డివై.యస్.పి. చెప్పిన వివరాలు ఇవి. ‘మీ దళ చర్యలు నిజాం పోలీసులకు సవాలుగా పరిణమించాయి. మిమ్మల్ని బహుమతికోసం కాకుండా వ్యక్తిగతంగా చూడాలని, పట్టుకెళ్ళి పోవాలనే పట్టుదలతో వచ్చాను. మేకర్లో పోలీసు పై అధికారులు డ్బుభైమంది సాయుధ పోలీసులతో సిద్ధంగా ఉన్నారు. చుట్టు ప్రక్కల తోగీర్లో పదిహేను, బాల్కీలో ఐదు పోలీసు లారీలు ఉన్నాయి.
బోట్కూల్ సంఘటన తర్వాత మీ దళాన్ని ఏ విధంగానైనా నిర్భంధించి శిక్షించాలని అధికారులు నిర్ణయించుకున్నారు. యశ్వంతరావ్! నిన్ను చూస్తే నా కొడుకు జ్ఞాపకం వస్తున్నాడు. మీరంతా తప్పించుకొని ఇండియన్ యూనియన్‌లోకి పారిపోండి. నిజాం సాయుధ బలగాలను ఎదుర్కోవడం సాధ్యం కాదు. మూడు నెలల మాత్రం ఓపికతో ఉండండి. రజాకార్ల లూటీలు, అత్యాచారాలు మీకు తెలుసు, ఉద్యోగరీత్యా మేమే ఏమీ చేయలేక పోతున్నాం. మీ గురించి నేను ప్రభుత్వానికి ఏదో ఒకటి చెబుతాను.’
అధికారి కోరికపై అతనికి పాలు త్రాగించారు. త్రాగడానికి సిగరెట్టు ఇచ్చారు. అతన్ని ప్రాణాలతో వదిలివేయాలంటే ముందు రైతులనుద్దేశించి కాగితంపై రాయమన్నారు. ఆ తర్వాత వదిలివేసే అంశం ఆలోచిస్తామన్నారు. ఆ తర్వాత అతను ఇలా రాశాడు
‘రైతు సోదరులారా!
మీ అందరినీ చూశాను. మీరంతా మీ ప్రాణాన్ని, గౌరవాన్ని కాపాడుకునే నిమిత్తం అడవుల్లో తలదాచుకున్నారు. గ్రామాలను దోచుకునే వాళ్ళను మీరు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాన్ని కూలదోయాలని మీరు ప్రయత్నించడం లేదు. కుట్ర పన్నడం లేదు. మీకు ఎవరి సహాయం లేదు. బయటనుంచి కాంగ్రెస్ వ్యక్తి ఎవరూ రాలేదు. ప్రభుత్వం మీకు స్వేచ్ఛ ఇచ్చి, ఆస్తులను తిరిగి ఇచ్చివేయడం మంచిది. మీకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలి.’.
అటు గ్రామంలో దళానికి, పోలీసులకు మధ్య కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. యశ్వంత్ వెంటనే ఫతే ఆలీని తీసుకెళ్ళి చెట్టుక్రింద నిలుచోబెట్టాడు. మీకు బహుమతి లభించలేదు. మా కర్తవ్యాన్ని నిర్వహించనివ్వండి.అని యశ్వంత్ ఫలే ఆలీని గురిచూసి కాల్చివేశాడు. ప్రక్కనే ఉన్న గొయ్యిలో అతని శవాన్ని పూడ్చి యశ్వంత్రావ్, వెంకట్రావ్ గ్రామం వైపు పరుగెత్తారు. మరొకవైపు నుంచి ఎద్దుల బండ్లలో పోలీసులు వస్తున్నారు. గ్రామంలోని దళం సబ్ ఇన్స్పెక్టర్, మరి ఆరుగురు పోలీసుల శవాలను కుప్పగా పడవేసింది. ఆ తర్వాత దళసభ్యులు సాయంత్రం భోజనం చేయగలిగారు. ఆ రాత్రి లారీలలో నిజాం సైనికులు వస్తున్నారని కబురు వచ్చింది. దళం అడవుల్లోకి వెళ్ళిపోయింది. అయితే ఆ రాత్రి సైనికముఠా అసలు రాలేదు.
హాథీబేట్ స్థావరం
హైద్రాబాద్ సంస్థానంలో పత్రికలన్నీ పై సంఘటనల వార్తను ప్రముఖంగా ప్రకటించాయి. డివై.యస్.పి. ఫతే ఆలీ ఇతర పోలీసుల మరణం గురించి అందరికీ తెలిసింది. ముస్లిం వర్గాల్లో సంచలనం బయలుదేరింది. కాంగ్రెస్ వర్గాల్లో హర్షోల్లాసం వ్యాపించింది. ముఖ్యంగా బీదర్ ప్రాంతంలో హిందువులు దళాన్ని అన్నివిధాలా కొనియాడారు. అక్కడి రజాకార్ల నడుం విరిగినట్టు అయిపోయింది. దళం యొక్క ఈ సాహసచర్యల గురించి ఇండియన్ యూనియన్‌లో కూడా వార్తలు వ్యాపించాయి.
యశ్వంత్‌రావు నాయకత్వాన దళం హాథీబేట్ అనే కొండ ప్రాంతాన్ని స్థావరంగా ఏర్పరుచుకుంది. ప్రక్కనే ఉన్న గ్రామాల్లోంచి రొట్టెలు సేకరించి దళం ఆకలి తీర్చుకునేది. ఆ తర్వాత ఆ దళం గంగాధర్ పటేల్ ఇంట్లో ఆశ్రయం పొందింది. దళ స్థావరం గురించి దేవర్జనలోని రజాకార్లకు సమాచారం అందింది. అసలు జయంత్‌రావ్ పటేల్ ఆ సమాచారం అందచేశాడు. అతను స్వయంగా రజాకార్‌గా మారిపోయాడు. అంతకు పూర్వమే తన ప్రాణ భయంకొద్దీ అతను చుట్టు ప్రక్కల ఉన్న రజాకార్లను సమీకరించడం మొదలు పెట్టాడు. దళం వాళ్ళకు రొట్టెలు పంపుతున్నారని గ్రామాలలోని ప్రజలను బెదిరించడం ప్రారంభించాడు. గ్రామాలన్నింటినీ తగలబెడతామని ప్రచారం చేశాడు. ఫలితంగా హాథీబేట్ స్థావరానికి ఎవ్వరూ వెళ్ళలేకపోయారు.
జయవంతరావ్ పటేల్ వలాండీ, ఉద్గీర్ ప్రాంతాలకు.‘హరకారే’.ల చేత కబురు పంపించాడు. దళంవాళ్ళు హాథీబేట్ను స్థావరంగా ఏర్పరుచుకున్నారని వాళ్ళవల్ల తమ ప్రాణాలకు, ఆస్తులకు భయముందని, రక్షణకావాలని చెప్పి పంపించాడు. వెంటనే సాయుధ పోలీసులు వచ్చి కొండలను చుట్టుముట్టివేశారు. రైతుదళ సభ్యులకు నాలుగు రోజుల నుండి తినడానికి ఏమీ దొరకలేదు. ఈ నీరసంతోనే పోలీసులను ఎదర్కొన్నారు. మొదట్లో ప్రతిఘటనలేదని పోలీసులు ముందుకు వెళ్ళారు. అప్పుడు దళం కాల్పులు ప్రారంభించింది. పై నుంచి వచ్చిన గుండ్లకు తట్టుకోలేక పోలీసులు దళం కాల్పులు ప్రారంభించింది. పై నుంచి వచ్చిన గుండ్లకు తట్టుకోలేక పోలీసులు వెనక్కి తగ్గారు. సాయంత్రం ఆరుగంటల వరకు కాల్పులు సాగాయి.
చివరికి పోలీసులు వెనక్కి పారిపోక తప్పలేదు. అయితే తిండిలేక పోవడం వల్ల నీరసం బాగా ఎక్కువైపోయింది. చాటుగా వచ్చిన ఇద్దరు రైతులు తమ అసహాయతను వెలిబుచ్చారు. చివరికి రెండు గుర్రాలను ఇచ్చి కోమటి షావుకారు దగ్గరకు పంపించారు. ఆ గుర్రాలకు బదులుగా అర్ధమణుగు బెల్లం, వేరుశెనగ ఇచ్చాడు షావుకారు. ఆకలి ఆ విధంగా ఆ రోజుకు తీరింది. జయవంతరావ్ ఆ రైతులను పట్టి తెప్పించాడు. విపరీతంగా బాది దళానికి ఏ మాత్రం సహాయం చేసినా ప్రాణాలుండవని తిట్టి పంపించాడు. ఆ తర్వాత మళ్ళీ గ్రామంలో తిరిగి దళానికి వ్యతిరేకంగా ప్రచారం చేశాడు.
ఇదంతా విని ఇక లాభంలేదని దళం ఒకరోజు జయవంతరావ్ ఇంటికి వెళ్ళింది. తాము అన్యాయాలను, అక్రమాలను ప్రతిఘటించే నిమిత్తం పోరాడుతున్నామని, ఒక హిందువుగా తన సహచరులకు సహాయపడకుండా అడ్డుతగలడం భావ్యంకాదని నచ్చజెప్పారు. గత్యంతరం లేక పటేల్ తన తప్పు ఒప్పుకున్నాడు. ఇకముందు తాను ఏ విధంగా కలగచేసుకోననీ హామీ ఇచ్చాడు. దళం వెనక్కి తిరిగి స్థావరానికి వెళ్ళిపోయింది. హాథీబేట్లో దళం ఆనాటికి ఏడవరోజు గడిపింది.
మరుసటి రోజు జయవంత్‌రావు తనకు రక్షణ కావాలని దళంవాళ్ళు తన ఇంటిని దోచుకోవడానికి వచ్చారని ఇద్దరు ‘హరకారే’లను పంపించాడు. దళంవాళ్ళు జాగ్రత్త వహించి ఆ ఇద్దరు వార్తాహరులను త్రోవలోనే పట్టుకొని విషయం తెలుసుకొన్నారు. పటేల్ ద్రోహాన్ని అర్థం చేసుకున్నారు. జయవంత్‌రావు తన గఢ్ రక్షణకు పోలీసులు వస్తారని ఆశతో ఉన్నాడు. అకస్మాత్తుగా ఇద్దరు దళ సభ్యులు పిస్తోళ్ళతో రావడం చూసి నోటిమాట రాలేదు. పిస్తోళ్ళు పేలాయి. ద్రోహి జయవంత్‌రావు శాశ్వతంగా కన్ను మూశాడు.
తొండచీర్లో హాహాకారాలు
రోజులు గడుస్తున్న కొద్దీ దళానికి కావలసిన ఆహార ధాన్యాలు సమస్యగా పరిణమిస్తున్నాయి. కిషన్‌గీర్ ఒక విధంగా ఆహారమంత్రిగా చుట్టు ప్రక్కలున్న గ్రామాల నుంచి ఆహారధాన్యాలను విరాళంగా సేకరించేవాడు. కిషన్‌గీర్ తల్లి దళానికి రొట్టెలు చేసి పెట్టేది. అయితే క్రమంగా ఆహార సమస్య తీవ్రమైన పరిస్థితులలో దళాన్ని రెండు భాగాలుగా చేశారు. ఒక భాగాన్ని జమల్కోట్వైపు పంపించారు. పథకం ప్రకారం మదనూర్ పోలీసు స్టేషన్‌పై దాడిచేసి ఆయుధాలు, తహశీల్పై దాడిచేసిన ధనాన్ని లూటీచేయాలని. ఇటు తొండచీర్లో కిసాన్ దళాలు లేవని రజాకార్లకు తెలిసింది.
Source: Vijaya Kranthi