Home Telugu Articles ‘ఉగ్ర’నాగుల కోరల్లో పాక్ విలవిల

‘ఉగ్ర’నాగుల కోరల్లో పాక్ విలవిల

0
SHARE

ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు. మనుగడ కోసం మారణ హోమాన్ని జీవనోపాధిగా ఎంచుకున్న పాకిస్తాన్ ఇవాళ అదే తీవ్రవాదం కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. ఈనెల 16న పాకిస్తాన్ సింధ్ ప్రాంతంలోని షెహవాన్ పట్టణంలో ప్రఖ్యాత లాల్ షాహ్ బాజ్ ఖలందర్ దర్గాలో జరిగిన పేలుళ్లు ఇందుకు నిదర్శనం. ఐఎస్‌ఐఎస్ జరిపిన ఈ పేలుళ్లలో 72 మందికి పైగా అమాయకులు మరణించగా వందల మంది తీవ్రగాయాలపాలయ్యారు. పాకిస్తాన్ పెంచి పోషించిన ఉగ్రవాద విషనాగులు ఇప్పుడు ఆ దేశాన్నేకాటువేస్తున్నాయి. ఇస్లాం మతాన్ని అడ్డుపెట్టుకుని హింసోన్మాదులు తమ రక్తపిపాసను తీర్చుకోవడానికి ఇటీవల కొత్త కొత్త కారణాలు ఎన్నుకుంటున్నారు. ఇస్లాం మతంలోని షియాలు-సున్నీల మధ్య గొడవలు ఘర్షణలుగా మారి చంపుకునే స్థాయి దాటి మారణ హోమం దాకా ఎగబాకడం చరిత్ర చెబుతున్న సత్యం. షియా, సున్నీల మధ్య ఘర్షణలు దేశాల మధ్య యుద్ధాలుగా మారి ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తుంటే ఇప్పుడు కొత్తగా ఇస్లాంలోనే అంతర్భాగమైన ‘సూఫీ’ అనుయాయులుపై దాడులు ముమ్మరం అయ్యాయి. మారణకాండ జరిపేందుకు మిషలు వెదుక్కుంటున్న ఐఎస్‌ఐఎస్ తీవ్రవాదులు ఇప్పుడు ‘సూఫీ విధానాలు ఇస్లాంకు వ్యతిరేకం’ అంటూ వీరిని ‘కాఫిర్లు’గా ముద్రవేసి చంపడం మొదలుపెట్టారు.

ఇస్లాంలో సూఫీలు ‘లిబరల్స్’. సూఫీ అనుయాయులు కొన్ని నియమాలు పాటిస్తూ, ఆరాధనా విధానాలు అనుసరిస్తూ భగవంతుడిని ప్రార్థిస్తుంటారు. కాబట్టి వారిని ‘ఇస్లాం వ్యతిరేకులు’గా ముద్రవేసి తీవ్రవాదులు చంపుతున్నారు. దర్గాలలో జరిగే కార్యక్రమాలు విగ్రహారాధనకు దగ్గరగా వుంటాయి. విగ్రహారాధనకు ఇస్లాంలో స్థానం లేదు కాబట్టి వీరంతా ‘కాఫిర్లు’ అంటూ చంపేస్తున్నారు. షెహవాన్ పట్టణంలో దాడికి మూడు నెలల ముందు ఐఎస్‌ఐఎస్ తీవ్రవాదులు పాకిస్తాన్ బెలూచిస్తాన్ ప్రాంతంలోని సూఫీ ప్రార్ధనా మందిరంపై దాడి చేసి 45 మందిని పొట్టనపెట్టుకున్నారు. గత జూన్‌లో కరాచీలో ప్రఖ్యాత సూఫీ సంగీతకారుడు అమ్జాద్ సద్రీని కాల్చి చంపారు. సూఫీ అనుయాయులు సంగీతం వాద్య పరికరాల ద్వారా ముస్లింలలో భక్త్భివన పెంచడం ఖురాన్‌కు వ్యతిరేకం అంటూ తీవ్రవాదులు మూకుమ్మడి హత్యలకు పాల్పడుతున్నారు.

అల్‌ఖైదాకు చెందిన ఒసామా బిన్ లాడెన్ ‘వహబీ’ అనునాయి. వహబీ అనుయాయులు ఛాందసవాద, కరడుగట్టిన ఇస్లాం సంప్రదాయాలను పాటిస్తారు. వహబీలకు సూఫీయిజం చుక్కెదురు. సూఫీ అనుయాయులను ముస్లిమేతరులుగా చిత్రీకరిస్తూ చంపేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం తహరీక్-ఎ-తాలీబాన్ పాకిస్తాన్, లష్కర్-ఎ-ఇస్లాం సంస్థలకు చెందిన తీవ్రవాదులు సూఫీ ప్రార్ధనా మందిరాలు, సూఫీ గురువులు, ప్రజలను లక్ష్యంగా పెట్టుకుని దాడులు చేస్తూ వస్తున్నారు. డజన్ల కొద్దీ సూఫీల ప్రార్ధనా మందిరాలు ధ్వంసం కాగా, వందల కొద్దీ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్‌లో ఆఫ్గన్లు, అరబ్బుల ఆర్థిక సహకారంతో ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొచ్చిన మదర్సాలు కూడా ఆ దేశంలో తీవ్రవాద విస్తరణకు దోహదం చేస్తున్నాయి. పాకిస్తాన్‌లోని మదర్సాలు తాలిబన్ తీవ్రవాదుల నేతృత్వంలో ‘ఉగ్రవాదులను ఉత్పత్తి చేసే కర్మాగారాలు’గా మారిపోయాయి.

భారత వ్యతిరేకతతో పాకిస్తాన్ అధికారికంగా ఇస్లామిక్ తీవ్రవాదాన్ని పెంచి పోషించింది. పాకిస్తాన్ కేంద్రంగా తీవ్రవాద విషవృక్షం బలంగా వేళ్లూనుకుని ప్రపంచశాంతికి పెను ముప్పుగా మారింది. ఆసియా ఖండంలో పట్టుకోసం ప్రయత్నించిన అనేక పశ్చిమ దేశాలు మొదట్లో పాకిస్తాన్ ప్రేరిత తీవ్రవాదాన్ని ఉద్దేశ పూర్వకంగానే పట్టించుకోలేదు. రానురాను ఈ తీవ్రవాదం తమ దేశాలకు కూడా వ్యాపించి ప్రాణ, ఆస్తి నష్టాలకు కారణం కావడంతో తీవ్రవాదానికి వ్యతిరేంగా భారత్ చేస్తున్న ఉద్యమాన్ని సమర్ధించక తప్పలేదు. ఆఫ్ఘనిస్తాన్ వెంట ఉన్న పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలు తీవ్రవాదులకు పెట్టని కోటలుగా మారిపోయాయి. అంతర్జాతీయ స్థాయిలో తీవ్రవాదాన్ని ప్రాయోజితం చేస్తున్న దేశంగా పాకిస్తాన్ 2008లోనే గుర్తించారు. ‘భారత్‌లో తీవ్రవాద సంస్థలకు పాకిస్తాన్ ప్రత్యక్ష సహకారం అందిస్తోంది. జమ్ము- కశ్మీర్‌లో ఘర్షణ వాతావరణం ఏర్పడేలా తీవ్రవాదులకు శిక్షణ, ఆర్థిక సహాయాన్ని పాక్ అందచేస్తున్నదని’ ప్రముఖ రక్షణరంగ నిపుణుడు గోర్డన్ థామస్ నివేదిక ఇచ్చారు. తీవ్రవాదులకు, నేరచరితులకు పాకిస్తాన్ సైనిక అధికారుల అండ ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. పాకిస్తాన్ అండదండలు, ప్రత్యక్ష ప్రమేయం లేకుండా ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడడం సాధ్యం కాని పని. 1990 ప్రాంతంలో ఒక నామమాత్రపు సంస్థగా వున్న తాలిబాన్‌కు పాకిస్తాన్ అధికారులు ధన సహాయం చేసి, సైనిక సహకారం అందించి కరుడుగట్టిన తీవ్రవాద సంస్థగా మలిచి అధికారం కట్టబెట్టారు. 11 సెప్టెంబర్ 2001న న్యూయార్క్‌లో అల్‌ఖైదా దాడుల తర్వాత అమెరికా తెచ్చిన విపరీతమైన ఆర్థిక, దౌత్య, వ్యాపార వత్తిడుల కారణంగా పాకిస్తాన్ తాలిబన్లతో రాజకీయ, ఆర్థిక సంబంధాలు తగ్గించుకుంటూ వచ్చింది. ఇంత జరిగినా నేటికీ కొంతమంది పాక్ సీనియర్ అధికారులు తాలిబాన్ ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ తీవ్రవాద శిబిరాలతోపాటు పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలోనూ తీవ్రవాద శిక్షణ సంస్థలను నెలకొల్పి వీరిని దొంగతనంగా భారత్‌లోకి ప్రవేశపెట్టి పాకిస్తాన్ అరాచకాలు సృష్టించడం మొదలుపెట్టింది. పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఈ విషయాన్ని స్వయంగా అంగీకరించారు. భారత రక్షణ దళాలతో పోరాడేందుకు తీవ్రవాదులకు పాకిస్తాన్ సైనిక అధికారులు శిక్షణ ఇచ్చారు. కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ స్థాయిలో చర్చించేలా భారత్‌పై వత్తిడి తీసుకువచ్చేందుకు తీవ్రవాదాన్ని పాకిస్తాన్ వాడుకున్నది. గతంలో ఆఫ్ఘనిస్తాన్‌లో కర్జాయ్ ప్రభుత్వం భారత్‌కు అనుకూలంగా ఉండేది. కర్జాయ్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు పాకిస్తాన్ తన గూఢచార సంస్థ ‘ఐఎస్‌ఐ’ను అడ్డం పెట్టుకుని తాలిబన్ శక్తులను ప్రోత్సహించింది.

కశ్మీర్‌తోపాటు భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో పేలుళ్లు జరిపి ప్రాణ, ఆస్తినష్టాలను కలుగచేయడంలో ఐఎస్‌ఐ కీలకపాత్ర వహించింది. 2001లో భారత పార్లమెంటుపై దాడి, 2006లో ముంబయిలో రైలు పేలుళ్లు, వారణాసిలో పేలుళ్లు, 2007లో హైదరాబాద్‌లో పేలుళ్లు, 2008లో మళ్లీ ముంబయిలో పేలుళ్లు జరిపి భారీగా ప్రాణ,ఆస్తినష్టం కలగచేయడంలో పాక్ కుట్రలు పన్నింది. ముజాహిదీన్లను చేర్చుకుని తీవ్రవాదులుగా మార్చడంలో ఐఎస్‌ఐ ప్రముఖ పాత్ర వహించింది. తీవ్రవాదం అంతటితో ఆగకుండా నెమ్మదిగా రష్యా, చైనా, ఇజ్రాయిల్, అమెరికా, ఇంగ్లండ్, ఫ్రాన్స్ తదితర దేశాలకు వ్యాపించి అక్కడి అమాయకులను చంపడం మొదలుపెట్టింది. భారత్ పట్ల పాకిస్తాన్ ఆగడాలను చూసీ చూడనట్టు వదిలేసిన ప్రపంచ దేశాలు ఆ విపత్తులు తమ ముంగిట వాలేసరికి గుడ్లు తేలేశాయి. ఒక్కసారిగా ఉలిక్కిపడి పాకిస్తాన్‌ను తీవ్రవాద దేశంగా గుర్తించాలంటూ ప్రకటనలు, హెచ్చరికలు చేయడం మొదలుపెట్టాయి.

అల్‌ఖైదాతోపాటు లష్కర్-ఎ-ఓమర్, లష్కర్-ఎ-తోయిబా, జైష్-ఎ-మహ్మద్ తదితర కరుడుగట్టిన తీవ్రవాద సంస్థలు పాకిస్తాన్ సంరక్షణలోనే పెరిగాయి. తాలిబన్ అయితే పాకిస్తాన్‌కు అనధికార సైన్యంగా మారిపోయింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో వందలాది తీవ్రవాద శిబిరాలు నిర్వహిస్తూ, జమ్ము కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జెకెఎల్‌ఎఫ్) కు చెందిన వేలాదిమంది తీవ్రవాదులకు పాకిస్తాన్ సైనిక అధికారులు శిక్షణ ఇచ్చి భారత్‌లో విధ్వంసం సృష్టించడానికి పంపించారు. తీవ్రవాద కార్యక్రమాలకు మతాన్ని వాడుకోవడం పాకిస్తాన్ 1979 నుంచి ప్రారంభించింది. భారత వ్యతిరేక శక్తులకు నాయకత్వం వహిస్తున్న హఫీజ్ సరుూద్ వంటివారిని పాకిస్తాన్‌లో హీరోలుగా చూపించడం మొదలుపెట్టారు. అల్‌ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్‌కు పాకిస్తాన్ మాజీ ఐఎస్‌ఐ అధినేత లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్‌ఘజాపాషా సహకారం అందించారు. ఐక్యరాజ్యసమితి అనేక సందర్భాల్లో వివిధ తీవ్రవాద సంస్థలపై నిషేధం విధించగా పాకిస్తాన్ అండదండలతో ఈ సంస్థలన్నీ పేర్లు మార్చుకుని తమ హింసా కార్యక్రమాలను కొనసాగిస్తూ వస్తున్నాయి. నాటో దేశాలు 2001లో ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబన్ తీవ్రవాద స్థావరాలపై ముప్పేట దాడి జరిపినపుడు పాకిస్తాన్ తమ దేశపు వైమానిక దళాలను వినియోగించి, దాదాపు 5,000 మంది తీవ్రవాదులను రక్షించింది. పాక్ విమానాలు తీవ్రవాదులను తరలించడంలో తలమునకలై వుండడం ప్రపంచమంతా గమనించింది. భారత్‌కు వ్యతిరేకంగా జమాత్ ఉద్ దావా (జెయుడి) అనే సంస్థ పాకిస్తాన్‌లో పెద్దఎత్తున సభలు నిర్వహిస్తూ వుంటుంది. కశ్మీర్‌లో జిహాదీ ఉద్యమం నిర్వహించడమే దీని లక్ష్యం. అమెరికా తదితర దేశాలు ‘జెయుడి’ని నిషేధించాయి. ఈ సంస్థ 2014లో లాహోర్‌లో నిర్వహించిన సభలకు పాకిస్తాన్ ప్రభుత్వం రెండు ప్రత్యేక రైళ్లలో జనాన్ని తరలించి, సభకు రక్షణ కల్పించడానికి నాలుగు వేలమంది పోలీసుల్ని నియోగించింది. భారత వ్యతిరేక కార్యక్రమాల కోసం ఈ సంస్థ పెద్దఎత్తున విరాళాలు సేకరిస్తోంది.

పాకిస్తాన్ పెంచి పోషించిన మరో తీవ్రవాద సంస్థ హక్కాని నెట్‌వర్క్. లష్కర్-ఎ-తొయిబా, జైషి-ఎ-మహ్మద్‌లు భారత్‌లో హింసాత్మాక ఘటనలు జరుపుతున్నట్టే హక్కానీ నెట్‌వర్క్ అమెరికా, నాటో దేశాలను లక్ష్యంగా చేసుకుని తీవ్రవాద చర్యలు నిర్వహిస్తాయి. పాక్ ప్రధాన మంత్రికి జాతీయ భద్రతా సలహాదారుడైన సర్తాజ్ అజీజ్ 2015లో బిబిసి వార్తా సంస్థకు ఒక ఇంటర్వ్యూ ఇస్తూ, తీవ్రవాదుల వల్ల పాక్ సైన్యానికి, రక్షణ రంగానికి ఇబ్బందులు లేనందున వారిని నిరోధించాల్సిన అవసరం లేదనడం- ‘పాకిస్తాన్‌కు ప్రతిరూపం తీవ్రవాదం’ అన్న అభిప్రాయాన్ని రూఢీ పరస్తున్నది.

పాకిస్తాన్ ప్రాయోజిత తీవ్రవాదం ప్రమాదకరంగా మారడంతో ఆ దేశాన్ని తీవ్రవాద దేశంగా గుర్తించాలంటూ 2016లో అమెరికా పార్లమెంటు సభ్యులు టెడ్‌పాయ్, దానా రోహన్‌బెకర్‌లు ఒక బిల్లు ప్రవేశపెట్టారు. అంతకుముందే అప్పటి బ్రిటన్ ప్రధాని డేవిడ్ కెమరూన్ పాకిస్తాన్ తీవ్రవాదాన్ని గట్టిగా ఖండిస్తూ, తీవ్రవాదాన్ని ఎగుమతి చేయడం సహించబోమని హెచ్చరిక చేశారు. పాకిస్తాన్ పెంచి పోషించిన తీవ్రవాదం ఆ దేశాన్నే దావానలంలా చుట్టుముట్టింది. తీవ్రవాద చర్యలను మానుకోకపోతే ఆ దేశంలోని మైనార్టీ వర్గాలపై , సంస్కరణ వాదులపై దాడులు జరుగుతునే వుంటాయి. ఇప్పటికే అక్కడి హిందువుల్లో అత్యధిక సంఖ్యాకులు హత్య కావింపబడడమో, మతం మార్చుకోవడమో లేదా శరణార్ధులుగా ఇతర దేశాలకు వలస వెళ్లిపోవడమో జరిగింది. పంజాబ్, సింధ్, బెలుచిస్తాన్ ప్రాంతాలలో పాక్ సైన్యం అండతో పేట్రేగిపోతున్న తీవ్రవాదుల అకృత్యాలకు అంతేలేదు. మూకుమ్మడి మానభంగాలు, హత్యలు సర్వసాధారణమైపోయాయి. బాధితులంతా ఇస్లాంలోని మైనారిటీ వర్గాలే. ఇప్పుడు సూఫీ అనుయాయులపై దాడులు ప్రారంభమైనాయి. తమ మతస్తులే అన్న కనికరం కూడా చూపకుండా తీవ్రవాదులు ఇస్లాంలోని మైనారిటీ వర్గాలను చంపడం మొదలుపెట్టారు. ఈ తీవ్రవాద పెనుభూతం రానున్న రోజుల్లో మొత్తం పాకిస్తాన్‌నే నాశనం చేయకుండా వుండాలంటే ఇప్పటికైనా అక్కడి ప్రభుత్వం తీవ్రవాదానికి ప్రత్యక్ష, పరోక్ష మద్దతును వెంటనే ఉపసంహరించుకోవాలి. నిజాయితీతో తీవ్రవాదాన్ని అణగదొక్కితేనే ఆ దేశం మనగలుగుతుంది. లేకుంటే తాను పెంచి పోషించిన ఇస్లామిక్ తీవ్రవాదానికి తానే బలికాక తప్పదు.

-కామర్సు బాలసుబ్రహ్మణ్యం

(ఆంధ్రభూమి సౌజన్యం తో )