మరుసటి రోజు ఉదయం భోజనం చేసేవేళ ఆ రైతు ఇంటికి ఊచిక పస్తక్వామ్ (హరిజన రజాకార్) వచ్చాడు. అతనికి ఎలాగో దళం విషయం తెలిసిపోయింది. అదే సమయానికి ఊళ్ళోకి రెండువందలమంది రజాకార్లు చందా వసూలుచేసే నిమిత్తం వచ్చారు. దళం విడిది చేసిన రైతు ఇంటి వెనకాలే చావడి. అక్కడే రజాకార్లు గుమిగూడారు. కూలిన గోడ పై నుంచి వాళ్ళు కనబడుతూనే ఉన్నారు. అకస్మాత్తుగా రజాకార్లు చెదిరిపోయి రైతు ఇంటిని చుట్టుముట్టేశారు.
బయటికి రాకపోతే కాల్పులు జరుపుతామని బెదిరించారు. ఊహించని పరిస్థితి ఏర్పడింది. దళ సభ్యులు మొత్తం పదకొండు మంది మాత్రమే ఉన్నారు. అయినా ఏ మాత్రం బెదిరిపోకుండా తలుపు సందులో నుంచి 303 రైఫిలు గురిచూసి పేల్చడం ప్రారంభించారు. యశ్వంతరావు పేల్చిన గుండు రజాకార్ల నాయకుడి తలకు తగిలింది. నాయకుడు పడిపోగానే రజాకార్లు పారిపోవడం ప్రారంభించారు. దళం వాళ్ళను తరుముతూ చేతికి చిక్కారు.
పారిపోయిన రజాకార్లు సరాసరిన ముగవీతురూరిలో ఉన్న నిజాం సైనికుల క్యాంపు చేరుకున్నారు. ఆ సైనికులను వెంటబెట్టుకొని తిరిగి హందరాల్పై దాడి చేశారు. కాని ఈ లోగానే రైతుదళం రెండు మైళ్ళు దాటి కొండమీదికి వెళ్ళడం చూశారు. దళం ఆ తర్వాత పరుగుతీస్తూ పదకొండు మైళ్ళు ప్రయాణం చేసింది. ఆట్టర్గా వెళ్ళి మూడురోజులపాటు విశ్రాంతి తీసుకొని తొండచీర్ వెళ్ళారు. మానిక్రావ్ స్థావరంలో కొంతకాలం గడిపి తిరిగి ఆట్టర్గా చేరుకున్నారు. మానిక్రావ్ మూలే, తుకారాం పటేల్, వెంకటరావ్ మిరకల్, డాక్టర్ చన్నప్ప, యశ్వంతరావ్, అప్పారావ్, దత్తగీర్ తదితరులు ఈ దళంలో ముఖ్యులు.
కొంతకాలం గడిచింది. నిజాం పోలీసులకు ఆట్టర్గాలో తిరిగి రైతు దళం స్థిరపడిందని తెలిసింది. చుట్టుప్రక్కల గ్రామాల్లో ఉన్న పోలీసులను రప్పించి దాడికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ వివరాలన్నీ దళానికి తెలిసిపోయాయి. ఆట్టర్గా నుండి ఆరుమైళ్ళ దూరంలోనున్న బోట్కుల్గఢ్కు చేరుకుంది. ఈ లోగా రజాకార్లు, పోలీసులు సమీకరించబడ్డారు. మరోవైపు బోట్కూల్లో ఉన్న రంగారావు పటేల్ ఆర్యసమాజ్ కార్యకర్త. అతను తనగఢ్లో 150 మంది దళ సభ్యులకు సాదరంగా ఆశ్రయమిచ్చాడు. తామంతా కలిసి పోరాడవలసిందేనని హామీ ఇచ్చాడు.
బోట్కూల్లో ఘర్షణ
మరుసటి రోజు పోలీసులు, రజాకార్లతో పాటు గఢ్పై దాడి చేయాలని బోట్కూల్ పొలిమేర్లలోకి వచ్చారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ తెలివిగా వల పన్నాలని మొదట ప్రయత్నించాడు. తానే ముందుకు వచ్చి దళం వాళ్ళను సంప్రదింపులకు రమ్మనమని అన్నాడు. దళం తిరస్కరించింది. తర్వాత షామ్ గీర్కు చెందిన హిందూ పటేల్ ద్వారా గఢ్లోకి వర్తమానం పంపించాడు. దళం ఆ పటేల్తోనే జవాబు పంపింది. దమ్ములుంటే కాల్పులు జరపమని సవాలు చేసింది. అయితే ఆ పటేల్ గూఢచారిలా పంపించ బడ్డాడు. దళం దగ్గర భర్మాన్ తుపాకులు తప్ప మరేమీ లేవని అందరూ కుర్రవాళ్ళు మాత్రమే అని సులభంగా దాడిచేసి పట్టుకోవచ్చని పటేల్ చెప్పాడు.
బోట్కూల్ గఢ్పై దాడిచేసే నిమిత్తం ఆరువందల మంది పోలీసులు, రజాకార్లు అన్ని ఏర్పాట్లతో వచ్చారు. మధ్యాహ్నం రెండు గంటలకు కాల్పులు ప్రారంభమైనాయి. దళ సభ్యులు గఢ్లోంచి క్రిందికి దిగి ఎదురు కాల్పులు జరుపుతూ ముందుకు వెళ్ళారు. అటు పోలీసులు కూడా స్థిరంగా నిలబడి కాల్పులు జరుపుతున్నారు. తొమ్మిది గంటల వరకు తీవ్రంగా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. దళ సభ్యుల ముఖాలు మందుగుండు పొగతో నల్లబడ్డాయి. చెక్కు చెదరని ధైర్యంతో సభ్యులు ఎదుర్కొంటున్నారు. హఠాత్తుగా గఢ్పై నుంచి ఫిరంగి పేలింది.