రామ్‌ఘాట్ రైతుల వీరోచిత పోరాటం..
12 ఆగస్టు, 1948 నాడు ఉద్గీర్ నుంచి సాయుధబలగం ఒకటి బయలుదేరింది. ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక సబ్ ఇన్స్పెక్టర్తో సహా వందమంది పోలీసులు, వేలాదిమంది రోహిల్లాలు, పఠాన్లు, పస్తక్వామ్లు, రజాకార్లు కూడా వెంట ఉన్నారు. వెనకాల వేలాదిమంది ముస్లింలు ప్రేక్షకులుగా వస్తున్నారు. రామ్‌ఘాట్‌లో ఉన్న రైతుదళాన్ని మట్టుబెట్టాలని ఈ సారి మందిమార్బలంతో బయలుదేరారు. జరగబోయే పోరాటాన్ని కళ్ళారా చూడాలని ముస్లిం ప్రజలు దారిలో ఉన్న చిన్న కొండ ఎక్కి కూర్చున్నారు.
రామ్‌ఘాట్, తొండచీరు, కౌల్‌ఖేడ్ గ్రామాలు త్రికోణంలో ఉన్నట్లు ఉంటాయి. ఈ త్రికోణం మధ్య సమతలమైన కొండప్రాంతం ఉంది. ఉద్గీర్ నుంచి బయలుదేరిన శత్రుదళం కౌల్‌ఖేడ్ దగ్గరలోనే ఉన్న పల్లపు ప్రాంతాలకు చేరుకొంది. ఈ లోగా రైతుదళానికి కబురు చేరింది. అంతకుపూర్వమే ఈ దాడి జరగబోతుందనే విషయం తెలిసింది. దళం అన్ని ఏర్పాట్లు చేసుకొని ముందుకు దూసుకుపోయింది. భోజనం చేయగలిగే వ్యవధి లేకుండా పోయింది. అంతపెద్ద శత్రుబలంతో తలపడడానికి ఇంతటి చిన్నదళం అంతటి మనోధైర్యంతో వెళ్ళడం దుస్సాహసం అనిపించవచ్చు.
సమతలంగా ఉన్న కొండమీదకి ఉదయం 8 గంటలకు దళం చేరుకుంది. శత్రుదళాలు ఎదురుగా కనపడగానే రైతుదళం మోచేతులపై ప్రాకుతూ కదిలింది. ఎదురుగా కాల్పులకు సమాధానంగా తిరిగి కాల్పులు రెండు మూడు గంటలపాటు ఎదురెదురుగా సాగుతూనే ఉన్నాయి. శత్రువు దగ్గర మందుగుండు సామాగ్రికి కొదవలేదు. ఆగకుండా కాల్పులు సాగుతూనే ఉన్నాయి. ఎటుచూసినా పొగ వ్యాపించింది. శత్రువు అత్యంత శక్తివంతంగా దాడి చేస్తున్నాడనే సంగతి రైతు దళానికి తెలుసు. అయినా చంపడమో, చావడమో అనే అంతిమ లక్ష్యంతో వాళ్ళు కృతనిశ్చయులై ఉన్నారు.
కొండ ఆచివరవాళ్ళు, ఇటు వీళ్ళు పరస్పరం తుపాకులు గురిచూసి కొడుతూనే ఉన్నారు. తమ దగ్గర ఉన్న పరిమితమైన మందుగుండు సామాగ్రి జాగ్రత్తగా వాడుతున్నారు. దళం తన దగ్గర ఉన్న ఫిరంగిని పేల్చింది. అది ఎదురుగా ఉన్న కొండపైకి గుళ్ళను విసిరింది. ప్రేక్షకుల్లా వచ్చిన జనం గందరగోళంగా పరుగెత్తడం ప్రారంభించారు. మరోసారి ఫిరంగి పేలింది. శత్రుదళాల్లో కొందరు ఆ దెబ్బకు కూలిపోయారు. అయినా రోహిల్లాలు, పఠాన్లు, పోలీసులు కదలకుండా ప్రతిఘటిస్తూనే ఉన్నారు. మరోవైపు రాళ్ళచాటు నుండి మానక్రావు మూలే, యార్మొహ్మద్ఖాన్ ఎదరెదురుగా తుపాకులు గురిచూసి కాలుస్తున్నారు.
ఒకగుండు మానిక్రావ్మూలే తలపై నుంచి దూసుకుపోయింది. వెంట్రుకవాసిలో చావు తప్పింది. అలాగే మరో మూడు గంటలు కాల్పులు కొనసాగాయి. శత్రువర్గంలో అనేకమంది మరణించారు. 50 మంది చచ్చిపోగా వందలాది మంది గాయపడ్డారు. చివరకు దళంవాళ్ళు యార్మొహమ్మద్ను చుట్టిముట్టి చంపివేశారు. యార్మొహమ్మద్ పడిపోగానే శత్రుదళాలలో సంచలనం కలిగింది. చాలామంది అవకాశం చూసుకొని వెనక్కి తగ్గి పోసాగారు. హన్స్వీర్ అదే సమయంలో ఇద్దరు పఠాన్ల నుంచి తుపాకులను లాక్కొని వాళ్ళను ఖతం చేశాడు. రామకృష్ణ యోర్ పఠాన్ల నుంచి తుపాకి లాక్కొందామని ముందుకు దూకాడు.
దళం చేసుకున్న నిర్ణయం ప్రకారం ఎవరైనా, శత్రువు దగ్గర ఆయుధం లాక్కొంటే అవి వాళ్ళ సొంతం అవుతాయి. ఆ ఆశకొద్దీ దేవరాజ్ ముందుకు వెళ్ళాడు. శత్రువు గుండు తగిలింది. క్రింద కూలిపోయాడు. మరోవైపు దత్తగీర్ ప్రతీకార వాంఛతో మండి పోతున్నాడు. కిషన్గీర్ను చంపిన పైజుమహమ్మద్ను స్వయంగా చంపాలని పిచ్చిగా వెతకడం ప్రారంభించాడు. అయితే ఈ లోగా రాయిప్రక్కన గాయపడిన యార్మొహ్మద్ కనపడ్డాడు. అదే కసితో అతని తలపై రాయితో బలంగా కొట్టాడు దత్తగీర్. ఒకప్పుడు ఉద్గీర్లో చిన్నవాడు దత్తగీర్, యార్మొహమ్మద్ ఒకే స్కూల్లో ఒకే తరగతిలో చదువుకొన్న సహాధ్యాయులు, ఈనాడు బద్ధ శత్రువులు.
ఈ పోరాటంలో ఘోరంగా ఓడిపోయి రజాకార్లు, పోలీసులు ఉద్గీర్ వైపు పారిపోయారు. దళం అమరుడైన దేవరాజ్ మాధవ్‌ను సైనిక మర్యాదలతో సమాధి చేశారు. తమకంటే ఎన్నోరెట్లు బలవంతుడైన శత్రువును ఓడించి వెనక్కి తోసి విజయంతో రామఘాట్ తిరిగి వెళ్ళిపోయింది. రైతుదళం, గాయపడిన కొంతమందికి డాక్టరు చెన్నప్ప చిక్సిత్స చేశాడు. తీవ్రంగా గాయపడిన వాళ్ళను షోలాపూర్ పంపించే ఏర్పాటు జరిగాయి. ఇటు ఉద్గీర్లో ఓటమివార్త విషాదంలా వ్యాపించింది. ముస్లిం పోలీసువర్గాలు కోపంతో కొందరి హిందువుల ఇళ్ళపై దాడి చేశారు. అక్కడే స్థానిక పటేల్ హవర్గారావును పోలీసు రైటరు బహిరంగంగా కాల్చివేశారు. ఒక బ్రాహ్మణ యువకుని సజీవంగా దహనం చేశారు. హిందువులందరూ ప్రాణాలు అరచేతులతో నిలుపుకొని తలుపులు బిగించుకొని ఉండిపోయారు.
హిస్సర్గాకోటపై అధికారం
రామఘాట్ పోరాటం ముగిసిన తర్వాత దళం తిరిగి మందుగుండు సామాగ్రి, ఆయుధాల సమస్యను ఎదుర్కొంది. కొందరు షోలాపూర్ బయలుదేరి వెళ్ళారు. మధ్యలో అట్టర్గా, జావల్గా తదితర ప్రాంతాలలో ఆగుతూ సరిహద్దు ప్రాంతంలో ఉన్న లింగదల్లి చేరుకున్నారు. ఇది నిజాం రాజ్యంలో అంతర్భాగమైనా ఆనాటికే స్వతంత్రమై పోయింది.