ఘనంగా పారిశుద్ధ్య కార్మికులకి, సాహితీ మూర్తులకి సన్మానం
సమరసతా శతకం పుస్తక ఆవిష్కరణ
సమరసత మూర్తుల బాటలో ప్రతి ఒక్కరు పయనించాలని ప్రముఖ కవి, రచయిత డా. భాస్కరయోగి పిలుపునిచ్చారు. సామాజిక సమరసతా వేదిక కరినగర్ ఆధ్వర్యంలో డిసెంబర్ 6 న సమరసతా సమ్మేళనం జరిగింది. ప్రధాన వక్తగా భాస్కరయోగి పాల్గొని మాట్లాడారు.అన్ని కులములు సమానమేనని, అన్ని కులాల్లో మహనీయులు ఉన్నారని వారు వివరించారు. కులాల మధ్య సమన్వయము సాధించి, సమర్ధ భారత నిర్మాణానికి కృషి చేయాలనీ కోరారు. దేశంలో సామాజిక సంస్కరణ కోసం మహానుభావులు ఒక తాత్విక చింతనతో పని చేసారని తెలిపారు. అంబేద్కర్, ఫూలే, సంత్ గాడ్గే బాబా, నారాయణ గురు వంటి సంస్కర్తలు చేసిన శ్రమని మనం గుర్తు పెట్టుకోవాలని చెప్పారు. సామాజిక సమరసత నిర్మాణం కోసం వేదిక చేస్తున్న కృషిని అభినందించారు. కుల భావన వీడి, జాతీయ భావంతో జీవించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సామల కిరణ్ రచించిన సమరసతా శతకం ఆవిష్కరణ జరిగింది. సమరసతా మూర్తుల జీవితాలని వివరించే అతి సరళ శతకం ఇది అని కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ అన్నారు. అనంతరం సుమారు 200 మంది పారిశుధ్య కార్మికులను మరియు వివిధ సాహితీ సంస్థల నిర్వాహకులని ఘనంగా సత్కరించారు. ఇందులో నగర కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి, వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్, ఉపాధ్యక్షులు సత్యనారాయణ, కార్యదర్శి రామారావు, తుమ్మల రమేష్ రెడ్డి, బోయిని పురుషోత్తం,గండ్ర లక్ష్మణ రావు తదితరులు పాల్గొన్నారు.