సమాజ కార్యమే జీవన కార్యంగా మలుచుకున్న హల్దెకర్ జీ ధన్యజీవి అని ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ్ సురేష్ జోషి (భయ్యాజీ) అన్నారు. గురువారం (23.2.17) స్వర్గస్తులైన ఆర్ ఎస్ ఎస్ జ్యేష్ట ప్రచారక్ రాం భావ్ హల్దెకర్ పార్థివ శరీరాన్ని దర్శించిన సురేష్ జోషి ఆయనకు నివాళి అర్పించారు.
ఈ రోజు ఉదయం 10 గంటలకు కేశవ నిలయం, బర్కత్ పుర లో జరిగిన శ్రద్ధాంజలి సభలో వివిధ ప్రాంతాలనుండి వచ్చిన స్వయంసేవకులు ఘన నివాళి అర్పించారు.
ఈ సందర్బంగా భయ్యాజీ మాట్లాడుతూ హల్దెకర్ గారిది మహారాష్ట్ర జన్మస్థలమైనా సమాజ కార్యం కోసం ఆంధ్ర రాష్ట్రాన్ని స్వస్థలంగా మార్చుకున్నారని, తెలుగు భాష నేర్చుకోవడమే కాక ఇతర భాష పుస్తకాలను తెలుగులోకి అనువదించగలిగే ప్రావీణ్యతను సాధించారని అన్నారు. నిరంతర పర్యటన ద్వారా సంఘ కార్యాన్ని వ్యాప్తి చేసిన హల్దేకర్జి ఆరోగ్యం సహకరించక ప్రయాణం చేయలేనప్పుడు తన కలం ద్వారా ఆ పని చేశారని గుర్తుచేసుకున్నారు. తక్కువ కాల వ్యవధిలో సూర్యనారాయణ రావు, జయదేవ్ జి , హల్దెకర్ జి వంటి జ్యేష్ట ప్రచారకులను కోల్పోవడం చాలా బాధకరమని ఆయన విచారం వ్యక్తం చేశారు.
శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా శ్రద్ధాంజలి ఘటించారు. హల్దేకర్జి కార్యకర్తలందరిని పేరు పేరున పలకరించగలిగే వారని, అందరితో సత్సంబంధాలు ఉండేవని అన్నారు. సమాజ కార్యం కోసం జీవితాన్ని అంకితం చేసిన హల్దేకర్జి అందరికీ ఆదర్శప్రాయులని వెంకయ్యనాయుడు అన్నారు.
ఆర్ఎస్ఎస్ సహ సర్ కార్యవాహ భాగయ్య జీ, క్షేత్ర ప్రచారక్ శ్యాంజీ , కేంద్ర మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి మాణిక్యల రావు , బి జె పి నాయకులు కిషన్ రెడ్డి తదితరులు కూడా హల్దెకర్ జి కి శ్రద్ధాంజలి ఘటించిన వారిలో ఉన్నారు.





