Home News గోరఖ్‌నాథ్ దేవస్థానం దాడి: నిందితుడి నుంచి తీవ్ర‌వాదుల‌కు లక్షల రూపాయలు

గోరఖ్‌నాథ్ దేవస్థానం దాడి: నిందితుడి నుంచి తీవ్ర‌వాదుల‌కు లక్షల రూపాయలు

0
SHARE

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో గోరఖ్‌నాథ్ దేవస్థానం వద్ద ఇద్దరు పోలీసులపై దాడికి పాల్పడి దొరికిపోయిన అహ్మద్ ముర్తజా అబ్బాసీ జీవితానికి సంబంధించి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయని యూపీ పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దాడి జరగడానికి ఒక రోజు ముందు అబ్బాసీ నివాసంలో ఉగ్రవాద నిరోధక బృందం (ఏటీఎస్) అధికారులు సోదాలు చేపట్టారు. కానీ అబ్బాసీ అధికారులకు దొరకకుండా తప్పించుకున్నాడు. తన నివాసంలో ఏటీఎస్ అధికారులు సోదాలు జరిపిన విషయాన్ని తెలుసుకున్న అబ్బాసీ.. ముందుస్తు ప్రణాళిక లేకుండా దేవస్థానం వద్ద పోలీసులపై హడావుడిగా దాడికి దిగాడని అధికారులు తెలిపారు.

గోరఖ్‌నాథ్ దేవస్థానంపై దాడికి పథక రచన చేసిన దాదాపు 16 మంది వ్యక్తులతో కూడిన జాబితాను కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలు మార్చి 31వ తేదీన ఏటీఎస్‌కు అందించాయని అధికార వర్గాలు తెలిపాయి. ఆ జాబితాలో అబ్బాసీ పేరు కూడా ఉంది. జాబితా పొందిన తర్వాత ఇద్దరు అధికారులు అబ్బాసీ నివాసానికి వెళ్ళారు. కానీ అప్పటికే అతడు పత్తా లేకుండాపోయాడు.

అబ్బాసీ అనుచరుడు అరెస్ట్

అబ్బాసీని అరెస్టు చేసిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా కనీసం ఆరు జిల్లాల్లో ఏటీఎస్ తనిఖీలు చేపట్టింది. అబ్బాసీతో సంబంధాలున్న అనేక మంది అనుమానితులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సహరన్‌పూర్‌‌లోని ఛుట్మలాపూర్‌లో ముస్లిమ్ కాలనీలో పచారీ దుకాణం నడుపుతున్న అబ్దుల్ రెహ్మాన్ అనే యువకుడ్ని ఏటీఎస్ అధికారులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. అబ్దుల్ రెహ్మాన్ అబ్బాసీతో కలిసి నేపాల్‌కు వెళ్ళి వచ్చాడని సమాచారం. వారిద్దరికీ సిరియా కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద మూకలతో సంబంధాలు ఉన్నట్టు తెలిసింది.

దేవ్‌బండ్, కాన్పూర్, లక్నో, నోయిడా, షామ్లీ తదితర నగరాలతో పాటుగా సంభల్ నుంచి 10 మంది అనుమానితులను ఏటీఎస్ అధికారులు అదుపులోకి తీసుకున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. కేసుకు సంబంధించి ప్రస్తుతం ఏటీఎస్ నిఘా నేత్రం పరిధిలో మరో 40 మందికి పైగా వ్యక్తులు ఉన్నారని సమాచారం.

అబ్బాసీ నుంచి టెర్రరిస్టులకు లక్షల రూపాయలు

ఉగ్రవాద మూక ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) కు చెందిన బ్యాంక్ ఖాతాలకు లక్షలాది రూపాయలను అబ్బాసీ పంపించాడనే దిగ్భ్రాంతికరమైన నిజం దర్యాప్తు సందర్భంగా బైటపడింది. ఒక ఉన్నతాధికారి ప్రకారం అబ్బాసీ జరిపిన ఆర్థిక లావాదేవీలను దర్యాప్తు ఏజెన్సీలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అతడికి ఐసిఐసిఐ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, ప్లాటినమ్ ఫెడరల్ బ్యాంక్, తదితర బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయని సమాచారం.

అమెరికాలో అబ్బాసీ గురువు

అబ్బాసీకి గురువుగా అమెరికాలో ఉంటున్న ఇమామ్ అన్వర్ అల్ హలాకీ అనే వ్యక్తిని దర్యాప్తు సందర్భంగా గుర్తించినట్టు అధికారులు తెలిపారు. అబ అబ్బాసీ గురువు యెమెన్‌కు చెందినవాడు. అంతేకాకుండా నిషేధిత ఇస్లామ్ మత బోధకుడు జకీర్ నాయక్ పెను ప్రభావానికి అబ్బాసీ గురయ్యాడు.

అబ్బాసీ నుంచి స్వాధీనం చేసుకున్న కొన్ని పత్రాలకు జామ్‌నగర్‌తో సంబంధాలు ఉన్నట్టు తేలిందని ఏటీఎస్ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో లక్నోలో అధికారుల అదుపులో ఉన్న అబ్బాసీని గుజరాత్ ఏటీఎస్ అధికారులు సైతం విచారించే అవకాశం ఉంది.

గోరఖ్‌నాథ్ దేవస్థానం వద్ద దాడి

అహ్మద్ ముర్తజా అబ్బాసీ అనే వ్యక్తి ఏప్రిల్ 3న ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో గోరఖ్‌నాథ్ దేవస్థానం వద్ద ఇద్దరు పోలీసులపై ఒక పదునైన ఆయుధంతో దాడి చేశాడు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దేవస్థానాన్ని సందర్శించడానికి ఒక రోజు ముందు దేవస్థానం వద్ద దాడి జరిగింది. అయితే అబ్బాసీ మానసిక స్థితి సరిగ్గా లేదని అతడి కుటుంబ సభ్యులు చెప్పడాన్ని పోలీసులు, దాడి జరిగిన తర్వాత అతడికి చికిత్స చేసిన వైద్యులు తోసిపుచ్చారు.