Home News మే 17లోగా సర్వే పూర్తి చేయాలి: జ్ఞానవాపి కేసులో కోర్టు కీలక తీర్పు

మే 17లోగా సర్వే పూర్తి చేయాలి: జ్ఞానవాపి కేసులో కోర్టు కీలక తీర్పు

0
SHARE

ఉత్తరప్రదేశ్ వారణాసిలోని శివునికి ప్రసిద్ధి చెందిన కాశీ విశ్వనాథ ఆలయానికి ఆనుకుని ఉన్నవివాదాస్ప‌ద క‌ట్ట‌డం జ్ఞానవాపి మసీదు వీడియో సర్వేకు సంబంధించిన కేసులో గురువారం వార‌ణాసి సెష‌న్స్ కోర్టు తీర్పును వెలువరించింది. కోర్టు హిందూ పిటిషనర్లకు అనుకూలంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో అసలు సర్వే కమిషనర్‌ను తొలగించేందుకు కోర్టు నిరాకరించింది. మే 17లోగా జ్ఞాన్‌వాపి మసీదు సర్వే పూర్తి చేయాలని అధికారులను కోర్టు ఆదేశించింది. సర్వే అధికారి మార్పుపై సోమవారం ప్రారంభమైన విచారణ బుధవారం ముగిసింది.

గ‌తంలో కోర్టు నిర్దేశించిన సర్వేలో స‌ర్వే క‌మిష‌న‌ర్ అజయ్ మిశ్రా హిందూ పిటిషనర్లకు అనుకూలంగా ఉన్నారని ఆరోపిస్తూ మరొక అధికారిని కమిషనర్‌గా నియమించాలని మసీదు నిర్వహణ కమిటీ కోరింది. మిశ్రాను మార్చడాన్ని కోర్టు తిరస్కరించింది. మరో ఇద్దరు న్యాయవాదులను కమిషనర్లుగా నియమించాలని ఆదేశించింది.

మొఘలాయిలు ధ్వంసం చేసిన అసలైన కాశీ విశ్వనాథ్ మందిరం అని భావించే వివాదాస్పద నిర్మాణంపై వీడియో సర్వేను కోర్టు ఆదేశించింది. అయితే ముస్లిం గుంపు గేటును అడ్డుకోవడంతో, స‌ర్వే జట్టును ప్రాంగణంలోకి రాకుండా నిరోధించడంతో స‌ర్వే ఆగిపోయింది. కోర్టు నిర్దేశించిన డాక్యుమెంటేషన్‌ను నిలిపివేసిన తర్వాత, ఈ ప్రక్రియలో పాల్గొన్న సర్వే బృందంతో కలిసి వచ్చిన ఒక వీడియోగ్రాఫర్ స్వస్తిక్, నంది, తామరపువ్వుల వంటి హిందూ మూలాంశాలు మ‌సీదు బ‌య‌టి వైపు గోడ‌పై ఉన్నట్లు వెల్లడించారు.

ముస్లిం గుంపు తలుపులు వేసి లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారని, అందువల్ల స్థానిక పరిపాలన అధికారులు తమను ప్రాంగణంలోకి ప్రవేశించడానికి అనుమతించలేదని బృందం సభ్యులు తెలిపారు.