Home Hyderabad Mukti Sangram హత్యాకాండను తప్పించుకున్న ఐదువందల మంది (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-28)

హత్యాకాండను తప్పించుకున్న ఐదువందల మంది (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-28)

0
SHARE

గ్రామంలో కొనసాగుతున్న హత్యాకాండను తప్పించుకొని దాదాపు ఐదువందల మంది పెద్దలు, పిల్లలు షావుకారు మహాదేవప్ప డుమనే ఇంట్లో తలదాచుకున్నారు. డుమనే ఇల్లు చిన్న కోటలాంటిది. రెండంతస్తుల మేడ. చుట్టూరా గోడ. రెండో అంతస్తుపై ముగ్గురు వ్యక్తులు తుపాకులతో వారిని కాపాడారు. డుమనే ఇంట్లో చాలా ఆయుధాలున్నాయని దాడిచేయడం సాధ్యంకాదని రజాకార్లు ఎదురుగా ఉన్న ఇంటిపై నుండి ఎదురు కాల్పులు కొనసాగించారు. ఫలితంగా మారుతి అప్పకొనే.

చిన్నప్ప బరాదర్, డుమనే మేడపైనే ప్రాణాలు వదిలారు. మహాదేవప్ప ఇంటిపై నుండి కాల్పులు సాగించిన వ్యక్తులలో ముఖ్యమైనవాడు  హలంబిరే నాగన్న. అతని దగ్గర ట్వెల్వ్‌బోర్ తుపాకి, మిగతా ముగ్గురి దగ్గర మూడు తుపాకులు మాత్రం ఉన్నాయి. వాటితోనే దాదాపు 15 మంది రజాకార్లను నేలకూల్చి వేశారు. శివరాముడి భుజంలోంచి గుండు దూసుకుపోయింది. హలంబరే నాగన్నతోబాటు, కాశప్పభాల్కె, సిద్ధరామప్ప వటవే దినమంతా అలసిపోకుండా రజాకార్లను త్రిప్పికొడుతూనే ఉన్నారు.

నాగన్న వీరోచితమైన చర్యవల్ల ఐదువందల మంది ప్రాణాలు దక్కిపోయాయి. లేనిపక్షంలో ఆనాడు వాళ్ళను రజాకార్లు ఊచకోత కోసేవాళ్ళే. చీకటి పడగానే రాజాకార్లు వెనక్కి తగ్గిపోయారు. మహాదేవప్ప ఇంట్లో నుండి దాడి జరుగగలదనే భయంతో గ్రామం నుండి రజాకార్లు వెళ్ళిపోయారు. ఈ చీకటి ఆసరాతో ఐదువందల మంది గోర్టాను ఖాళీచేసి సురక్షితమైన ప్రాంతాలకు తరలిపోయారు. డుమనే ఇల్లు సాంతం ఖాళీ అయిపోయింది.

మరుసటిరోజు రజాకార్లు తిరిగి రోడ్డుపై దాడి జరిపారు. కాని శ్మశానంలా మారిపోయిన గ్రామంలో ఒక్క ప్రాణీ కనిపించలేదు. శవాలపై ఎగురుతున్న రాబందులు, కాకులు తప్ప మరేం కనబడలేదు. రజాకార్లు కాల్పులు జరుపుతూ, డుమనే ఇంటి సమీపానికి వచ్చి ఎదరుదాడి జరుగుతుందేమోనని ఎదురు చూశారు. కానీ ఎలాంటి అలికిడి లేనందువల్ల రజాకార్లు చిన్న కోటలాంటి ఆ ఇల్లును సాంతం దోపిడీ చేశారు. పాతిపెట్టిన బంగారం ఏదైనా దొరుకుతుందేమోనని ఇంటి నేలంతా త్రవ్వి పారేశారు. చివరికి నిప్పు అంటించారు. రాతిగోడలు తప్ప అన్నీ కాలిపోయాయి.

డుమనే ఇంటి దోపిడీ జరుగుతుండగా జానాపూర్ నుండి త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని కొందరు హిందూ యువకులు సహాయార్థం గోర్టా చేరుకున్నారు. జండాను చూసి కూడా కాల్పులు కొనసాగిస్తున్న విషయాన్ని పసిగట్టి ఆ యువకులు తిరుగు ముఖం పట్టారు. ఆ బృందంలో ముచలమ్ గ్రామానికి చెందిన నలుగురు యువకులు కూడా ఉన్నారు. వాళ్ళు నలుగురూ తోగలూర్ గ్రామంలోని తమ బంధువులను కలుసుకోవాలని బృందం నుండి విడిపోయి, మరోదారిన వెళుతుండగా రజాకార్లు పై నుండి చూసి పసిగట్టారు. వాళ్ళను వెంబడించి తోగలూర్ గ్రామంలోకి పోయి భోజనానికి ఉపక్రమించిన ఆ నలుగురు యువకుల్ని బయటకు లాగి చంపివేశారు. హత్య చేయబడిన ఆ యువకుల పేర్లు  మాదప్ప, కంటప్ప, రామిశెట్టి, అలడప్ప.

గోర్టాపై సాగిన పైశాచిక హత్యాకాండ తర్వాత నెలల తరబడి ఆ గ్రామాన్ని ముస్లింలు లూటీ చేశారు. కొందరు పస్త్ అక్వాంల సహాయంతో గ్రామంలోని ధాన్యం రేకులు, రూపాయలు, వెండి, బంగారం, తలుపులు, కిటికీలు, బట్టలు, పశువుల్ని ఏది చేతికి దొరికితే అదే దోపిడీ చేశారు. అక్కడి భూముల్ని, ఇళ్ళను రజాకార్లు పంచుకున్నారు. ఇంత ఘోర హింసాకాండ, దోపిడీ జరిగిన తర్వాత కూడా పాలకవర్గానికి చీమ కుట్టినట్లు కూడా కాలేదు. పోలీసుచర్య తర్వాత వినోభాభావే ఈ గ్రామానికి ప్రత్యేకంగా వెళ్ళి నిర్వాసితులైన గ్రామస్థులకు ఆ గ్రామాన్ని తిరిగి అప్పగించారు.

ఆనాటి విషాదకరమైన సంఘటన ఈనాటికీ ఎవరూ మరిచిపోలేదు. తాము చేసిన పాశవిక చర్యలకు పశ్చాత్తాపంగా ఆ గ్రామంలో ఈనాడు ఒక ముస్లిం కూడా నివసించడం లేదు. సగం బూడిదపాలైన గోర్టా స్వాతంత్య్రం పొంది కూడా ఈనాటికీ తన గాయాలని మరిచిపోకుండా ఉంది.

బీబీనగర్ దోపిడీ
నిశ్శబ్దంగా ఉన్న బీబీనగర్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారంపై అకస్మాత్తుగా నినాదాలు వినవచ్చాయి. దాదాపు 12 మంది యువకులు “మహాత్మాగాంధీకి జై, భారతమాతాకి జై, స్టేట్ కాంగ్రెస్ జిందాబాద్‌” అనే నినాదాలతో దిక్కులను మార్మ్రోగిస్తున్నారు. స్టేషన్ గదులలోని జనమంతా ఆశ్చర్యంగా బయటకు వచ్చి చూడసాగారు. పరిచయమున్న యువకులే ఆ నినాదాలు చేస్తున్నారు. బీబీనగర్‌లో బియ్యం కొరత ఉన్నందువల్ల రోజూ జనగామ వెళ్ళి బియ్యం సంచులు మోసుకొచ్చే ఆ యువకులే ఈనాడు ఉత్సాహంగా నినాదాలు చేస్తూ రోడ్డువైపు పరుగిడుతున్నారు. అంతకు పూర్వమే దూరం నుండి “జిందాబాద్‌” అనే చప్పుడు జనానికి వినబడింది.