ప్యాటా జీ జీవితం స్వయంసేవకులకు ఒక పుస్తకమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) అఖిల భారత కార్యకారిణి సదస్యులు మాననీయ భాగయ్య అన్నారు. పూర్వ ప్రాంత సంఘ చాలకులు ప్యాట వేంకటేశ్వరరావు గారి సంస్మరణ సభ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ – భాగ్యనగర్ ఆధ్వర్యంలో KMIT పటేల్ హాల్‌లో మే 12వ తేదీన జరిగింది.
ఈ సందర్భంగా సభను ఉద్దేశించి భాగయ్య జీ ప్రసంగిస్తూ అమృతమయమైన సిద్ధాంతం, ఆదర్శమే జీవితంగా సంఘ్‌కు ప్యాటాజీ అంకితమయ్యారని అన్నారు. వారు నిరంతరం సంఘటన పట్ల భక్తి, శ్రద్ధను కలిగి ఉండేవారని ఆయన తెలిపారు. నిర్మలమైన, నిస్వార్థమైన, పవిత్రమైన, అహంకార రహితమైన హృదయంతో ఆనందకరమైన జీవనాన్ని ప్యాటా జీ సాగించారని అఖిల భారత కార్యకారిణి సదస్యులు పేర్కొన్నారు. వారిలోని సంపూర్ణ కళలను సంఘానికి, సమాజానికి సమర్పించారని భాగయ్య జీ తెలిపారు. సమాజంలో పెద్దలను సంఘానికి దగ్గర చేయడంలో వినయంతో నిరంతర ప్రయత్నం చేసిన నిగర్విగా ప్యాటా జీని వారు కొనియాడారు. అలా జీవించిన వ్యక్తులకు మరణం లేదని, వారి మార్గదర్శనం మనలను నిరంతరం ముందుకు నడిపిస్తుందని భాగయ్య జీ అన్నారు.
స్వచ్ఛమైన బంగారం, స్వయంసేవకత్వానికి నిదర్శనంగా ప్యాటా జీ నిలిచారని సభలో ప్రసంగించిన వక్తలు పేర్కొన్నారు. పట్టుదలతో ముందుకు పోయే ఉద్యమ ప్రవృత్తితో కూడుకున్న వారి జీవితం ఒక సందేశమని, వారు చూపిన మార్గంలో ముందుకు పోవడమే ప్యాటాజీకి సమర్పించే నిజమైన శ్రద్ధాంజలిగా వక్తలు తెలిపారు. అనేక మందిని స్వయంసేవకులుగా తీర్చిదిద్దటంలో ఒక సఫల కార్యకర్తగా వ్యవహరించారని ప్యాటా జీని స్మరించుకున్నారు. కుటుంబాలకు కుటుంబాలను సంఘమయం చేసిన కుశల కార్యకర్తగా వారికి వక్తలు నివాళులర్పించారు. సంఘటనా శాస్త్రంలో నేర్పరి, సంఘంలో అనేక పాటలకు స్వరకల్పన చేసిన సంపూర్ణ సంగీతజ్ఞులుగా ప్యాటాజీని సభికులు స్మరించుకున్నారు. పవిత్రమైన రక్షా బంధనం రోజున ఆరంభమైన వారి జీవన యానం అంతే పవిత్రమైన అక్షయ తృతీయ పర్వదినాన పరిసమాప్తమైందని ప్యాటా వేంకటేశ్వరరావు జ్యేష్ఠ పుత్రులు అరుణ్ కుమార్ అన్నారు.
ప్యాటా వేంకటేశ్వరరావు జీ సంస్మరణ సభకు హాజరైన సభికులు వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.