కేవలం కాగితంపైనే కంపెనీలు నడుపుతూ మనీలాండరింగ్, అక్రమ లావాదేవీలు జరిపే సంస్థలపై దృష్టి సారించాలని కేంద్రం నిర్ణయించింది. ఆర్థిక పరిభాషలో డొల్ల (షెల్) కంపెనీలుగా పేర్కొనే ఈ బోగస్ సంస్థల చిట్టా ఇప్పటికే కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రూపొందించింది దాదాపు 2.26 లక్షల షెల్ కంపెనీలపై ఇప్పటికే చర్యలు ప్రారంభించగా మరో 2.25 లక్షల కంపెనీల జాబితాను రూపొందించినట్లు తెలిసింది. అవి తమ ఆదాయపన్ను రిటర్నులు సమర్పించాయా లేదా అన్న విషయంపై నోటీసులు కూడా జారీ చేశాయి.
అయితే చాలా కంపెనీలు తమపై తీసుకున్న చర్యల్ని కోర్టుల్లో సవాలు చేయడంతో షెల్ కంపెనీలను నిర్వచిస్తూ నిబంధనలు రూపొందించాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది సరైన నిర్వచనం లేనందువల్లే చట్టపరమైన చర్యలు తీసుకోవడం సాధ్యం కావడం లేదని, నేరచరితులపై చర్యలు తీసుకోవాలంటే షెల్ కంపెనీల రూపురేఖల్ని కట్టుదిట్టంగా నిర్వచించాలని కేంద్రం భావిస్తోంది. కేవలం కాగితంపైనే నడుస్తూ ఏ లావాదేవీలు నిర్వహించకపోవడం, భవిష్యత్ ప్రయోజనాలకోసం స్థాపించినా వాటిని నడపకుండా కొనసాగించడం, విదేశాలకు డబ్బు మళ్లించి మళ్లీ వెనక్కు రప్పించడం వంటివి షెల్ కంపెనీలు చేస్తున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. చాలా రాజకీయ పార్టీల నేతలు ఈ షెల్ కంపెనీలను ఎన్నికల సమయంలో నిధుల పంపిణీలకు వాడుకుంటున్నాయని కూడా ప్రభుత్వం భావిస్తోంది.
ఇటీవలే షెల్ కంపెనీల తీరుతెన్నులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఫైనాన్షియల్ ఇంటలిజెన్స్, డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటలిజెన్స్, సెబి, ఆదాయపన్ను అధికారుల నుంచి కార్పొరేట్ మంత్రిత్వ శాఖకు పలు సూచనలు వచ్చాయి. ఈసూచనలపై రిజర్వుబ్యాంకు, ఆర్థిక మంత్రిత్వశాఖ అధికారులు, సెబితో మరింత వివరంగా చర్చించి విధాన రూపకల్పన చేసేందుకు ఆర్థిక సహకారం, అభివృద్ది సంస్థ (ఓఈసిడి)ని సంప్రదించాలని కేంద్రం నిర్ణయించింది. విధాన రూపకల్పన కాగానే కేంద్రం షెల్ కంపెనీలపై దర్యాప్తు ప్రారంభించి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని భావిస్తోంది.
దాదాపు 2.26 లక్షల కంపెనీల్లో 1.68 లక్షల సంస్థల బ్యాంకు ఖాతాల వివరాలు లభించాయని, వాటిలో 73,000 కంపెనీలు పెద్ద నోట్ల రద్దు తర్వాత రూ.2.40 లక్షల కోట్ల మేరకు డిపాజిట్ చేశాయని అధికార వర్గాలు తెలిపాయి. మరో 58,000 కంపెనీల బ్యాంకు వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. తీవ్రంగా మోసం చేసిన కంపెనీలుగా భావించి 68 షెల్ కంపెనీలపై దర్యాప్తు చేస్తున్నామని అధికార వర్గాలు తెలిపాయి.
(ఆంధ్రజ్యోతి సౌజన్యం తో)