దేశంలోని రాజకీయ పార్టీలు ఒక వేదికపైకి వచ్చి భారత ప్రజల భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి తమ వంతుగా కృషిచేసే అవకాశాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కల్పించింది. మూడు రోజుల పాటు ఢిల్లీలో జరిగిన సమ్మేళనానికి అన్ని పార్టీలకు ఆహ్వానాలు అందాయి. అయితే కాంగ్రెస్ తో సహా అన్ని విపక్షాలు మోహన్ భాగవత్ సమ్మేళనానికి గైరుహాజరయ్యాయి. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ గతంలో ఎన్నోసార్లు ఆరెస్సెస్ వేదికను పంచుకున్నారు. మరెంతో మంది కీలక రాజకీయ నాయకులకు సంఘ్ తో వ్యక్తిగత అనుబంధం ఉంది. అన్ని పార్టీలు ఒక్క త్రాటిపైకి వచ్చి దేశ భవిష్యత్తుపై చర్చించే మహత్తర అవకాశాన్ని కోల్పోవడంపై మేధావి వర్గాలు సైతం అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ఆరెస్సెస్ ఒక రాజకీయ పార్టీ కాదని తెలిసినప్పటికీ తాజా ఆహ్వానాన్ని విపక్షాలు తిరస్కరించడం వెనుక ఉన్న సైద్ధాంతిక భూమిక పలాయనవాదమే అనే విమర్శలున్నాయి.
రాష్ట్రీయ్ స్వయంసేవక్ సంఘ్ సిద్ధాంతాలు వేరు, తమ పార్టీ సిద్ధాంతాలు వేరు అని కాంగ్రెస్ భావించింది. ఆరెస్సెస్ సిద్ధాంతాల కన్నా కాంగ్రెస్ సిద్ధాంతాలే గొప్పవని ఆ పార్టీ భావించింది. ఆరెస్సెస్ మూడు రోజుల భేటీకి వచ్చిన ఆహ్వానాన్ని తిరస్కరించిన ముంబై కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సంజయ్ నిరుపమ్ స్పందన వేరేలా ఉంది. గాంధీ, స్టాలిన్, మార్క్స్, హిట్లర్ సిద్ధాంతాల మధ్య తేడాలున్నట్లే ఆరెస్సెస్, కాంగ్రెస్ మధ్య ప్రాథమిక వైరుధ్యముందని చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్యంలో వివిధ సిద్ధాంతాలకు చోటు ఉంటుందని, వాటి మధ్య చర్చలు జరగడం సమాజానికి మంచిదని, భారత్ భవిష్య దర్శినిపై న్యూడిల్లీలో మోహన్ భాగవత్ ఏర్పాటు చేసిన మూడు రోజుల సమావేశానికి అన్ని రాజకీయ పార్టీలు హాజరుకావడం ద్వారా దేశానికి ఒక దిశానిర్దేశం వైపుగా కృషికి నాంది పడుతుందని ఆరెస్సెస్ బలంగా భావించింది.
ఢిల్లీలో ముగిసిన మూడు రోజుల ఆరెస్సెస్ సమ్మేళనాన్ని బహిష్కరించడం ద్వారా రాజకీయ పార్టీలు దేశ ప్రజలకు ఒక ప్రతికూల సందేశాన్ని పంపినట్లయిందని వివిధ వర్గాలు వాదిస్తున్నాయి. భారత మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ కురువృద్ధుడు ప్రణబ్ ముఖర్జీ నాగపూర్ లో ఆరెస్సెస్ సమ్మేళనానికి హాజరు కావడం పైనా విమర్శలు వచ్చాయి. నాటి సమావేశంలో ప్రణబ్ తన అభిప్రాయాన్ని కుండ బద్దలుకొట్టినట్టు కొట్టినట్లు చెప్పి వచ్చారు. దానికి ఆరెస్సెస్ పెద్దలు పెద్దగా బాధపడిందీ లేదు, ఖండించిందీ లేదు. విభిన్న అభిప్రాయాల వేదిక అన్నది దేశానికి నేడు అవసరమని సంఘ్ బలంగా భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీ కాంచుకోటకి మొదటి దెబ్బ కొట్టింది జనసంఘ్ నేతృత్వం లోని ప్రతిపక్షాలేనని, 1960లో దేశంలో ఎనిమిది రాష్ట్రాల్లో కాంగ్రెస్సేతర ప్రభుత్వాలు ఏర్పాటు అయిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఇందిరా గాంధీ ఎమెర్జెన్సీలో ఆరెస్సెస్ కార్యకర్తలతో జైళ్లు నిండిపోయిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఎమర్జెన్సీని వ్యతిరేకించి నేటి మీసా చట్టం కింద నేటి ఆర్ధికమంత్రి అరెస్టయినప్పుడు, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడానికి ఆరెస్సెస్ పోషించిన క్రియాశీలక పాత్రను ప్రతిపక్షాలు నేడు మరచిపోవడం విచిత్రమంటున్నారు. జనసంఘ్ తో కలిపి వివిధ రాజకీయ పక్షాలు ఏకమై జనతా పార్టీగా ఆవిర్భవించినప్పుడు, దేశంలో తొలిసారి కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, వారసత్వ, రాచరిక తరహా పాలనకు స్వస్తి చెప్పడంలో ఆరెస్సెస్ సిద్ధాంతాలు ప్రజాస్వామికంగా లేవా అని ప్రశ్నిస్తున్నారు. వీపీసింగ్ ప్రభుత్వాన్ని నిలబెట్టడం కోసం అప్పుడే ఆరెస్సెస్ శిశువుగా ఉద్భవించిన బీజేపీ తో సిపిఎం పార్టీలు చేతులు కలిపి బయటనుండి మద్ధతు ఇచ్చినపుడు సంఘ్ పరివార్ ని అభ్యుదయ నిరోధకంగా ఎలా పరిగణిస్తారని అడుగుతున్నారు. 1989 లో అయోధ్యలో రామాలయ నిర్మాణానికి దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్న దశలోనూ ఆనాడు సిపిఎం పార్టీ కి కూడా బీజేపీ అభ్యుదయ వ్యతిరేకంగా కనిపించలేదు కదా అని గుర్తుచేస్తున్నారు. ఆరెస్సెస్ భారతీయ సైద్ధాంతిక ఆత్మ అని, దాంతో అన్ని రాజకీయపార్టీల్లోని నేతలకు సంబంధాలున్నాయన్న విషయం బహిరంగ రహస్యమనే వాదనలున్నాయి. 93 సంవత్సరాల ఆరెస్సెస్ చరిత్రలో మహాత్మా గాంధీ నుండి బాబాసాహెబ్ అంబేద్కర్, జయప్రకాశ్ నారాయణ్ వంటి ఎంతో మంది విశిష్ట నేతలు సంఘ్ వేదికను పంచుకున్నారని, భారత జాతి భవిష్యత్తు పై తమ ఆలోచనలను వ్యక్తీకరించారని, అయితే నేడు ప్రతిపక్షాలు హ్రస్వదృష్టితో వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదంటున్నారు. దేశ ప్రజలను, ప్రతిపక్షాలను తీవ్రాతితీవ్రంగా పీడించిన నాటి ప్రధాని ఇందిరాగాంధీని ఎమర్జెన్సీ తర్వాత జనతా పార్టీ హయాంలో ప్రతీకారం తీర్చుకోవాలని వచ్చిన డిమాండ్ ను నాటి RSS చీఫ్ బాలాసాహెబ్ దేవరస్ ‘క్షమించండి, మర్చిపోండ’ని అన్న మాటలను నేటి కాంగ్రెస్ నేతలు గుర్తుచేసుకోవాలన్నారు. భారతదేశ భవిష్యత్తుపై, దేశాన్ని ఒక్కత్రాటిపై తీసుకురావడానికి, భారతీయ సమాజాన్ని సంస్కరించడానికి ఆరెస్సెస్ చేస్తున్న ప్రయత్నాలను, ప్రతిపాదనలను ఆరెస్సెస్ ఆలో చనలను వినడానికి కూడా తిరస్కరించిన విపక్షాలు ప్రజాస్వామ్య ప్రాధమిక విలువలను పాటించలేదని ఇంద్రప్రస్థ విశ్వ సంవాద్ కేంద్ర సీఈఓ అరుణ్ ఆనంద్ ఆవేదన వ్యక్తం చేశారు. హిందుత్వం అన్నదానికి ఆరెస్సెస్ ఎలాంటి నిర్వచనం ఇస్తుందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయకుండా, తాము మాత్రమే లౌకికవాదులమని, ఇతరులు మతతత్వవాదులని స్వీయతీర్మానాలతో తలుపులు మూసేసుకోవడం దేశానికే మంచిదికాదంటున్నారు. ఆరెస్సెస్, బీజేపీ లపై మతముద్ర వేసి తాముమాత్రం సచ్చీరులుగా ఛలామణీ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ హిందుత్వం అర్థంచేసుకునే బాధ్యత నుండి కాంగ్రెస్ సహా విపక్షాలు తప్పించుకోచూడడాన్ని దేశప్రజలు అర్థంచేసుకుంటున్నారనే అంటున్నారు. దేశ స్వాతంత్య్రానికి ముందునుంచే ఆరెస్సెస్ ఏనాడూ ఒక రాజకీయ పార్టీగా వ్యవహరించకపోవడం, లేదా రాజకీయ పార్టీగా రూపొందడానికి ప్రయత్నం చేయకపోగా, వివిధ రాజకీయ పార్టీల ఆవిర్భావానికి, వాటి సైద్ధాంతిక పునాదులకు నారునీరు పోసి, దేశ భవిష్యత్తు కోసమే పాటుపడిన విషయాన్ని వారసత్వ పార్టీలు, లేదా వ్యక్తులు కేంద్రంగా వున్న పార్టీలు మర్చిపోయి వ్యవహరిస్తున్నాయనే విమర్శలు తెరపైకి వస్తున్నాయి. బీజేపీతో సహా ఏ రాజకీయ పార్టీలతో కూడా సంబంధాలు లేవని, దేశమే తమ జెండా అని, కులాలు, మతాలు, ప్రాంతాలు, వర్గాలకు అతీతంగా దేశ ప్రజలే అజెండా అని ప్రకటించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పై ఈ దేశం లోని రాజకీయ పార్టీలు మరోసారి పునరాలోచన చేయాల్సిన అవసరాన్ని తాజాగా ముగిసిన మూడురోజుల మోహన్ భాగవత్ సమ్మేళనం మరోసారి గుర్తుచేస్తోందని వివిధ వర్గాలు భావిస్తున్నాయి.
Source: AG Dutta’s Article in Andhra Prabha