Home News రష్యాపై ఐరాస బహిష్కరణ వేటు: చర్చలు జరపాలన్న భారత్

రష్యాపై ఐరాస బహిష్కరణ వేటు: చర్చలు జరపాలన్న భారత్

0
SHARE

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (UNHRC) నుంచి రష్యాను ఐక్యరాజ్యసమితి సర్వ సభ్య సమావేశం (UNGA) బహిష్కరించింది. ఈ మేరకు ప్రవేశపెట్టిన తీర్మానంపై జరిగిన ఓటింగ్‌లో భారత్ సహా 58 దేశాలు పాల్గొనలేదు. ఓటింగ్‌లో పాల్గొనకపోవడం వెనుక కారణాన్ని ఐక్యరాజ్యసమితి(UN)కి భారత్ శాశ్వత ప్రతినిధి టీఎస్ త్రిమూర్తి వెల్లడించారు. అమాయకుల ప్రాణాలను పణంగా పెడుతున్న దుస్థితి నుంచి బైటపడటానికి దౌత్యం ద్వారా చర్చలు జరపడమే ఏకైక పరిష్కారమని ఆయన తెలిపారు. ఉక్రెయిన్‌లో నానాటికి దిగజారుతున్న పరిస్థితి పట్ల భారత్ తీవ్రమైన ఆందోళన చెందుతున్నదని త్రిమూర్తి తెలిపారు.

“మానవ హక్కుల మండలి నుంచి రష్యా బహిష్కరణకు సంబంధించి ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం ఆపాదించిన తీర్మానానికి భారత్ దూరంగా ఉంది. నానాటికి దిగజారుతున్న పరిస్థితిపై మేం తీవ్రంగా ఆందోళన చెందుతున్నాము. అన్ని రకాల పగా ప్రతీకారాలకు ముగింపు పలకాలనే మా పిలుపును పునరుద్ఘాటిస్తున్నాము ” అని త్రిమూర్తి చెప్పారు.

మానవ హక్కులపై అంతర్జాతీయ డిక్లరేషన్ రూపకల్పన నాటి నుంచి మానవ హక్కుల పరిరక్షణలో మొదటి వరుసలో తాను ఉన్నాననే వైఖరిని భారత్ ప్రధానంగా ప్రస్తావిస్తూ వస్తున్నది. “ఒక ప్రక్రియకు లోబడి అన్ని నిర్ణయాలు తీసుకోవాలనే వైఖరిని మేం బలంగా విశ్వసిస్తున్నాం. ఇందుకు అన్ని ప్రజాస్వామ్య దేశాలు ముందుకు రావాలి. ఇది అంతర్జాతీయ వ్యవస్థలకు మరీ ముఖ్యంగా ఐక్యరాజ్యసమితికి వర్తిస్తుంది” అని త్రిమూర్తి తెలిపారు.

ఇదివరకు కూడా పలు సందర్భాల్లో రష్యాకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానాలపై ఓటింగ్ దూరంగా ఉండాలనే వైఖరికి భారత్ కట్టుబడి ఉంది. దౌత్యపరమైన చర్చలు జరపాలని స్పష్టం చేసింది.

ఉక్రెయిన్‌లో యుద్ధ నేరాలు మరియు బుచా మానవహననం ప్రధానంగా ప్రస్తావిస్తూ రష్యాను UNHRC నుంచి బహిష్కరించాలనే తీర్మానానికి అనుకూలంగా మెజార్టీ సభ్య దేశాలు ఓటు వేశాయి. తీర్మానానికి అనుకూలంగా 93 దేశాలు ఓటు వేశాయి. 24 దేశాలు తీర్మానాన్ని వ్యతిరేకించాయి. తీర్మానాన్ని వ్యతిరేకించిన సభ్య దేశాల్లో బెలారస్, చైనా, ఇరాన్ ఉన్నాయి. ఓటింగ్‌కు దూరంగా భారత్, పాకిస్తాన్, సౌదీ అరేబియా, నేపాల్, యూఏఈ లాంటి 58 సభ్య దేశాలు ఉన్నాయి.