠశాలలో చేర్పించి, మంచి విద్యనందిస్తే వారు ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. అలా ప్రతిభ గల విద్యార్థులను గుర్తించి, వారికి మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించడమే ‘విద్యార్థి వికాస యోజన’ కార్యక్రమ ఉద్దేశ్యం. ఈ కార్యక్రమం ద్వారా గిరిజన గ్రామాలలో 2009 సంవత్సరంలో కొండరెడ్డి (PTG), కోయ తెగలలోని ప్రతిభ గల బాలబాలికలలో గుణాత్మకమైన విద్యకొరకు సుమారు 130 మంది బాలికలను ఎంపిక చేసి, వారిని భాగ్యనగర్‌లోని శ్రీ సరస్వతి శిశుమందిర్‌లోనూ, 24 మంది బాలురను గుంటూరు జిల్లాలో నూతక్కి గ్రామంలో గల విజ్ఞానవిహార ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో చేర్పించి, చదివించారు.

ఉద్యోగులయ్యారు

ఉన్నత పాఠశాల చదువు పూర్తయిన మరికొంత మంది విద్యార్థులను వారి స్వావలంబన కొరకు వృత్తి విద్యా కోర్సులలో చేర్పించి, చదివిస్తున్నది సేవాభారతి. 80 మంది బాలికలను G.N.M మరియు Bsc (Nursing), ANM కోర్సుల కొరకు అపోలో, ఇండో అమెరికన్‌, ఉస్మానియా, మరియు G.V.R. కళాశాల నెల్లూరు వంటి విద్యా సంస్థల్లో చేర్పించి చదువు చెప్పించారు. వీరిలో ఇప్పటికి కోర్సులు పూర్తి అరున 12 మంది ఉద్యోగులయ్యారు. మిగిలిన వారికి స్పూర్తినిస్తున్నారు.

సేవాభారతి అందిస్తున్న సహకారంతో ఒకప్పుడు పశువులు కాస్తూ, బాలకార్మికులుగా ఉన్న చిన్నారి, నూపరాధ, పాయం సుమన్‌, మడకం గంగాధర్‌ వంటి గిరిజన యువత కుగ్రామాల నుండి భాగ్యనగర్‌ వరకు వచ్చి నర్సింగ్‌ కళాశాలలో చదివి నర్సులుగా సేవలందిస్తున్నారు. మరికొందరు ఇంజనీర్లుగా స్థిరపడ్డారు. వీరు ఎదిగి మిగతా సమాజానికి ఎంతో స్ఫూర్తినిస్తున్నారు.

బుచ్చిరెడ్డి : మారుమూల నిరుపేద కుటుంబంలో పుట్టిన నేను సేవాభారతి సహకారంతో 3వ తరగతి నుండి బి.ఎస్‌సి వరకు చదివి, ప్రస్తుతం భాగ్యనగర్‌లోని బసవతారకం కాన్సర్‌ హాస్పటల్‌లో పనిచేస్తున్నాను. మా తల్లితండ్రులు జన్మనిస్తే, సేవాభారతి జీవితానికి జీవం పోసింది. సేవాభారతి వలనే మాకు బయట ప్రపంచంతో పరిచయం ఏర్పడింది. సేవాభారతి కార్యకర్తగా పనిచేస్తూ సమాజ ఋణం తీర్చుకుంటాను.

బుచ్చి రెడ్డి

తుర్రం రాధ : చిన్న కుటుంబంలో పుట్టిన మాకు సేవాభారతి జీవితపు వెలుగును చూపించింది. అనురాగం, ఆప్యాయతతో పాటు మంచి నడవడిని నేర్చుకొన్నాను. ఎక్కడున్నా, ఎప్పుడైనా సేవాభారతి మా జీవితంలో భాగంగానే ఉంటుందని కోరుకుంటున్నాను. ప్రస్తుతం కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో స్టాఫ్‌ నర్స్‌గా పనిచేస్తున్నాను.

రాధ

చిన్నారి : నాకు భద్రాచలమే తెలియదు. బాల కార్మిక పాఠశాల నుండి హైదరా బాద్‌ కోఠి వరకు నన్ను నడిపించి తీర్చిదిద్దిన సేవా భారతి పెద్దలను ఎన్నడూ నేను మరచిపోలేను. ఉద్యోగంలో చేరగానే నాలాంటి గ్రామీణ నిరుపేదలకు తప్పక సహాయ పడతాను. ప్రస్తుతం ఉస్మానియాలో నర్సింగ్‌ చేస్తున్నాను.

చిన్నారి

నూపరాధ : ఆవులు తోలుకుంటున్న నన్ను బుజ్జ గించి బాలకార్మిక పాఠశా లలో చేర్పించి, నడిపించిన మరొక అమ్మ సేవా భారతి. అన్ని సమయాలలో నన్ను అర్ధం చేసుకొని నాకు అండగా ఉండి పెంచి పెద్దచేసిన సేవాభారతి ఋణం తీర్చుకుంటాను. నేను ఉస్మానియాలో నర్సింగ్‌ చేస్తున్నాను.

నుపరాద

డా|| పి.జగన్‌బాబు : నేను సేవాభారతి ఆధ్యర్యంలో నడుస్తున్న, బూర్గంపాడ్‌ ‘భారతీభవన్‌’ ఆవాసంలో 10వ తరగతి వరకు చదివి, ఆ తర్వాత సేవా భారతి ప్రోత్సాహంతో బి.డి.ఎస్‌. వరకు చదువుకున్నాను, చదువుతో పాటు సమాజంలో ఎలా మెలగాలో కూడా నేర్చుకున్నాను, సేవాభారతి నన్ను తల్లిలా ఆదరించి చదివించింది. ప్రస్తుతం భద్రాచలంలో ఐ.టి.డి.ఎ. సహకారంతో, దంతవైద్యునిగా గిరిజనుల సేవలో పాలుపంచుకొంటున్నాను.

డా జగన్ బాబు

రాబోయే 5 ఏళ్ళలో ఈ పని మరింత పెంచుతాం :

సేవాభారతి కార్యదర్శి ముత్తయ్య

ఈ గిరిజన మండలాలలోని గిరిజనుల సంక్షేమం కోసం పనిచేస్తున్న సేవాభారతి ఈ పనిని రాబోయే 5 సంవత్సరాలలో మరింత విస్తృతం చేస్తుందని, అందుకు తగ్గ కృషి చేస్తున్నామని సేవాభారతి చింతూరు డివిజన్‌ కార్యదర్శి కట్టం ముత్తయ్య అన్నారు.

గిరిజనుడైన కట్టం ముత్తయ్య 2000 సంవత్సరం నుండి సేవాభారతి నిర్వహించే ఏకోపాధ్యాయ పాఠశాలలో ఉపాధ్యాయునిగా తన పయనం ప్రారంభించారు. తరువాత డివిజన్‌ పర్యవేక్షకుడుగా ఎదిగి, ప్రస్తుతం సేవాభారతి చింతూరు డివిజన్‌ (ముంపు మండలాల) కార్యదర్శిగా పనిచేస్తున్నారు.

ముత్తయ్య సేవాభారతికి రాకముందు ఎమ్‌.పి.టి.సి. మెంబరుగా ఉన్నారు. సేవాభారతి కార్యక్రమాలు ముత్తయ్యకు ప్రేరణ కలిగించాయి. దాంతో రాజకీయాలకు దూరంగా ఉంటూ సేవాభారతి కార్యంలోనే పూర్తిగా నిమగ్నమై పనిచేస్తున్నారు. అందరి పట్ల ఆత్మీయంగా ఉండే ముత్తయ్య మౌలిక అంశాలపై మనసు పెట్టి గిరిజనుల ప్రగతికై పనిచేస్తున్నారు.

జాగృతితో ముత్తయ్య ముఖాముఖి ముచ్చటించారు.

ప్రశ్న : ఈ పనిలో మీకు ప్రేరణ ఎలా లభించింది?

సమాధానం : 2000 సంవత్సరం నాటికి మా గ్రామంలో 10వ తరగతి పూర్తి చేసింది నేనొక్కడినే. అప్పటికే నేను ఎమ్‌పిటిసి మెంబరుగా ఉన్నాను. సహజంగానే గ్రామంలోని పనులు పట్టించుకొనేవాడిని. 2000 సంవత్సరంలో సేవాభారతి టీచర్‌గా ఎంపిక అయ్యాను. అనంతరం పర్యవేక్షకుడిగా బాధ్యత స్వీకరించాను. ఇతర మారుమూల గ్రామాల వెనుకబాటు తనం, సేవాభారతి కార్యకర్తల పరిశ్రమ తీరు, సేవాభావం నాకు ప్రేరణ కలిగించారు. రాజకీయంగా చేయలేని నిర్మాణాత్మకమైన పని సేవాభారతి ద్వారా చేయగల్గుతాను అనే నమ్మకం నన్ను సేవాభారతి కార్యకర్తగా నిలబెట్టింది.

ప్రశ్న : మీరు ఆశించిన మార్పు వచ్చిందా?

స : నూరుశాతం కాకపోరునా గమనించ దగిన మార్పు వచ్చింది. చదువు పూర్తి చేసిన విద్యార్ధులు మంచి ఉద్యోగాలలో స్థిరపడ్డారు. కొందరు ఉపాధ్యాయులుగా ఆదర్శంగా జీవిస్తున్నారు. బి.యస్‌.సి. నర్సింగ్‌ పూర్తిచేసిన బాలికలు అపోలో, ఇండో అమెరికన్‌, ఉస్మానియా, కిమ్స్‌, మహావీర్‌ (హైదరాబాద్‌) కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రులలో 20 మంది వరకు పనిచేస్తున్నారు. మరికొందరు వారి గ్రామాల్లో సామాజిక అభివృద్ధిలో పాలుపంచుకొంటున్నారు. వీరంతా కొండరెడ్డి, కోయ తెగలకు చెందిన వారు. వీరి తల్లిదండ్రులలో అధికశాతం నిరక్షరాస్యులు, నిరుపేద కుటుంబాలకు చెందినవారు.

ప్రశ్న : ఆరోగ్యం కోసం సేవాభారతి ఏమి చేస్తున్నది ?

స : ప్రధానంగా ఈ గ్రామ వాసుల్లో ఆరోగ్యంపై చైతన్యం లేకపోవడం; రహదారి, ప్రయాణ సౌకర్యాలు లేకపోవడం; కలుషిత వాతావరణం కారణంగా ఎక్కువ మంది రోగగ్రస్తులై, అకాల మరణాలు సంభవిస్తున్నారు.

ఈ సమస్యలకు సమాధానంగా 2001 లో వరరామచంద్రాపురం, చింతూరు మండల కేంద్రాలలో 2 సంచార వైద్యశాలలు, 2 వైద్యశాలలు ప్రారంభించాము. ఇవి 46 కూడలి గ్రామాల ద్వారా 120 శివారు, మారుమూల గ్రామ ప్రజలకు ఉచిత వైద్య సేవలందిస్తున్నారు.

ప్రస్తుతం చింతూరు సంచార వైద్యశాల కేంద్రంగా 50 గ్రామాలకు ఉచిత వైద్యసేవలందిస్తున్నాము. 30 గ్రామాల్లో ‘ఆరోగ్య మిత్ర’ శిక్షణ ద్వారా, ప్రథమ చికిత్సపై శిక్షణ మరియు కిట్స్‌ అందజేసాము. యోగాసనాలు, మూలికావైద్యం నేర్పిస్తూ ఆరోగ్య అవగాహన అందిస్తున్నాము.

ప్రశ్న : ఇతర కార్యక్రమాలు వివరిస్తారా ?

స : – ఇవి కాక ప్రతి సంవత్సరం యువతీ యువకులకు వేసవి సెలవుల్లో వ్యక్తిత్వ వికాస తరగతులు 7 రోజుల పాటు నిర్వహిస్తున్నాము.

– ఉపాధి కొరకు 4 శిక్షణా కేంద్రాల ద్వారా 120 మంది నిరుపేద బాలికలకు కుట్టుశిక్షణ ఇప్పించాము.

– తల్లితండ్రులు లేక ఆదరణకు నోచుకోని 25 మంది బాలురను గుంటూరు జిల్లాలోని నూతక్కి గ్రామంలో గల ‘మాతృఛాయ’ (అనాథ వసతి గృహం) లోనూ, 12 మంది బాలికలను కాజా గ్రామంలోని ‘చిన్మయ విజయ’ నందు చేర్పించి చదివిస్తున్నాము.

– టిటిడి వారి శ్వేత ఆధ్వర్యంలో జరిగిన పూజారుల శిక్షణకు ఈ గ్రామాల నుండి 30 మంది హాజరై, శిక్షణ పొంది, ఆయా గ్రామాలలో మందిర నిర్మాణం చేసి, దురలవాట్లను దూరం చేసి నైతిక విలువలను నిర్మాణం చేస్తున్నారు.

ప్రశ్న : సామాజిక దురాచారాల నిర్మూలనపై మీ సంస్థ ప్రభావం ఉందా?

స : తప్పకుండా ఉంది. 2000 సంవత్సరం నాటికి, ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. చదువుకునే వారి సంఖ్య గణనీయంగా పెరగడం, మారుమూల గ్రామాలకు వైద్యసేవలు అందుబాటులో రావడం వలన మూఢనమ్మకాలు, వ్యసనాలు తగ్గి ఆరోగ్యస్థారు, ఆర్ధికస్థారు మెరుగైంది. కానీ పోషకవిలువలతో కూడిన ఆహారం పూర్తిగా అందడం లేదు. ఈ విషయంలో చేయవలసింది చాలా ఉంది.

ప్రశ్న : పోషకాహారం అంశంపై ఏం ప్రయత్నం చేస్తున్నారు ?

స : ఆ గ్రామాల్లోని 12 సంవత్సరాల లోపు చిన్నపిల్లలకు, గర్భిణి స్త్రీలకు అరటిపండ్లు, కోడిగుడ్లు వారానికి 5 రోజులు అందచేస్తున్నాము.

అనేక గ్రామాల్లో ‘ఆరోగ్యమిత్ర’ (హెల్త్‌ వాలంటీర్‌), సంచార వైద్యశాల ద్వారా పోషకాహారంపై అవగాహన కల్గిస్తున్నాము.

ప్రశ్న : రాబోయే 5 ఏళ్లలో మీ లక్ష్యం ఏమిటి ?

స : ప్రతి మనిషి ఉన్నతికి విద్య, ఆరోగ్యం ప్రధానం. ఉపాధిని అందించే విద్యను, వ్యసనాల నుండి బయటపడి ఆరోగ్యంగా ఉండే గ్రామాలను క్రమంగా పెంచాలనేది మా లక్ష్యం. గ్రామం కొరకు పనిచేసే కార్యకర్తల సంఖ్యను కూడా పెంచాలనుకొంటున్నాము.

ప్రశ్న : సంచార వైద్యశాల కార్యక్రమాలు ఏమిటి ?

స : చింతూరు కేంద్రంగా రెవెన్యూ మండలాలైన చింతూరు, వరరామ చంద్రపురం, కూనవరం మండలాలలో డా||గంగాధర ప్రసాద్‌ సారధ్యంలో సంచార వైద్యశాల గత 17 సంవత్సరాలుగా పనిచేస్తున్నది. రోజూ ఉదయం 7 నుండి 11 గంటల వరకూ సంచారవైద్యం. 11 నుండి రాత్రి 9 గంటల వరకు ఔట్‌ పేషెంట్‌ విభాగం (ఓ.పి.) పని చేస్తుంది. ఓ.పి. ద్వారా ప్రతి రోజూ సరాసరి 40 మందికి వైద్యసేవ అందిస్తున్నాము.

ప్రశ్న : సేవాభారతికి ఇతర సంస్థలు సహాయ అందిస్తున్నాయా ?

స : హైదరాబాద్‌లోని విద్యామిత్ర ట్రస్ట్‌ ద్వారా శ్రీ జి.నారాయణరావు, జయ భారత్‌ హాస్పిటల్‌ నెల్లూరు వారు విద్యాబోధనకు, సిసియల్‌ దుగ్గిరాల వారు సంచార వైద్యానికి చేయూతను అందిస్తున్నారు.

ముత్తయ్య సేవాభారతికి రాకముందు ఎమ్‌.పి.టి.సి. మెంబరుగా ఉన్నారు. సేవాభారతి కార్యక్రమాలు ముత్తయ్యకు ప్రేరణ కలిగించాయి. దాంతో రాజకీయాలకు దూరంగా ఉంటూ సేవాభారతి కార్యంలోనే పూర్తిగా నిమగ్నమై పనిచేస్తున్నారు. అందరి పట్ల ఆత్మీయంగా ఉండే ముత్తయ్య మౌలిక అంశాలపై మనసు పెట్టి గిరిజనుల ప్రగతికై పనిచేస్తున్నారు.

(జాగృతి సౌజన్యం తో)