-రాకా సుధాకర్ రావు
హైదరాబాద్ ముక్తి సంగ్రామ చరిత్ర విషయంలో అనేక రకాల వక్రీకరణలు జరుగుతున్నాయి. అవగాహనా రాహిత్యంతో కొంత వక్రీకరణ జరిగితే, అధ్యయన రాహిత్యంతో మరికొంత జరుగుతోంది. అన్నిటికీ మించి దురుద్దేశపూరిత ఏజెండాతో ఘోరమైన వక్రీకరణ జరుగుతోంది. ఈ దురుద్దేశానికి ఇంగువకట్టిన గుడ్డ లాంటి పూర్వ రాజకీయ వాసనలు తోడై అది మరింత ప్రమాదకరంగా మారుతోంది.
దేశవిభజనానంతరం 550 వరకూ సంస్థానాల విలీనం జరిగింది. అయితే ఈ సంస్థానాల విలీనం విషయంలో చాలా కాలంగా ఒక అబద్ధం ప్రచారమౌతోంది. సంస్థానాధీశులకు భారత్ లో కలిసేందుకు, లేదా పాకిస్తాన్ లో కలిసేందుకు, లేదా స్వతంత్రంగా ఉండేందుకు బ్రిటిషర్లు అధికారాన్ని కల్పించారన్న వాదన ప్రచారమౌతోంది. కానీ ఇది పూర్తిగా అవాస్తవం.. బ్రిటిష్ ప్రభుత్వం వారికి భారత్ లేదా పాకిస్తాన్ లో విలీనమయ్యే అవకాశాన్ని మాత్రమే కల్పించింది. స్వతంత్రంగా ఉండేలా మూడో ఆప్షన్ లేదు. నిజానికి బ్రిటిష్ అధికారిక డాక్యుమెంట్లలో స్వంతంత్రంగా ఉండే అవకాశమే కల్పించలేదు.
అలాగే బ్రిటిషర్లు సంస్థానాల విలీనానికి మతంతో కూడా ముడిపెట్టలేదు. ప్రిన్సిపుల్ ఆఫ్ కంటిగ్యుటీ (సామీప్యతా సూత్రం) అంటే భారత్ సమీపంగా ఉంటే భారత్ లో, పాకిస్తాన్ సమీపంలో ఉంటే పాకిస్తాన్ లో ఉండేలా నిర్ణయం తీసుకోవచ్చు. దీని ప్రకారం హిందూ జనాభా అధికంగా ఉండి, హిందూ రాజు ఉన్న రాజస్థాన్ లోని అమర్ కోట్ సంస్థానం పాకిస్తాన్ లో చేరింది. భారత పాకిస్తాన్లతో సరిహద్దును పంచుకునే జోధ్ పూర్, జైసల్మేర్ రాజపుత్ర రాజులు కూడా పాకిస్తాన్ లో చేరాలనుకున్నారు. జోద్ పూర్ రాజుకు జిన్నా తెల్లకాగితంపై సంతకం చేసి ఇష్టం వచ్చిన కండిషన్లు వ్రాసుకొండి అని ఆఫర్ కూడా ఇచ్చాడు. తరువాత బరోడా మహారాజు ప్రోత్సాహంతో జోధ్ పూర్, జైసల్మేర్ లు భారత్ లో విలీనం అయ్యాయి. మిశ్రమ జనాభా ఉన్న బహావల్ పూర్ వంటి సంస్థానాలు పాకిస్తాన్ లోని పంజాబ్ కు దగ్గరగా ఉన్నాయి కాబట్టి పాకిస్తాన్ లో చేరాయి. ముస్లిం జనాధిక్యం ఉండీ బెలూచ్ రాజు ఖాన్ ఆఫ్ కలాత్ (ముస్లిం మతానుయాయి) పాకిస్తాన్ లో చేరకుండా స్వతంత్రంగా ఉండాలని భావిస్తే జిన్నా వారి చేత బలవంతంగా విలీన పత్రాలపై సంతకాలు చేయించుకున్నాడు. ఆ తరువాత పాక్ సేనలను బెలూచ్ రాజ్యంపైకి పంపించి, రాజ్యాన్ని విలీనం చేసుకున్నాడు.
మన దేశంలోని భోపాల్, కొచ్చి, మణిపూర్, జునాగఢ్, కశ్మీర్ సంస్థానాధీశులు తాము స్వతంత్రంగా ఉండాలనుకున్నారు. కానీ అది సాధ్యం కాదని తెలిసిన తరువాత భారత్ లో విలీనం అయ్యారు. కశ్మీర్ తప్ప మిగతా సంస్థానాధీశులు వారు కోరుకున్నా పాకిస్తాన్ లో విలీనం కాలేరు. ఎందుకంటే ప్రిన్సిపుల్ అఫ్ కంటిగ్యుటీ వారికి వర్తించదు. కాబట్టి భారతదేశం లోపల ఉండే హైదరాబాద్ స్వతంత్రంగా ఉండే ఆప్షన్ లేనే లేదన్నది స్పష్టం. మౌంట్ బాటన్ స్వయంగా ఈ విషయాన్ని నిజాంకి, ఆయన ప్రతినిధులైన వాల్టర్ మాంక్టన్, నవాబ్ ఆఫ్ ఛత్తారీలకు పలు సార్లు స్పష్టం చేశాడన్నది చారిత్రిక వాస్తవం. నిజాం చేసుకున్న యథాతథస్థితి ఒప్పందం (స్టాండ్ స్టిల్ ఒప్పందం) కూడా స్వతంత్రంగా ఉండేందుకు కాదు. విలీనాన్ని ఒక సంవత్సరం పాటు జాప్యం చేసేందుకు మాత్రమేనన్న విషయం వాస్తవం. ఆనాటి పత్రాలను చదివితే ఈ విషయం స్పష్టంగా అర్థమౌతుంది. కశ్మీర్ మహారాజు హరిసింగ్ కూడా ఇలాంటి యథాతథ ఒప్పందం పాకిస్తాన్ తో చేసుకున్నాడు తప్ప భారత్ తో కాదని గుర్తుంచుకోవాలి.
పాకిస్తాన్ అన్న ఆలోచనను బ్రిటిషర్ల సహకారంతో 1930 వ దశకంలో సృష్టించిన చౌధురీ రహమత్ అలీ భారత్ లో మూడు ముస్లిందేశాలు ఉండాలని ప్రతిపాదించాడన్నది ఈ సందర్భంగా మరిచిపోరాదు. మొదటిది పాకిస్తాన్. రెండవది నేటి బంగ్లాదేశ్. దానిని బంగిస్తాన్ అన్నాడు. మూడవది ఉస్మానిస్తాన్. అంటే మన హైదరాబాద్ సంస్థానం. ఉస్మానిస్తాన్ ఆలోచన వెనుక దాగున్న ఈ మతోన్మాద సూత్రాన్ని మరిచిపోరాదు. పాశ్చాత్య కూటమిలో చేరకూడదన్న భారత నేతల నిబద్ధతాపూర్వకమైన నిర్ణయం వల్లే బ్రిటిషర్లు భారత్ ను దిగ్బంధనం చేసేందుకు పశ్చమాన పాకిస్తాన్, తూర్పున తూర్పు పాకిస్తాన్ (తరువాత బంగ్లాదేశ్), ఉత్తరాన ముస్లిం జనాధిక్య జమ్మూ కశ్మీర్ సంస్థానం (జమ్మూ, కశ్మీర్, లడాఖ్, గిల్గిల్ బల్తిస్తాన్, మీర్పూర్, ముజఫరాబాద్ లతో కూడిన ప్రదేశం), దక్షిణాన ఉస్మానిస్తాన్ లు ఏర్పాటయ్యేలా ప్రయత్నించారు. హైదరాబాద్ సంస్థానం స్వతంత్రంగా ఉండాలన్న నిజాం కుట్రలకు ఫ్రాన్స్, అమెరికా, కొలంబియా, కెనడా, సిరియా, బెల్జియం, అర్జెంటీనా వంటి పాశ్చాత్య కూటమి దేశాలు అందుకే సమర్థించాయి. రష్యా, చైనా, యుక్రేన్ వంటి కమ్యూనిస్టు దేశాలు భారత అలీన విధానాన్ని సమర్థించి, ఈ సామ్రాజ్యవాద యత్నానికి పురిట్లో సంధికొట్టాయి.
సర్వసాధారణ కమ్యూనిస్టులందరూ తెలంగాణ పోరాంటం విషయంలో జన్నారెడ్డి ప్రతాపరెడ్డి, విసునూరు రామచంద్రారెడ్డిల వంటి జాగీర్దార్ల అత్యాచారాలను ప్రస్తావిస్తూంటారు. వీరిని చూపించి, హైదరాబాద్ సంస్థానంలోని పోరాటం మొత్తం వీరిపైనేనన్న వాదనను ముందుకు తెస్తారు. కానీ జటప్రోలు, రెంటచింతల, గద్వాల, కొల్లాపూర్, వనపర్తి, పాల్వంచ, సంస్థాన్ నారాయణపూర్ వంటి ఉప సంస్థానాల్లో విస్నూరు, మానుకోటల్లో లాగా ఎందుకు తిరుగుబాటు రాలేదన్న విషయంలో మాత్రం మౌనం పాటిస్తారు. అక్కడ కమ్యూనిస్టు ఉద్యమమూ వేళ్లూనుకోలేదు. ఆదిలాబాద్, నిజామాబాద్, జహీరాబాద్, మహబూబ్ నగర్ వంటి తెలంగాణ జిల్లాల్లో, ఆనాడు హైదరాబాద్ సంస్థానంలో అంతర్భాగంగా ఉన్న మరాఠ్వాడా ప్రాంతాలైన బీడ్, పర్భనీ, నాందేడ్, లాటూర్, ఉస్మానాబాద్ లలో, కళ్యాణ కర్నాటక లోని బీదర్, రాయచూర్, గుల్బర్గాలలో సంస్థానాధీశులు లేరా? వారు జన్నారెడ్డి ప్రతాపరెడ్డి, విసునూరు రామచంద్రారెడ్డిల్లా ప్రజాకంటకులు కారా? కొంత నల్గొండ, కొంత వరంగల్, కాసింత రంగారెడ్డి జిల్లాకి మాత్రమే ప్రధానంగా పరిమితమైన కమ్యూనిస్టుల పోరాటం ఈ మరాఠ్వాడా, హైదరాబాద్ కర్నాటక (నేటి కళ్యాణ కర్నాటక) ప్రాంతాల్లో ఎందుకు విస్తరించలేదు? ఈ ప్రశ్నలకు వారి వద్ద సమాధానం ఉండదు.
ఈ తరహా వామపక్ష కుహనా మేధావులు కన్వీనియంట్ గా ప్రస్తావించని మరో విషయం ఉంది. అదేమిటంటే ఘనత వహించిన నిజాం ప్రభువు 1943 లో కమ్యూనిస్టులపై నిషేధాన్ని ఎందుకు ఎత్తివేశారు? దాశరథి రంగాచార్య తన” జీవన యానం” పుస్తకంలో, వందేమాతరం రామచంద్రరావు తన “హైదరాబాద్ పై పోలీసు చర్య” పుస్తకంలో సెప్టెంబర్ 17 తరువాత రజాకార్ల ఆయుధాలన్నీ కమ్యూనిస్టుల చేతికి చేరాయని వ్రాశారు. కమ్యూనిస్టులు దీనిని ఎందుకు ఖండించరు? సెప్టెంబర్ 17, 1948 తరువాత 1951 వరకూ కమ్యూనిస్టులు ఎవరిపై సాయుధ పోరాటం చేశారు? లేని నిజాంపైనా? ఉన్న భారత ప్రభుత్వం పైనా? భారత సేనలు అన్న పదానికి బదులు “యూనియన్ సేనలు” అనే కన్వీనియంట్ పదాన్ని ఉపయోగించి భారత వ్యతిరేక పోరాటానికి ఎందుకు రంగులద్దుతున్నారు? ఈ ప్రశ్నలపైనా సమాధానం ఉండదు. అంతే కాదు. భారత ప్రభుత్వంపై, భారత సైనలపై పోరాడిన వారికి స్వాతంత్ర్య సమరయోధులుగా గుర్తింపు రాలేదని వాపోతూ ఉంటారు.
నిజమేమిటంటే కాకలు తీరిన కమ్యూనిస్టు యోధులు రావి నారాయణ రెడ్డిగారు ఈ సాయుధ పోరాటాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. నిజానికి ప్రజలు భారత ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నా దానిపై పోరాటం చేయడం సరైనది కాదని ఆయన స్పష్టంగా చెప్పారు. ఆయన యుద్ధ విరమణ చేద్దామని ప్రతిపాదించినా సుందరయ్య-బసవపున్నయ్య-చండ్ర రాజేశ్వర త్రయం దానిని తోసిపుచ్చింది. ఈ మొత్తం ఉదంతాన్ని చాపకిందకి తోసి, సగం చరిత్ర చెప్పడానికి కారణమేమిటి?
హైదరాబాద్ సంస్థానం స్వతంత్రంగా ఉండాలన్నది కమ్యూనిస్టుల లక్ష్యం. కేరళలో పొన్నప్రా వయలార్ విషయంలోనూ కమ్యూనిస్టులు స్వాతంత్ర్యం వచ్చేదాకా బ్రిటిషర్లపై, సంస్థానాధీశులపై పోరాడి, సంస్థానాధీశులు భారత్ లో విలీనం కావాలని నిర్ణయించాక, భారత్ పై పోరాడారు. ఇదే పోకడను హైదరాబాద్ సంస్థానంలోనూ అవలంబించారు. 1948-1951 వరకూ భారత్ పై కమ్యూనిస్టులు పోరాడి, భారత ప్రభుత్వం పంపిన రాయబారి ద్వారకానాథ్ కాచ్రూను కలవడానికి నిరాకరించి, ఆ తరువాత మాత్రం 1952 లో ఎలాంటి గ్యారంటీలూ పొందకుండానే, ఏమీ సాధించకుండానే మూడేళ్ల రక్తసిక్త పోరాటం ఆపి, ఎన్నికల్లో పాల్గొని తగుదునమ్మా అంటూ ఎంపీలు అయ్యారు.
కుహనా మేధావులు ప్రతిపాదించే మరో అవాస్తవం సుందర్ లాల్ కమీటీ గురించి. సుందర్ లాల్ కమిటీని నిజాం వేశాడని చెప్పారు. అది అవాస్తవం. అసలు సుందర్ లాల్ కమిటీ విచారణ సంఘమూ కాదు. దానిని భారత ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, నిజాం ప్రభువు కానీ నియమించలేదు. ఆ రకంగా నియామక పత్రాలుంటే దయచేసి బయటపెట్టాలి. అది నెహ్రూగారు వ్యక్తిగతంగా పంపిన సుహృద్భావ ప్రతినిధి బృందం. పండిత్ సుందర్ లాల్, కాజీ మహ్మద్ అబ్దుల్ గఫార్ లతో కూడిన ఈ బృందం ముస్లింలను కలిసి, భారత ప్రభుత్వం వారిని ఇబ్బంది పెట్టబోదని నమ్మకం కలిగించింది. వీరు తమది విచారణ సంఘం కాదని పదేపదే తెలియచేశారు. తాము ఈ విషయాన్ని ముస్లిం జనానీకానికి తెలియచేశామని కూడా వారు నెహ్రూ, పటేల్ లకు లిఖితపూర్వకంగా తెలియచేశారు. నెహ్రూ దీని గురించి ఏనాడూ ప్రస్తావించలేదు. కాబట్టి లేనిది ఉన్నట్టుగా చేసే ప్రయత్నం తప్ప ఇది మరేమీ కాదు.
వాస్తవానికి హైదరాబాద్ సంస్థాన చరిత్రను కూడా మూడు వేర్వేరు ముక్కలుగా చదువుతున్నాం. కర్నాటక లోని మూడు జిల్లాలు, మరాఠ్వాడాలోని జిల్లాల చరిత్రను తెలంగాణ చరిత్రతో కలిపి చదివితేనే సమగ్రత వస్తుంది. లేని పక్షంలో హైదరాబాద్ సంస్థాన చరిత్రను అయిదుగు గుడ్డివాళ్లు ఏనుగుని వర్ణించినట్టు ముక్కముక్కలుగా చదవడం జరుగుతుంది. అలా చేసినంత కాలమూ రెండు మూడు జిల్లాల చరిత్రనే మొత్తం 82 వేల చ.కి.మీ వైశాల్యమున్న, కోటికి పైగా జనాభా ఉన్న, 17 జిల్లాలున్న సువిస్తృత సంస్థాన చరిత్రగా భ్రమించడం జరుగుతుంది. కాబట్టి ఈ పొరబాటును తక్షణం సరిదిద్దుకోవలసిన అవసరం ఉంది.