Home News మన ప్రతి చర్యలోనూ దేశభక్తి భావన కనిపించాలి: గురూజీ

మన ప్రతి చర్యలోనూ దేశభక్తి భావన కనిపించాలి: గురూజీ

0
SHARE

(జూన్ 5 గురూజీ పుణ్యతిథి ప్రత్యేక వ్యాసం)

దేశం తన సొంత బలం మీద నిలబడుతుంది. ఇతరుల సహాయంతో గానీ వారి దయాదాక్షిణ్యాలపై ఆధారపడి దేశం మనలేదు. ఈ దేశం మన సర్వస్వం అన్న భావన కలగనంత వరకూ మన కెంతటి సైన్యం వున్నా సాధనా సంపత్తులు వున్నా… మనం సురక్షితంగా వుండలేం. దేశం పట్ల ప్రేమ ప్రతి మనిషిలోనూ త్రికరణ శుద్ధిగా నిండి వుండాలి. మనం చేసే ప్రతి చర్యలోనూ దేశభక్తి భావన కనిపించాలి. దేవర్షి నారదుడు మహాభక్తుడు. ఇది ద్వాపర యుగం నాటి సంగతి. మూడు లోకాలు తిరుగుతూ తిరుగుతూ నారదుడు ద్వారక చేరుకున్నాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు తన మిత్రుడు అర్జునుడి జుట్టును ఆరబెడుతున్నాడు. అర్జునుడు శ్రీకృష్ణునితో సేవలు చేయించుకుంటున్నాడు.

నారదుడికి తాను మహా భక్తుడిని అన్న అహంకారం వుంటుంది. భగవంతుడికి అత్యంత సన్నిహితులలో తానొకడినని ఆయన అనుకుంటూ వుంటాడు. భగవంతుడిపై తనకు పూర్తి అధికారం వుందని భావిస్తాడు. అలాంటిది శ్రీకృష్ణుడు అర్జునుడికి సేవ చేస్తున్నాడు. ఈ దృశ్యం చూచి నారదుడి మనసులో ఈర్ష్య బయలుదేరింది. సర్వాంతర్యామి అయిన భగవంతుడికి నారదుడి అభిప్రాయాలు తెలియకుండా ఎలా వుంటాయి? కొద్దిసేపు అవగానే అర్జునుడి జుట్టును నారదుని చెవిలో పెడుతూ ఇవి ఆరేంతవరకూ పట్టుకొని వుండు.. నేనిప్పుడే వస్తాను అంటూ బయటికి వెళ్లాడు. నారదుడికి ఎనలేని కోపం వచ్చింది. కాని ఏమి చేస్తాడు. భగవాన్‌ కృష్ణుడు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాల్సిందే కదా. జుట్టు ఎండేంత వరకూ అక్కడే కూర్చున్నాడు. కొద్దిసేపటి తరువాత అనుకోకుండా నారదుడి చెవులు అర్జునుడి జుట్టుకి తగిలాయి. ఆ జుట్టులోంచి వచ్చిన శబ్దం విని నారదుడు ఆశ్చర్యపోతాడు. జుట్టులోని ప్రతి వెంట్రుక నుంచి కృష్ణ శబ్దం వినిపిస్తుంది. అలాగే స్వయంసేవక్‌ యొక్క ప్రతి రోమం నుంచి అతను చేసే ప్రతిచర్య నుంచి ఇది నా దేశం.. నేను ఈ సమాజానికి చెందిన వాడిని అని వినపడుతూ వుండాలి… కనబడుతూ వుండాలి.

(నేడు గురూజీ పుణ్య తిథి )