పుస్తక సమీక్ష
-కల్హణ
‘ఆంధ్రభూమి’ ఒకసారి రాజకీయ నేత/గూండా మీద వార్త వేసింది. అతడొచ్చి గొడవ పెట్టాడు. నాటి సంపాదకుడు ఖండన ఇస్తే ప్రచురిస్తామని చెప్పారు. ఆ ఖండన ఆరో పేజీలో వచ్చింది. మళ్ళీ వచ్చాడు నేత. ఖండనంటే నాలుగు వాక్యాలేనా, అది కూడా ఆఖర్న ఆరో పేజీలోనా? అని నిలదీశాడు. అందుకు నాటి సంపాదకుడి సమాధానం – ఏడో పేజీ లేదు మరి. ఆయనే గోవిందు రామశాస్త్రి(గోరాశాస్త్రి). నిర్భీకతకు నిలువెత్తు నిదర్శనం.
ఆనాటి సంపాదకులు బహుముఖ ప్రజ్ఞావంతులు. నార్ల కవి, నాటకకర్త కూడా. నండూరి రామమోహనరావు గొప్ప అనువాదకులు. మార్క్‌ట్వైయన్‌ను అనువదించారు. తత్త్వశాస్త్ర విశ్లేషకులు. కానీ ఒక్క పత్రికా రచయితలుగానే ఇలాంటి వారిని గుర్తుపెట్టుకోవడం కద్దు. అలా కాక మిగిలిన రంగాలకు వారు చేసిన సేవను పరిచయం చేస్తేనే పరిపూర్ణత.
అలాంటి ప్రయత్నమే, ‘ప్రముఖ సంపాదకులు, రచయిత గోరాశాస్త్రి’ పుస్తకం. గోరాశాస్త్రి శత జయంతి సదస్సు ప్రసంగాల వ్యాసాల సంకలనమిది. సంకలనకర్త ప్రముఖ పత్రికా రచయిత కె. లక్ష్మణరావు. తెలుగు స్వతంత్ర, ఆంధ్రభూమి పత్రికల సంపాదకుడిగా పనిచేసిన గోరాశాస్త్రిది తెలుగు పత్రికారంగం మీద ప్రత్యేక ముద్ర. సంపాదకీయాలతో ఖ్యాతి గాంచిన సంపాదకులు కొందరే. వారిలో గోరాశాస్త్రి అగ్రగణ్యులు.
ఆయన డక్కన్ క్రానికల్ కోసం ఇంగ్లిష్‌లో కూడా సంపాదకీయాలు రాసేవారు. ఇంకా, కథకుడు, నాటకకర్త. ఇంతటి ఆయన విశ్వరూపాన్ని చూపించే 12 ప్రసంగ వ్యాసాలు ఈ సంకలనంలో ఉన్నాయి. వ్యాసకర్తలంతా లబ్ధప్రతిష్టులే. వరదాచారి, టి.ఉడయవర్లు, దాసు కేశవరావు, ఏబీకే, పీఎస్ గోపాలకృష్ణ, కె.రామలక్ష్మి, గోవిందరాజు చక్రధర్ తదితరులు చక్కని విశ్లేషణలు చేశారు.
గోరాశాస్త్రి ప్రజ్ఞే కాదు, అభిరుచి కూడా బహుముఖీనమైనది. వినాయకుడి వీణ (ఆనందవాణి కోసం రాశారు) అనే ఆయన శీర్షిక గురించి ఈనాటికీ చెబుతారు. డాక్టర్ శ్రీదేవి అద్బుత నవల ‘కాలాతీత వ్యక్తులు’ ఆయన సంపాదకుడిగా ఉన్న తెలుగు స్వతంత్రలో ధారావాహికంగా వెలువడిందంటే అదొక చరిత్రే.
‘ఉక్తి వైచిత్రీ శిల్పి గోరాశాస్త్రి’ అన్న వ్యాసంలో సంపాదకుడిగా ఆయన వ్యక్తిత్వం, ప్రతిభ ఎలాంటివో వరదాచారి గొప్పగా ఆవిష్కరించారు. ఒక పత్రికా రచయిత ప్రతిభలో ఏం చూడాలో, ఏం నేర్చుకోవాలో ఇందులో ఉంది.
ఆయన సంపాదకీయాల వైశిష్ట్యం గురించి దాసు కేశవరావు (ఇంగ్లిష్), కల్లూరి భాస్కరం (తెలుగు) రాసిన లోతైన విశ్లేషణలు ఉన్నాయి. దాదాపు స్వాతంత్ర్య భారతంలోని కీలక రాజకీయ పరిణామాలన్నింటికి ఆయన ప్రత్యక్షసాక్షి. సునిశిత వ్యంగ్యంతో, చారిత్రక దృష్టితో, సత్యనిష్టతో ఆయన సంపాదకీయాలు ఉంటాయని భాస్కరం ఇచ్చిన కొద్ది ఉదాహరణలతోనే అర్థమవుతుంది.
రాష్ట్రావతరణ నుంచి, దేశాన్ని కదిలించిన అత్యవసర పరిస్థితి వరకు ఆయన పరిణామాలను గమనించారు. వీటన్నిటి మీద ఆయన సంపాదక వ్యాఖ్యలు వెలువరించారు. అంతటా నిర్భీకతే. సంపాదకీయాలకు కవితాత్మకంగా, మార్మికంగా శీర్షిక పెట్టడం గోరాశాస్త్రి ప్రత్యేకత. ఒక సంపాదకీయానికి ఆయన ‘ఉష్ట్రపక్షుల సమావేశం’ అని శీర్షిక పెట్టారు. ఒక తంతుగా ముగుస్తున్న కాంగ్రెస్ సమావేశాల మీద ఇది ఆయన నిశిత వ్యాఖ్య.
కథకుడిగా గోరాశాస్త్రి ప్రతిభను కేబీ లక్ష్మి వివరించారు. ‘ఆశ ఖరీదు అణా’ పేరుతో ఆయన రాసిన నాటిక తెలుగు నాటక సాహిత్య ప్రయోగ దృష్టికి నిదర్శనంగా నిలుస్తుంది. ఆకాశవాణి కోసం ఆయన రాసిన నాటికల గురించి నాగసూరి వేణుగోపాల్, పీ ఎన్ గోపాలకృష్ణ చర్చించారు.
ఆ శతజయంతి సదస్సులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గోరాశాస్త్రి మీద సినారె రాసిన పద్యాన్ని వినిపించడం బాగుంది. అది, ‘స్తుతులకు మనసివ్వని వాడు – బతుకు విద్దె నేర్వనివాడు, పొద్దుని బట్టి తిరగనివాడు – పురోగతని మరువని వాడు.’ పత్రికా రచయితకు చక్కని నిర్వచనం.
ప్రముఖ సంపాదకులు, రచయిత గోరాశాస్త్రి
సంకలనం: కె. లక్ష్మణరావు
ప్రతులకు: సాహిత్య అకాడెమి, రవీంద్ర భవన్, ఫిరోజ్‌షా రోడ్, న్యూఢిల్లీ – 110001
పేజీలు: 100, వెల: రూ.140/-
– ‘జాగృతి’ సౌజన్యంతో..