విజయదశమి వేడుకల్లో ఆర్ ఎస్ ఎస్ ప్రాంత ప్రచారక్ పి దేవేందర్ జీ
శతాబ్దాల తరబడి వికసించిన విజ్ఞాన రీతుల, ప్రేరణల సమష్టి సమాహారం హిందుత్వం, ఇదే సనాతన ధర్మమని, శాశ్వతమైన ధర్మమని అభివర్ణించారు. హిందుత్వం ఒక మతం కాదు ఈ దేశపు జీవన విధానమని ఆర్ ఎస్ ఎస్ తెలంగాణ ప్రాంత ప్రచారక్ పి. దేవేందర్ జీ అన్నారు. ఆర్ ఎస్ ఎస్ బర్కత్ పురా బాగ్ ఆధ్వర్యంలో అంబర్ పేట ఎం సి ఎచ్ గ్రౌండ్లో నిర్వహించబడిన విజయ దశమి వేడుకలకు ముఖ్య వక్తగా విచ్చేసిన అయన కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు . హిందుత్వంలో ఉన్న సహన శీలత ఇతర ధర్మాలను గౌరవించాలనే ప్రవృత్తి కారణంగానే మనదేశంలోకి విదేశాలనుండి కొత్త మతాలు వ్యాపించగలిగాయని అయన వివరించారు. భారత చరిత్ర ఇందుకు సాక్ష్యం. అన్ని విశ్వాసాలకు, నమ్మకాలకు ఆలవాలమైన హిందుత్వం ఏ ఒక్క విశ్వాసాన్ని, నమ్మకాన్ని ధ్వంసం చేయలేదు, వమ్ము చేయలేదు. అన్నింటిని ఆదరించాలన్నదే సనాతన తత్త్వం. సర్వమత సమభావానికి ప్రతీక హిందుత్వమని దేవేందర్ జీ పేర్కొన్నారు. సహనం, సంయమనంతో వ్యవహరించే చరిత్ర హిందుత్వంకు ఉంది, అందుకే హిందూ సంఘటన ఆధారంగా యావత్తు సమాజాన్ని సమైక్యపరచాలన్నదే ఆరెస్సెస్ లక్ష్యమని అయన చెప్పారు. అయితే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) కేవలం హిందువుల కోసం మాత్రమే కాదని.. ఇది భారతీయులందరి కోసం పని చేసే సంస్థ అని అన్నారు. వ్యక్తి నిర్మాణం తద్వారా దేశాభివృద్ధి కోసం ప్రజస్వామ్య పద్ధతిలో నడుస్తున్న సంఘ్ వైపు నేడు సమస్త సమాజం ఆశగా చూస్తుందని అయన వివరించారు. అందుకు తగ్గట్లుగా సంఘ్ కాలానుగుణమైన మార్పులతో ప్రజలకు చేరువవుతుందని దేవేందర్ జీ తెలిపారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన పర్యావరణవేత్త విజయరాం మాట్లాడుతూ వాతావరణ కాలుష్యం వల్ల ఏడాదికేడాది ఉష్ణోగ్రతలు పెరిగిపోతూ మానవాళికి పెనుముప్పు పొంచి ఉంది. ఈ విషయంపై దృష్టి కేంద్రీకరించకపోతే భవిష్యత్ తరాల మనుగడ ప్రశ్నార్థకమవుతుందని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రచార ఆర్భాటం తప్ప శాశ్వత పరిష్కార మార్గాల వైపు పాలకులు మొగ్గుచూపడం లేదని అయన ఆందోళన వ్యక్తం చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ, ప్లాస్టిక్ రహిత వస్తువులను వాడుకుంటూ, పచ్చదనానికి ప్రాముఖ్యత ఇచ్చినపుడు పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని విజయారామ్ పేర్కొన్నారు. ఈ దిశగా ప్రతీ ఒక్కరు కృషి చేయాలని అయన పిలుపు నిచ్చారు. అనంతరం సంఘ్ స్వయం సేవకులు అంబర్ పేట్ పరిసర ప్రాంతాలలో కవాతు నిర్వహించారు. స్థానిక ప్రజలు స్వాగత వేదికలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున పూలు చల్లి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఎస్ ఎస్ క్షేత్ర సహా బౌద్ధిక్ ప్రముఖ్ గోవిందాజీ, బాగ్ కార్యదర్శి దిలీప్ సహానీ, సహా కార్యదర్శులు శివాజీ, పురుషోత్తం తో పాటు ఆర్ ఎస్ ఎస్ రాష్ట్ర స్థాయి నేతలు రాంపల్లి మల్లికార్జున్, భానుసింగ్, ఆకుతోట రామారావు తదితరులుతో పాటు సంఘ కార్యకర్తలు పాల్గొన్నారు.