Home Hyderabad Mukti Sangram బీదర్‌లో పర్యటించిన ప్రధాని నెహ్రూ (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-43)

బీదర్‌లో పర్యటించిన ప్రధాని నెహ్రూ (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-43)

0
SHARE

బీదర్ జిల్లాలో ముస్లింలపై అత్యాచారాలు జరిగాయనే ఆరోపణల విచారణకు ఒక కార్యాలయం తెరిచారు. సెక్యులర్ భారత ప్రభుత్వం ఈ విషయమై జిల్లా కలెక్టర్ శ్రీ రోబెల్లోను శ్రద్ధ వహించవలసినదని ఆదేశించింది. స్వయంగా ప్రధాని నెహ్రూ బీదర్‌లో పర్యటించి వెళ్ళారు. అందువల్ల డోన్‌గావ్ దళ సభ్యులను ఏ విధంగానైనా అణచివేయాలని కలెక్టర్ పట్టుదలతో ఉన్నాడు.

కొన్నిరోజుల తర్వాత ఆ ప్రాంతంలో ఇన్‌చార్జ్ డి.యస్.పి.గా ప్రభు అనే పోలీసు అధికారి వచ్చాడు. ఆయన ఈ రైతుదళ సభ్యుల సాహస గాథలు విని ముగ్ధుడై పోయాడు. మరుసటి రోజు మిలిట్రీ ట్రిబ్యునల్ సమక్షంలో ప్రభుగారు స్వయంగా సాక్ష్యం చెప్పవలసి ఉంది. ఆ రోజు రాత్రి ప్రభుగారు జైలులోకి వెళ్ళి ఈ రైతుదళ సభ్యులను కలిశారు. అదేరాత్రి తప్పించుకొని పారిపొమ్మని సలహా ఇస్తూ వీలయితే తన జీప్, కారును కూడా ఉపయోగించుకోమని కోరారు. అయితే ఆయన సానుభూతికి కృతజ్ఞతలు చెబుతూ రైతుదళ సభ్యులు ఇలా అన్నారు. “మీకు ప్రమాదాన్ని కొనితెచ్చే పని మేము చేయలేము. మీరు మాకు ఒక చిన్న సహాయం చేయండి. రేపు విచారణ జరిగేటప్పుడు మాత్రం మా కేసు చివర ఉండేట్టు చూడండి, అంతేచాలు.”

తప్పించుకోవడం
బీదర్ కోటలోని ఒక భాగంలో మరుసటి రోజు విచారణ ప్రారంభమైంది. అనేక మంది విచారణ జరిగిన తర్వాత ఆ రైతుదళ సభ్యుల వంతు వచ్చింది. తోరణ్ తదితర ప్రాంతాలలో ఈ సభ్యులు 100కు పైగా ముస్లింలను హత్య చేశారని నేరం ఆరోపించబడింది. అయితే విచారణలో ఎవరూ సాక్ష్యం ఇవ్వలేదు. ఫలితంగా ఆరోపణ నిరాధారమైనదని, మిలిట్రీ ట్రిబ్యునల్ అధికారి బెట్ మంగల్ అందరినీ నిర్దోషులని వదిలివేశాడు.

రైతుదళ సభ్యులు ఉత్సాహంతో నినాదాలు ఇస్తూ మెట్లు దిగకుండా పై నుండి క్రిందకి దూకారు. వెంటనే బయటనున్న సాయుధ పోలీసులు చుట్టు ముట్టారు. దళ సభ్యులను తిరిగి అరెస్టు చేయమని ఆదేశించి కలెక్టర్ పోలీసులను పంపించాడు. అయితే దళ సభ్యులు పోలీసుల నుంచి తుపాకులు లాక్కొని పారి పోవాలని అనుకొన్నారు. నాయకుడు చన్‌వీర్ మాత్రం దూరదృష్టితో ప్రవర్తించాడు. సహచరులతో ఓపిక పట్టమని చెప్పి జమేదార్‌తో ఇలా అన్నాడు. “జమేదార్, మమ్మల్ని ఈనాడు అరెస్టు చేయవచ్చు. మేము నిరాయుధులమని, ఆ పని మీరు చేయగలరు. అయితే రేపటి సంగతి ఆలోచించండి. మా దళం చాలా పెద్దది. బయట ఉన్నవాళ్ళు ప్రతీకారం తీసుకోకుండా ఉండరు. మీ సంసారం, భార్య, పిల్లల సంగతి ఆలోచించుకోండి”.

ఆనాటి బీదర్ పోలీసుల మనోధైర్యం చెదిరిపోయింది. రైతుదళ సభ్యులు ఎంత జాగ్రత్తగా ప్రతీకారం తీర్చుకోగలరో వాళ్ళకు బాగా తెలుసు. 300ల సభ్యులు మాత్రమే అయినా ఈ దళం సభ్యులు నిజాం అధికారులను ఎలా వణికింప చేశారో అందరికీ అనుభవమే. అందువల్ల జమేదార్ అన్నాడు. “నిజమే, మిత్రమా! నువ్వు చెప్పిన మాట కూడా ఆలోచించదగినదే.”

వానాకాలం నాటి ఆ సాయంత్రం, చీకటి పడుతున్న వేళ చన్‌వీర్ తదితరులు ఆ కోట క్రింద భాగంలోంచి తప్పించుకొని పారిపోయారు. పోలీసులు చూస్తూ ఊరుకుండి పోయారు. వెనకాలే మరో పోలీసు దళం వెంటాడవచ్చుననే అనుమానంచేత ఆ రైతుదళం యువకులు డొంకదారి వెంట వెళ్ళిపోయారు. అడవుల వెంటబడి మంజీరానదివైపు దారితీశారు. ఈ యువకుల దగ్గర ఆయుధాలు అసలే లేవు. చివరికి లాఠీలు కూడా లేవు. వెనకాల పోలీసు దళం వచ్చి పట్టుకొనే అవకాశం ఉంది. ఆకలి దప్పికలతో నడచి, అలసి ఎనిమిది మైళ్ళు దాటిన తరువాత చివరికి ఆ రాత్రి మంజీరా నదీతీరానికి చేరుకున్నారు. నది పొంగి పొర్లుతూ ఉంది. ఎదురుగా ఒక డింగీ మాత్రమే ఉంది. నది దాటక తప్పదు. దళ సభ్యులు కేకవేసి తాము దళం వాళ్ళమని వెంటనే నది దాటాలని అరిచారు. పడవవాడు దళం వాళ్ళనగానే ప్రేమ పూర్వకంగా వచ్చాడు. ఆ చీకట్లో ప్రమాదం ఉన్నా భయపడక ఆ దళం వాళ్ళకు సహాయపడ్డాడు. చివరికి నది దాటి సురక్షితంగా మరో తీరం చేరుకున్నారు దళ సభ్యులు.

తీరం చేరుకున్నారో లేదో వెనకాల నుంచి పోలీసుల జీపు చప్పుడు చేసుకుంటూ వచ్చింది. వెనకాల నుంచి తీరంపై జీపు ఆపి పడవవాడిని కేక వేశారు పోలీసులు. దళ సభ్యులు వెంటనే ఆ చిన్న పడవను చేతికందిన రాళ్ళతో కొట్టి విరగ్గొట్టి పనికి రాకుండా చేశారు. పడవవాని అంగీకారంపైననే వానిని పడవకు కట్టిపడేసి, ముందుకు పరుగులంకించుకున్నారు. పడవతను ‘కాపాడండి బాబో’ అని కేకలు వేస్తూ నటించాడు.

Source: Vijaya Kranthi