గోల్కొండ సాహితీ మహోత్సవాలు హైదరాబాద్‌లోని కేశవ స్మారణ విద్యాసంస్థల ప్రాంగణంలో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. “అజాదీ కా అమృతోత్సవాలలో భాగంగా జాతీయ సాహిత్య పరిషత్, ఇతిహాస సంకలన సమితి, సంస్కార భారతి, ప్రజ్క్షా భారతి, తదితర సంస్థలు సంయుక్తంగా గోల్కొండ సాహితీ ఉత్పవాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమాన్ని హర్యాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి, ఆర్.ఎస్.ఎస్ అఖిల భారత కార్యకారిణీ సదస్యులు వి. భాగయ్య ప్రారంభించారు. సమాచార భారతి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రముఖ సాహితీ వేత్త, భారతీయ సాహిత్య పరిషత్ మార్గదర్శకులు ఆచార్య కసిరెడ్డి వెంకట రెడ్డి, ఆర్.ఎస్.ఎస్ తెలంగాణ ప్రాంత సంఘచాలకులు బూర్ల దక్షిణమూర్తి, సమాచార భారతి అధ్యక్షులు ఆచార్య గోపాల్ రెడ్డి, ఉపాధ్యక్షులు జి.వల్లీశ్వర్, ప్రముఖ రచయిత రతన్ శార్దా తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్వరాజ్య సాధనలో ఆర్.ఎస్.ఎస్, ఆంగ్లేయుల ఏలుబడి: అంతులేని దోపిడి, Nizam’s Rule Unmasked అనే గ్రంథాలను ఆవిష్కరించారు. ప్రముఖ సాహితీవేత్త, కాకతీయ విశ్వవిద్యాలయ పూర్వ ఆచార్యులు కోవెల సుప్రసన్నచార్య ను సన్మానించారు. పుస్తక రచయితలు కె. కేశవనాథ్, శైలజ, సారంగపాణి లను సత్కరించారు.
ఈ సందర్భంగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ భారత స్వతంత్ర పోరాటంలో విస్మరించిన వీరులను స్మరించుకునేందుకు కేంద్ర ప్రభుత్వ నేతృత్వంలో స్వాతంత్య్ర అమృత మహోత్సవాలు నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఇదే సందర్భాన్ని పురస్కరించుకుని బ్రిటిష్ వారిని ధైర్యంగా ఎదుర్కొన్న వనవాసీ వీరుడు బిర్సాముండా జయంతిని జాతీయ గిరిజన దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిందని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో కూడా కొమురంభీం, రాంజీగోండు, అల్లూరి వంటి గిరిజన వీరుల గాథలను పరిచయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం గిరిజన మ్యూజియం ఏర్పాటు కోసం రూ.15కోట్లు కేటాయించిందని తెలిపారు. నేటి కవులు, రచయితలు కూడా దేశ సంస్కృతిని, ఐకమత్యాన్ని ప్రేరెపించే రచనలు చేసి జాతీయవాదాన్ని భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు.
హర్యాణా గవర్నర్ బండారు దత్రాత్రేయ మాట్లాడుతూ నిజాం నవాబును ఎదురించిన చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, షోయబుల్లాఖాన్ తదితరులను కొనియాడారు. ఉప్పు సత్యాగ్రహంలో ఆర్.ఎస్.ఎస్ వ్యవస్థాపకులు హెగ్డెవార్ పాల్గొన్నారని గుర్తు చేశారు. బ్రిటిష్ వారు మన సంపదను ఎంత దోచినా మన సంస్కృతిని దేశభక్త కవులు కాపాడినారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా కవులు రచయితలు విద్యార్థుల్లో, యువతలో దేశభక్తిని ప్రేరేపించే రచనలు చేయాలని పిలుపునిచ్చారు. పాఠశాల స్థాయి నుంచే మన సంస్కృతీ సాంప్రదాయాలను పిల్లలకు అందించినప్పుడే దేశం నిలబడుతుందని అన్నారు.
అనంతరం ఆర్.ఎస్.ఎస్ అఖిల భారత కార్యకారిణీ సదస్యులు భాగయ్య మాట్లాడుతూ బుద్ధికి, వికాసానికి పదునుపెట్టి జనతను జాగృతం చేసేదే సాహిత్యం అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనం అమృతోత్సవాలు జరుపుకుంటున్నాము కానీ దేశానికి స్వరాజ్యం మాత్రమే వచ్చింది స్వాతంత్య్రం ఇంకా రాలేదు అని అన్నారు. స్వాతంత్య్రం అంటే ఒక జాతికి తనదైన జీవితాన్ని గడుపుతూ మానవాళికి, ప్రపంచానికి సేవ చేసే అవకాశాన్ని కల్పించేది అన్నారు. కానీ స్వతంత్ర దేశంలో మనం ప్రతీ దానికి ప్రభుత్వంపై ఆధారపడటం మన సమాజానికి నష్ట కారకం అన్నారు. ఈ బాధ్యతనే సాహిత్యం గుర్తుచేయాలని ఆకాంక్షించారు. విద్యావిధానంతో పాటు అన్ని జీవన రంగాల్లో మార్పు రావాలని కోరారు. బుద్ధికి, వివేకానికి పదును పెడుతూ సాహితీ రంగం ఈ మార్పును కల్గిస్తుందని అన్నారు. మనసుకు దిశ చూపుతూ హృదయాన్ని మేల్కొలిపే సాహిత్యం ఈ పుణ్య భూమిలో రామాయణ, భారత, భాగవతం, వేద సాహిత్యం, బౌద్ధ సాహిత్య రూపంలో మనకు అందిందని గుర్తు చేశారు. కాళిదాసు, వేమన, నన్నయ, తిరువళ్ళువర్ వంటి వారి సాహిత్యం సాంస్కృతిక వికాసానికి తోడ్పడిందని యోగి అరవిందులు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. భారతీయ సాహిత్యంలో ఆధ్యాత్మికత, ఆధునికత సమపాళ్ళలో ఉన్నాయని అన్నారు. నిన్నిటి ఉదయం మళ్లీ వచ్చినట్టే మన దేశం అఖండమవుతుందని అన్నారు.
ఈ సందర్భంగా భారత సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మనం మరిచిన స్వతంత్య్ర సమరయోధుల జీవిత చరిత్రలతో ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. వివిధ సంస్థలు ప్రచురించిన జాతీయవాద సాహిత్యాన్ని విక్రయించారు. కార్యక్రమ చివర్లో ఆచార్య గోపాల్ రెడ్డి వందన సమర్పణ చేశారు.