ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో గోరఖ్‌పూర్ దేవస్థానం వద్ద ఇద్దరు పోలీసులపై దాడి కేసుకు సంబంధించి నిందితుడు అహ్మద్ ముర్తజా అబ్బాసీపై చట్టవిరుద్ధమైన కార్యకలాపాల నిరోధక చట్టాన్ని (UAPA) ప్రయోగించడానికి అధికారులు రంగం సిద్ధం చేసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ దిశగా ఉత్తరప్రదేశ్ ఉగ్రవాద వ్యతిరేక బృందం (ATS) ప్రక్రియను ప్రారంభించినట్టు, త్వరలోనే ఈ కేసును జాతీయ దర్యాప్తు ఏజెన్సీ (NIA) కి అప్పగించే అవకాశం ఉందని ఆ వర్గాలు తెలిపాయి. నిందితుడు అబ్బాసీ వేసే ప్రతి ఒక్క అడుగు గురించి బాగా తెలిసిన మరో ఐదుగురు వ్యక్తులను ATS అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
దేశంలో షరియా చట్టాన్ని అమలు చేయాలని తాను ఆకాంక్షిస్తున్నట్టు విచారణ సందర్భంగా అధికారులతో నిందితుడు అన్నాడని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కెమికల్ ఇంజినీర్ అయిన అబ్బాసీ అన్ని రకాల బాంబులను సునాయాసంగా తయారుచేయగలడని వెల్లడించాయి. తన ల్యాప్‌టాప్ మరియు మొబైల్ ఫోన్ నుంచి ఉద్దేశ్యపూర్వకంగానే కొంత ముఖ్యమైన సమాచారాన్ని డిలీట్ చేసినట్టు విచారణ సందర్భంగా అతడు అంగీకరించాడని సమాచారం.
ఏప్రిల్ మూడవ తేదీ సాయంత్రం 30 సంవత్సరాల ఐఐటీ పట్టభద్రుడు అహ్మద్ అబ్బాసీ గోరఖ్‌నాథ్ దేవస్థాన ప్రాంగణంలోకి చొరబడటానికి ప్రయత్నించాడు. అడ్డువచ్చిన భద్రతా సిబ్బందిపై ఒక పదునైన ఆయుధంతో దాడి చేశాడు. దాడిలో ఇద్దరు కానిస్టేబుళ్ళు గాయపడ్డారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి నుంచి ఆ ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ మరియు ATS అధికారులతో కూడిన ఒక బృందం కేసును దర్యాప్తు చేస్తున్నది.
దాడిని భగ్నం చేసిన ఇద్దరు జవాన్లకు, కానిస్టేబుల్ అనురాగ్ రాజ్‌పుట్‌కు చెరి 5 లక్షల రూపాయల నగదు పురస్కరాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. గోరఖ్‌నాథ్ దేవస్థానం వద్ద దాడి అనంతరం ఉత్తరప్రదేశ్‌లో శ్రీ కృష్ణ జన్మస్థాన దేవస్థాన సముదాయం సహా అత్యంత సున్నితమైన ధార్మిక ప్రాంతాల వద్ద భద్రతను పటిష్టం చేశారు.