భారతీయ సమాజంలో కుల అసమానతలు విడనాడి సమరసతను సాధించాలని సామాజిక సమరసత వేదిక అఖిల భారత కన్వీనర్ శ్యాం ప్రసాద్ అన్నారు. గురువారం రాత్రి మెదక్ లోని గీతా ఉన్నత పాఠశాలలో మహర్షి వాల్మీకి, కొమురంభీం జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన సమరసతా సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ అంటరానితనాన్ని రూపుమాపి ఏకాత్మతను కలిగి ఉండాలని, సామరస్యంతో ఐక్యంగా జీవించాలని పిలుపునిచ్చారు. వాల్మీకి రామాయణం మనిషిలో జీవన విలువలను నిర్మాణం చేస్తుందని, కొమురం భీం సమాజాన్ని ఒకతాటి పై కలిపి స్వాతంత్ర్య పోరాటం చేశారన్నారు. సామాజిక సమరసత వేదిక తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ మాట్లాడుతూ ఎక్కువ, తక్కువ బేధ బావాలు వదిలి వసుదైవ కుటుంబంగా జాతి మొత్తం ఒకే కుటుంబంగా కలిసిమెలిసి జీవించాలని అన్నారు. సమత, సోదరభావాన్ని అలవర్చుకోవాలన్నారు. వేదిక ఉమ్మడి మెదక్ జిల్లా కన్వీనర్ మత్స్యేంద్రనాథ్ మాట్లాడుతూ సమన్వయంతో సాంస్కృతిక ఏకాత్మతను సమరసతను సాధించేందుకు సమాజం అంతా ముందడుగు వేయాల్సిన అవసరముందన్నారు. కులాల మధ్య వివక్ష లేకుండా భారతీయులంతా ఒకటే అనే భావమ మదిలో రావాలని, జాతీయ సమైక్యతకు కంకణబద్దులు కావాలన్నారు.
కార్యక్రమంలో భాగంగా ముందుగా వాల్మీకి, కొమురంభీం చిత్రపటాలకు పూలమాలలు వేసి పుష్పాంజలి సమర్పించారు. ఈ కార్యక్రమంలో సామాజిక సమరసత వేదిక జిల్లా గౌరవ అధ్యక్షులు దేమె భూమయ్య, మల్కాజి సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు ధన్ రాజ్, మండల అధ్యక్ష, కార్యదర్శులు మధుమోహన్, పరాంకుశం, సాయిబాబా, రాజు , బోళ నాగభూషణం, సదాశివ, సుమన్, వివిధ క్షేత్రాల బాధ్యలు పాల్గొన్నారు.