ముఖ్యంగా పి.సి.సిలో విచారణ విభాగం పట్టుదలతో పనిచేయటం ప్రారంభించింది. ప్రతిరోజు జరిగే సంఘటనలను, అత్యాచారాలను ప్రజల దృష్టికి తీసుకువచ్చేది. ఎక్కడ గృహ దహనాలు, లూటీలు, హత్యలు జరిగినా ఆ ప్రదేశాలకు వెళ్ళి స్వయంగా భయంకర పరిస్థితులను ఎదుర్కొంటూ ఆ విభాగం న్యాయవాదుల సమాచారం సేకరించి ఫోటోలు తీసుకువచ్చేవారు. ఈ విచారణ కార్యక్రమంలో సమాచార సేకరణలో లింగాయత్ కాన్ఫరెన్సు, స్థాయీసంఘం, హిందూ దినపత్రిక విలేఖరి శ్రీ వామన్‌రావుల కృషి పేర్కొనదగినవి. జరిగిన అత్యాచారాలకు వ్యతిరేకంగా విజ్ఞప్తి పత్రాలను వరుసగా సంస్థాన పాలకులకు పి.సి.సి పంపుతూ ఉండేది. తీవ్రమైన సంఘటనలు జరిగితే వాటిని గురించి అటు ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూకు, ఇటు ఏజంటు జనరల్ కె.యమ్.మున్షీకి, ఆనాటి కాంగ్రెస్ అధ్యక్షుడు బాబూ రాజేంద్ర ప్రసాద్‌కు విజ్ఞాపన పత్రాలు పంపించేవారు. పి.పి.సి సేకరించిన సమాచారం, జరిపిన విచారణ అత్యంత అమూల్యమైంది. దాదాపు ఐదువందల సంఘటనలకు సంబంధించిన కాగితాలు, ఫోటోలు, దుర్లభమైన సామాగ్రి. ఈ సామాగ్రిని భారత ప్రభుత్వం తన శ్వేతపత్రానికి చాలా వరకు ఉపయోగించుకుంది.
మరో ముఖ్యమైన పని మజ్లీస్ ఇత్తేహాదుల్ ముసల్మీన్ చేస్తున్న తీర్మానాలను, ఉపన్యాసాలను ఆ పత్రిక సంపాదకీయాలను ఉర్దూ నుంచి ఇంగ్లీషులోకి అనువదించి భారత ప్రభుత్వానికి పంపించేవారు. ఈ అంశంపై నాలుగు పెద్ద సంపుటాలను తయారు చేసి పంపించారు.
పి.పి.సి తన సమాచార శాఖ ద్వారా అన్ని భాషల పత్రికలకు వార్తలు పంపిస్తూ ఉండేది. జరుగుతున్న యథార్థాలను ప్రజల దృష్టికి తెచ్చేది. అయితే కొద్ది కాలంలోనే నిజాం పాలకవర్గం పత్రికలపై నిషేధాలు విధించటం ప్రారంభించింది. స్థానిక పత్రికలైన “రహనుమా”ను మూసివేయించారు. “ఇమరోజ్” సంపాదకుడైన షోయీబ్ ఉల్లాఖాన్ హత్య కావింపబడ్డాడు.
సంస్థానంలో అక్రమంగా అమల్లోకి వచ్చిన విధానాలను వ్యతిరేకిస్తూ పి.పి.సి తరచుగా బహిరంగంగా ప్రకటనలు చేసేది. ఆ ఉద్రిక్త పరిస్థితులలో కూడా పాలక వర్గానికి విరుద్ధంగా ప్రకటనలు చేయటం సాధారణ విషయం కాదు. న్యాయవాదుల నిరసన ఊరేగింపు, విచారణ ఇవన్నీ పాలక యంత్రాంగంలో కలవరాన్ని కలిగించాయి. న్యాయవాదుల గుర్తింపు రద్దుచేయాలనీ, నిర్బంధించాలనీ అనేక విధాల నిజాంకు సలహాలు ఇవ్వడం మొదలైంది. తిరుగుబాటు నేరారోపణపై చర్య తీసుకోవాలని కూడా కొన్ని వర్గాలు కోరడం జరిగింది. అయినా పి.సి.సి కార్యకర్తలు నిర్భయంగా తమ కార్యక్రమాన్ని కొనసాగించారు. ప్రభుత్వం ఏదో నెపంమీద పి.పి.సి సభ్యులను అరెస్టు చేయడం ప్రారంభించింది. పర్యటన ఉపసంఘం సభ్యుడు శ్రీ రామచంద్ర భాదేకర్, వాసుదేవరావు, గౌసుధ్‌కర్‌లను బాంబు కేసులో ఇరికించి అరెస్టు చేశారు. సమితి ప్రధాన కార్యదర్శి శ్రీ ధరణీధర్ సంఘీని డిఫెన్స్ చట్టం క్రింద నిర్భంధించారు. ఆ తర్వాత అనుమానంపై మాత్రమే తాతాచార్, కె.రామ్‌గోపాల్, ఎ. రాఘవన్‌లను అరెస్టు చేశారు. 1948 ఆగస్టు 15 నాడు భారత స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొనే నిమిత్తం పి.పి.సి సభ్యులు కె.యం.మున్షీ ఆహ్వానంపై లోకల్ ట్రెయిన్‌లో బొల్లారం వెళుతున్నారు. దారిలో రజాకార్ గుండాలు ట్రెయిన్‌పై దాడిచేసి సభ్యులను గాయపర్చారు. సంఘీ అరెస్టు తర్వాత సదాశివరావు మహా ప్రధాన కార్యదర్శిగా పని ప్రారంభించాడు. ప్రభుత్వం సదాశివరావు, జె.వి. నర్సింగ్‌రావుల అరెస్టుకై వారంట్‌లను జారీ చేసింది. వాళ్ళిద్దరూ పట్టుబడకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఈ ఇద్దరి అరెస్టు వారంట్ గురించి ఒక ముస్లిం పోలీసు అధికారి స్వయంగా వార్త అందచేశాడు. కొద్దికాలంలోనే భారత సేనలు రాబోతున్నాయి. ఆనాటి వరకు జాగ్రత్తగా ఉండడం మంచిదని, ఆ అధికారి సలహా ఇచ్చాడు. మరో విషయం ఇక్కడ ప్రస్తావించడం అసందర్భము కాదు. ప్రధాన న్యాయమూర్తికి పి.పి.సి సభ్యులు అందచేసిన విజ్ఞాపన పత్రాన్ని రాసిన వ్యక్తి జస్టిస్ ఖయర్‌హసన్. జాతీయ దృక్పథం గల ఈ ముస్లిం న్యాయమూర్తి దగ్గరే సదాశివరావు జూనియర్‌గా ఉండేవాడు.
Source: Vijaya Kranthi