చుట్టు ప్రక్కల ముఖ్యమైన గ్రామాల నుంచి ఇక్కడికి చేరుకోవాలంటే మంజీరనదిని దాటిరావలసిందే! పైగా ఆ గ్రామంలో రజాకార్ల కార్యక్రమాలు లేవు. స్థానిక ప్రజల సహకారం సులభంగా ఉంది. ఈ కారణాల వల్ల అట్టర్గేలోనే సభ జరిగింది. చుట్టు ప్రక్కల నున్న గ్రామాలనుంచి వందలాది సంఖ్యలో రైతు యువకులు సభలో పాల్గొన్నారు.
రజాకార్ల అత్యాచారాలను ఎదుర్కోవడానికి రైతుదళ నిర్మాణం జరిగింది. ఎక్కడ దాడి జరిగినా లోపల నుంచి గ్రామీణులు ఆత్మరక్షణ కోసం పోరాడాలని, బయటినుంచి రైతుదళం వచ్చి దెబ్బతీస్తుందని నిర్ణయించారు. డా॥ చిన్నప్ప అధ్యక్షుడుగా, యశ్వంతరావు కార్యదర్శిగా, వెంకట్రావు దళ కమాండర్‌గా మరికొంత మందిని కార్యవర్గ సభ్యులుగా నియమించడం జరిగింది.
ఒకరోజు అకస్మాత్తుగా వార్త అందింది. ఆనంద్‌వాడ బోలేగావ్ గ్రామంపై రజాకార్లు పస్త్ అక్వామ్‌లు కలిసి దాడి చేయబోతున్నారని తెలిసింది. అప్పుడు యశ్వంతరావు పదిమంది సహచరులతో సాయుధంగా బయలుదేరాడు. గ్రామం చేరుకోగానే రజాకార్లు లూటీ ప్రారంభించారని తెలిసింది. ఈ దళం వెళ్ళి ఎదురుదాడి జరిపింది. ఇలాంటి పరిణామాన్ని ఊహించని రజాకార్లు వెనక్కి తగ్గారు.
అమాయకంగా లొంగిపోయే ప్రజల్లా కనపడలేదు. ముఖ్యంగా ఆ రజాకార్లతోబాటు శంభాజీ ఢాకు కూడా ఉన్నాడు. యశ్వంతరావు స్వయంగా వెళ్ళి శంభాజీ అనే గజదొంగపై దాడి జరిపి చంపివేశాడు. అది చూడగానే మిగతా రజాకార్లు భయపడి పారిపోయారు. అప్పుడే గ్రామ ప్రజలు తిరిగి ఇళ్ళకు చేరుకోగలిగారు. రైతుదళం చేసిన సాహసానికి ప్రజలలో ఆత్మవిశ్వాసం మేల్కొన్నది. హిందువులంటే మేకలవంటి వారు కాదని, ప్రతీకారం తీర్చుకోవడం చేతనవుననే వాస్తవం రజాకార్లకు తెలిసివచ్చింది.
ఆ రోజుల్లో అట్టర్గేదళం సంఖ్య పది. ఇద్దరి దగ్గరే తుపాకులన్నాయి. మిగతా వాళ్ళ దగ్గర కత్తులు, బల్లాలు ఉన్నాయి. నిజాం పోలీసులు బోలేగావ్‌పై ఈ దళం దాడి చేసిందని తెలుసుకొని వచ్చారు. చచ్చి కాలిపోయిన వ్యక్తి హిందువు. కావున గొడవే లేదనుకొని పోలీసులు బూడిదపై పంచనామా జరిపి వెళ్ళిపోయారు. నిజాం రాజ్యంలో హిందువుల దుస్థితి అలాంటిది.
ఇక్కడ రైతుదళం యశ్వంత్, వెంకట్‌ల నాయకత్వాన సాహసవంతంగా పనిచేస్తూ ఉందని తొండచీర్ కేంద్రానికి తెలిసింది. తుకారం పటేల్ వెంటనే ఆ ఇద్దరిని రామ్‌ఘాట్‌లో జరగబోయే మహాసభకు ఆహ్వానించాడు. తమ ముఖ్యమైన అనుచరులతో వచ్చి రామ్‌ఘాట్‌లోని రైతుదళంతో కలవవలసిందని రజాకార్ల దుండగాలను తాము కూడా ఎదుర్కొంటున్నామని తమ అంతిమలక్ష్యం హైద్రాబాద్ విముక్తి అని తెలియచేశాడు.
7మే, 1948 నాడు రామ్‌ఘాట్‌లో రైతుదళాల మహాసభ. గుర్రాలపై సాయుధులైన రైతు యువకులు వచ్చి చేరుకుంటున్నారు. వెంట ఆయుధాలతోపాటు తినడానికి రొట్టెల మూటలు కూడా ఉన్నాయి. ఆ ఉత్సాహాన్ని, ధైర్యాన్ని చూస్తుంటే శివాజీ కాలంనాటి గెరిల్లా సైనికులు జ్ఞాపకం వస్తారు. మహోత్సాహంతో నిండిన ఆ వాతావరణంలో పరిచయమున్న వాళ్ళు ఒకరినొకరు కౌగిలించుకుంటున్నారు.
ఈ మహాసభకు వచ్చిన ప్రముఖులు తుకారం పటేల్, నర్సింగరావు వస్తాద్, గ్యాన్‌బా పాటిల్, దత్తూగీర్, యశ్వంతరావ్, వెంకట్రావ్, డా॥ చన్నప్ప, నివృత్తిరావు, అప్పారావు పటేల్ తదితరులు. సరిగ్గా మధ్యాహ్నం రెండుగంటలకు సభ మొదలైంది. చర్చలు జరిగాయి. నిర్ణయాలు తీసుకోబడ్డాయి. కొందరిని గూఢచారులుగా నియమించారు. స్పష్టమైన కార్యనిర్వహణ పద్ధతిని రూపొందించారు.
కార్యక్రమం: ఎక్కడ రజాకార్ల దాడి జరిగినా వెంటనే వెళ్ళి ప్రతిఘటించడం, రజాకార్ల జాడ కనిపెట్టి వాళ్ళ కార్యక్రమాన్ని గూఢచారుల ద్వారా తెలుసుకోవడం తొండచీర్, అట్టర్గే దళాలన్నీ కలిసి ఏకైక రైతుదళంగా పనిచేయడం మొదలైనవి.
ఆ సభలోనే ఈ సంఘటిత శక్తికి ప్రతీకగా ఉన్న రైతాంగ దళానికి అప్పారావు పటేల్‌ను అధ్యక్షుడుగా ఎన్నుకొన్నారు. దత్తూగీర్ దళాల కమాండర్‌గా నియమించబడ్డాడు. సాయంత్రం 6 గంటలు కాగానే అందరూ విడిపోయారు. గుర్రాలపై యువకులు వార్తలు సేకరించే నిమిత్తం వెళ్ళిపోయారు. నిశ్శబ్దం నెలకొన్న రామ్‌ఘాట్ ఆశ్రమం విశ్రాంతికి ఆ యువకులందరినీ ఆహ్వానించడానికి సిద్ధంగా ఉంది.
మరుసటి రోజు 8 మే నాడు దళానికి చెందిన గూఢచారులు సమాచారం అందచేశారు. పొరుగున ఉన్న రావణగావ్‌పై రజాకార్ల దాడి చేయనున్నారని, అక్కడ వివాహిత బ్రాహ్మణ స్త్రీని అపహరించుకుపోదల్చారని గ్రామ ప్రజలు అడవుల్లోకి పారిపోతున్నారని కబురు చేరింది. తొండచీర్‌గడ్‌లోని గంట మ్రోగింది. కోల్‌ఖేడ్ వార్త అందించారు. అరగంటలో వందమంది సాయుధ దళ సభ్యులు సిద్ధమైనారు. “శివాజీకీ జై, హర హర మహదేవ్, భారత మాతాకీ జై” అని నినాదాలు చేస్తూ బయలుదేరారు. దారిలో రైతులు ఇదంతా చూసి, స్వయంగా బల్లాలు, గొడ్డళ్ళు తీసుకొని వెంట వెళ్ళారు. నాలుగు మైళ్ళు ప్రయాణం చేసి, గంటసేపట్లో రావణగావ్ చేరుకున్నారు. రైతుదళం వస్తూ ఉందరే వార్త విని రజాకార్లు అంతకుముందే తోకముడిచి వెళ్ళిపోయారు.
Source: Vijaya Kranthi