Home Hyderabad Mukti Sangram సుసంపన్నంగా సాగిన గోల్కొండ సాహితీ మహోత్సవం

సుసంపన్నంగా సాగిన గోల్కొండ సాహితీ మహోత్సవం

0
SHARE

`హైదరబాద్ విముక్తి పోరాటం’ ప్రధానాంశంగా గోల్కొండ సాహితీ మహోత్సవం, 2022 భాగ్యనగర్ లోని పత్తర్ గట్టి అగర్వాల్ కళాశాలలో డిసెంబర్ 11న సుసంపన్నంగా సాగింది. హైదరాబాద్ విముక్తి పోరాట అమృతోత్సవాలను పురస్కరించుకుని సమాచారభారతి, సంస్కారభారతి, ఇతిహాస సంకలన సమితి తదితర సంస్థల ఆధ్వర్యంలో గోల్కొండ సాహితీ మహోత్సవపు ఈ ద్వితీయ సంచిక హింది భాషా మాధ్యమంలో సాగడం విశేషం. (గోల్కొండ సాహితి మహోత్సవపు మొదటి సంచిక గత సంవత్సరం నవంబర్ నెలలో జరిగింది).

దీపప్రజ్వలన కార్యక్రమం, వందేమాతర గీతాలాపనతో మహోత్సవం ప్రారంభమైంది. ప్రారంభ కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్త, సాహిత్యవేత్త ప్రొ. ఆనందరాజ్ వర్మ ముఖ్య అతిధిగా, ప్రముఖ సర్జన్, సామాజిక కార్యకర్త వంశ తిలక్ విశిష్ట అతిధి, ప్రముఖ రచయిత ప్రశాంత్ పోల్ ప్రధాన వక్తగా పాల్గొన్నారు. సమాచారభారతి అధ్యక్షులు, విద్యావేత్త ప్రొ. గోపాల్ రెడ్డి కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. మొదట మాట్లాడిన ప్రొ. ఆనందరాజ్ వర్మ హైదరబాద్ ముక్తి సంగ్రామంలో అనేకమంది పాల్గొన్నారని, వారి గురించి అందరూ, ముఖ్యంగా యువత తప్పక తెలుసుకోవాలని అన్నారు. రాజా రామచంద్ర రావు జాధవ్, రాజా మహిపత్ రామ్ సెహగల్, పండిత్ గంగారాం, పండిత్ గోవిందలాల్ వ్యాస్ వంటివారి గురించి చరిత్ర పుస్తకాలలో కనిపించదని, ఇది దురదృష్టకరమైన విషయమని అన్నారు. ఆ తరువాత మాట్లాడినా వంశతిలక్ నిజాంకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో కొన్ని విశేషాలను వివరించారు. ప్రధాన వక్త ప్రశాంత్ పోల్ మన దేశ చరిత్రలో మరుగున పడిపోయిన అనేకమంది స్వాతంత్ర్య వీరుల గురించి అందరికీ తెలియజెప్పాల్సిన అవసరం ఉందన్నారు. పోర్చుగీసు వారిని తరిమికొట్టిన కర్నాటకకు చెందిన అబ్బక్క దేవి, డచ్ వారిని పరాజితులను చేసిన తమిళనాడుకు చెందిన రాజా మార్తాండ వర్మ, బ్రిటిష్ వారిని నిలువరించిన తిలకా మాంఝీ, తమిళనాడు వెలునాచియార్ మొదలైన వారి గురించి చెప్పాలని అన్నారు.

ఈ కార్యక్రమంలోనే పలు పుస్తకాల ఆవిష్కరణ కూడా జరిగింది. డా. శ్రీరంగ్ గోడ్బోలే వ్రాసిన `భాగానగర్ నిశస్త్ర  ప్రతిరోధ్’ తోపాటు ఆ పుస్తకపు తెలుగు అనువాదం `హైదరబాద్ నిరాయుధ ప్రతిఘటన’, ప్రశాంత్ పోల్ వ్రాసిన `వినాశ్ పర్వ్’, కందకుర్తి ఆనంద్ తెలుగులో వ్రాసిన `ఆధ్యాత్మిక, క్షాత్ర తేజం సంత్ సేవలాల్ మహరాజ్’ అనే పుస్తకాలు కూడా విడుదలచేశారు. శ్రీరంగ్ గోడ్బోలే పుస్తకాన్ని తెలుగులోకి అనువదించిన శ్రీ. సింగారెడ్డి బ్రహ్మానందరెడ్డి, శ్రీమతి. నడింపల్లి పరిమళ గార్లను ముఖ్యఅతిధులు సత్కరించారు.

ఆ తరువాత రెండవ సమావేశంలో `ముక్తి సంగ్రామంలో అజ్ఞాత వీరులు’ అనే అంశాన్ని గురించి ప్రముఖ రచయితలు డా. విద్యా దేవధర్, శ్రీ. మహాదేవయ్య, డా. రాహుల్ శాస్త్రి మాట్లాడారు. హైదరబాద్ లో సాగిన ముక్తి పోరాటాన్ని గురించి డా. దేవధర్, డా. రాహుల్ శాస్త్రి, కర్నాటకలో పోరు గురించి మహాదేవయ్యలు వివరించారు.

మూడవ సమావేశంలో `కథలు, గీతాలు సంప్రదాయాల సంరక్షణ, ముక్తి సంగ్రామంలో వాటి పాత్ర’ అనే అంశంపై మరాఠ్వాడా విశ్వవిద్యాలయానికి చెందిన  డా. జోగింద్ర సింగ్ బిసేన్, ప్రొ. సి. సంజీవ, శ్రీ. రాకా సుధాకరరావు మాట్లాడారు.

తరువాత జరిగిన ముగింపు కార్యక్రమంలో పాంచజన్య హిందీ వారపత్రిక సంపాదకులు శ్రీ హితేష్ శంకర్ పాల్గొన్నారు. మన దేశపు సంస్కృతి ప్రత్యేకమైనదని, అది మనకు గర్వకారణమని అన్నారు. ఆ సంస్కృతికి ఆధారం సంస్కారమని అన్నారు. ఆ సంస్కృతిని అణచి ఉంచడానికి, చరిత్రను వక్రీకరించడానికి అనేక ప్రయత్నాలు జరిగాయని, జరుగుతున్నాయని, వాటిని అడ్డుకోవలసిన అవసరం ఉందని అన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన గోల్కొండ సాహితి మహోత్సవ కన్వీనర్ శ్రీ వల్లీశ్వర్ మాట్లాడుతూ సాహిత్యం, పాటలు, కవిత్వం మనలో సంస్కారాన్ని కలిగించి, ఆనందాన్ని కూడా అందిస్తాయని అన్నారు. స్వాతంత్ర్య సమరంలో త్యాగాలు చేసిన అజ్ఞాత వీరుల గురించి ప్రపంచానికి తెలియజెప్పవలసిన తరుణం ఆసన్నమైందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటువంటి వీరుల గురించిన వివరాలు, విశేషాలను వెలికితీసి మన ముందుంచుతున్న రచయితలు, చరిత్రకారులకు ఎంతో ఋణపడి ఉన్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో `ఆధ్యాత్మిక, క్షాత్ర తేజం సంత్ సేవాలాల్ మహరాజ్’ పుస్తక రచయిత శ్రీ కందకుర్తి ఆనంద్ ను సత్కరించారు.

ఇతిహాస సంకలన సమితి ఆధ్వర్యంలో వివిధ పాఠశాలలకు చెందిన పిల్లలు ప్రదర్శించిన `హైదరబాద్ విమోచన’ నాటికలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

గోల్కొండ సాహితి మహోత్సవపు రెండవ సంచిక కన్వీనర్ గా వ్యవహరించిన శ్రీ అవధ్ నాథ్ రాయ్ వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.