అయినా పట్టుదల వదలకుండా గాయానికి కట్టుకట్టి కాల్పులు కొనసాగిస్తూ ఉన్నాడు. గంటసేపు తర్వాత యశ్వంతరావు కాలులోంచి రక్తస్రావం జరగడం మూలాన స్పృహ తప్పి పడిపోయాడు. ఈ లోగా కబురు అంది ఆ సమయానికి వెంకటరావు మిరకల్ మరికొంత మంది సహచరులతో ఆ ప్రదేశం చేరుకున్నాడు. ఇదే సందర్భంలో బోలేగావ్ యువకులు ఎనభైమంది సహాయంగా వచ్చి నిలుచున్నారు.
రజాకార్లు గాబరాపడి వెనక్కి తగ్గడం ప్రారంభించారు. దళం వాళ్ళవెనకాల బయలుదేరింది. రజాకార్లు పరిగెత్తుతూ వెళ్ళి మేకర్ గ్రామంలోని గఢ్‌లో తల దాచుకున్నారు. దళం గ్రామంలోకి ప్రవేశించగానే ఒక వయసు మళ్ళిన హిందూ స్త్రీ ఎదురుగా వెళ్ళి ఆనందంతో స్వాగతం చెప్పింది. ఈ రోజు తన జాతికి అన్యాయం చేస్తున్న వాళ్ళను తరిమికొట్టగలిగిందని గఢ్‌లో దాక్కున్న రజాకార్లను వదిలివేయకూడదని కోరింది.
అలాగే రజాకార్ల ఇళ్ళను దహనం చేసి పగ సాధించుకోవాలని అంటూ ఆమె కాగడా ముట్టించుకొని వచ్చింది. రజాకార్ల ఇళ్ళకు నిప్పు పెట్టారు. ఈ ఆనందంలో గంతులు వేస్తున్న దళ సభ్యుడికి గఢ్లోంచి వచ్చిన తుపాకీ గుండు తగిలింది. అతను చనిపోయాడు. రజాకార్లు లోపలినుంచి చెదురు మదురుగా కాల్పులు సాగించినా బయటికి మాత్రం రాలేకపోయారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు అలా ఘర్షణ జరుగుతూ ఉంది. చివరికి దళం విజయోత్సాహంతో తిరిగి వెళ్ళిపోయింది.
యశ్వంత్‌రావు అజ్ఞాతవాసం
మేకర్ దహనకాండ జరిగిన తర్వాత పోలీసులు విచారణకి మేకర్ వెళ్ళారు. ఆ పని చేసిందంతా ఆట్టర్గా నుంచి వచ్చిన దళమని తెలుసుకున్నారు. ఆట్టర్గా వచ్చిగఢ్లోంచి దళాన్ని బయటికి వచ్చి మాట్లాడమన్నారు. దళం వాళ్ళు పోలీసులను విశ్వసించలేదు. ఫలితంగా కాల్పులు జరిగాయి. ఎవరికి ఏమీ నష్టం జరుగలేదు. కాని పోలీసులు గ్రామంలోంచి తొమ్మిది మంది నిర్దోషులైన రైతులను నిర్భంధించి తీసుకుని వెళ్ళిపోయారు. నాలుగు రోజులపాటు ఆ రైతులకు అన్నం పెట్టకుండా హింసించారు. అయినా ఎలాంటి రహస్యాలు చిక్కలేదు. చివరికి ఆ రైతులను ‘నిలంగే’ జైలులో ఖైదు చేశారు.
ఈ లోగా నలువైపులా ఒక వార్త వ్యాపించిపోయింది. బోలేగావ్ పోరాటంలో యశ్వంత్రావ్ మరణించాడని. అతను గాయపడగా దళం వాళ్ళు సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్ళిపోయారు. అయితే మరణించాడనే వార్తను దళం వాళ్ళు కావాలని మరింత ప్రచారం చేశారు. గాయపడిన యశ్వంతరావు మరో గ్రామంలో డాక్టర్ చన్నప్ప దగ్గర చికిత్స పొందాడు. లింగాయత్ శాఖకు చెందినవాడిగా లింగం ధరించి, బంధువుగా అక్కడే యాభైరోజులపాటు ఉండిపోయాడు. ఆ తర్వాత ఆయుధం పట్టడం సాధ్యమైంది.
యశ్వంతరావు మరణించాడనే వదంతి వ్యాపించడం అతని చికిత్సకు బాగా తోడ్పడింది. కాని చుట్టుప్రక్కల గ్రామాల్లో మాత్రం నష్టం జరిగింది. రజాకార్లు పోలీసుల సహాయంతో కసిగా గ్రామాలపై పడ్డారు. మేకర్‌లోనే హిందువుల ఇళ్ళు తగులబెట్టారు. ఇష్టానుసారంగా లూటీలు, మానభంగాలు జరిపారు. సాయ్‌గావ్, నారదా సంగమ్, బోలేగావ్, గుంజరా, ఆట్టర్గా తదితర గ్రామాల్లో అల్లకల్లోలం జరిగింది. ముఖ్యంగా ఆట్టర్గా దళం చెదిరిపోయింది.