సికింద్రాబాద్-పర్లి రైల్వేమార్గంలో ఉన్న కమాల్‌నగర్‌కు ఒక మైలుదూరంలో ఉంది బాలూర్ అనే గ్రామం. ఆనాడు జనసంఖ్య ఐదు వందలు, ఇళ్ళు యాభై లేక అరవై. దేవనీ జాగీరుల ఒక భాగం. ఈనాడు కర్ణాటకలోని బీదర్‌జిల్లాలో అవరాద్ తాలుకాలో ఉన్న గ్రామం. రజాకార్ల రోజుల్లో ఈ గ్రామంలోని పది లేక పన్నెండుమంది యువకులు సాహసంతో కేవలం వడిసెళ్ళతో దుండగులను ఎదిరించి నిలుచున్నారు.
ముఖ్యంగా గ్యానోబా, సదాశివ ఢగేలు వడిసెళ్ళతో ఎవరినైనా ఎదుర్కొనేవాళ్ళు. ఫర్లాంగు దూరంలో లాఠీ పట్టుకొని నిలుచున్న మనిషి చెయ్యిని వడిసెలతో గురిచూసి రాయితోకొట్టి లాఠీని పడవేయడం ఆ అన్నదమ్ముల ప్రత్యేకత. మరీ ముఖ్యంగా గ్యానోబా ఢగే వడిసెల విసరడంలో ఆరితేరిని వ్యక్తి.
గ్రామంలో పోలీసు పటేల్ రాచప్పకు ఆనాటి దేశ రాజకీయాలు బాగా తెలుసు. రజాకార్ల అఘాయిత్యాల గురించి వివరాలు తెలుసుకున్నాడు. తమ గ్రామాన్ని రక్షించుకోడానికి రైతుదళాలతో సంబంధాలు ఏర్పరచుకున్నాడు. ఆయన మిత్రులు తుకారాం దమ్, గ్యానోబా ఢగే అన్ని విధాలా గ్రామానికి అండగా ఉన్నారు.
వర్షాకాలంనాటి ఒక ఉదయం ఎటుచూసినా పొలాలు, పంటచేలతో కన్నుల పండువగా ఉన్నాయి. దేవనదీ కలకల నాదానికి పక్షుల కిలకిలా రావాలు వంత చేస్తున్నాయి. రైతులు నదినీళ్ళలో పశువులను మనసారా స్నానం చేయిస్తున్నారు. లేగదూడలు గంతులు వేస్తున్నాయి. ఆ రోజు జరిగే పొలిపండుగకు పశువులను పరిశుభ్రం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం పొలిరోజున తమ పశుగణాన్ని రైతులు ఇక్కడ అన్ని విధాలా అలంకరిస్తారు. అలంకరణలో పోటీపడుతున్నట్లు కనపడతారు.
ఆవులను, ఎద్దులను కడిగి, అలంకరించి రైతులు ఆరోజున వాటిని ఆదరాభిమానాలతో అతిథులుగా సత్కరిస్తారు. బెల్లంనీరు (గులవర్నా) తాగించి వాటికి పూజచేస్తారు. ఇతర తీపిపిండి వంటలు తినిపించి ఆ రోజున ఎలాంటి పని చేయించరు. రైతులు తాము దాచిపెట్టుకున్న మంచి దుస్తులు ధరించి అలంకరించిన ఎద్దులతో బండ్లలో బయలుదేరుతారు. గ్రామం బయట ఉండే ఆంజనేయస్వామి దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటారు. ప్రవేశద్వారం దగ్గర మామిడితోరణాన్ని తెంపే ఉత్సవం జరుగుతుంది. ‘కరీ’ని తెంచడం అనే ఉత్సవానికి వంశపారంపర్యంగా ఒకే కుటుంబం నాయకత్వం వహిస్తున్నది. పోలీస్‌పటేల్ లేదా అతని ప్రతినిధి ఆ రోజున కొరడాతో ఆ మామిడి తోరణాన్ని తెంచివేస్తాడు. అదే కార్యక్రమానికి ఈ రోజు ఉత్సాహంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
పశువుల స్నానం ముగిసిన తర్వాత రైతులు ఆంజనేయ దేవాలయానికి వచ్చారు. పశువులకు గడ్డిగాదం వేసి నీళ్ళు తాగించారు. ఇండ్లకు తీసుకెళ్ళి వాటికి పూజ జరపాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆ రైతుల్లో యువకులైన ఇద్దరు అన్నదమ్ముల గ్యానోబాకదమ్కాన్వలె, తుకారాం కదమ్జాన్వలె కూడా ఉన్నారు. ఈ పొలిపండుగ జరుగుతున్న రోజు శుక్రవారం. నిజాం పరిపాలనతో శుక్రవారం సెలవుదినంగా ఉండేది. ఆ రోజు ముస్లింలు నమాజు(ప్రార్థనలు) జరుపుతారు. కావున కార్యాలయాలకు వారాంతం సెలవుగా గడిచేది. గతరాత్రి అంటే గురువారం రాత్రి కమాల్‌నగర్‌లో ఇత్తేహాదుల్ ముస్లిం సంఘం బహిరంగసభ జరిపింది. రజాకార్లు పెద్దసంఖ్యలో హాజరైనారు. నిజాం ప్రభుత్వం అధికారులు స్వయంగా పాల్గొన్నారు.
నాయకుడు జాఫర్‌ఖాన్ పఠాన్ తన ముస్లిం సోదరులను సంబోధిస్తూ ఇలా ప్రసంగించాడు. ‘సోదరులారా! ఈనాటి పరిస్థితుల్లో మనమంతా మేల్కొని ఉండాలి. ఆజాద్ హైద్రాబాద్ మనుగడకు సవాలుగా పరిణమించాయి కొన్ని శక్తులు. స్వతంత్ర హైద్రాబాద్ శత్రువులు మన చుట్టూ ఉన్నారు. రామఘాట్ తదితర ప్రదేశాల్లో ఇటీవల జరిగిన సంఘటనలు మీకు బాగా తెలుసు. శత్రువులు తమ బలాన్ని పుంజుకొని మనపై దాడి చేయాలనుకుంటున్నారు. మన పొరుగున ఉన్న గ్రామం బాలూర్. ఆ గ్రామంలో హిందూ పోలీసు పటేల్ రాచప్ప మనకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలో భాగస్థుడు.
ఆ గ్రామం గురించి మన సయ్యద్‌మియా ఇచ్చిన వివరాలు. మన విశ్వాసపాత్రుడైన హిందూ సోదరులు ఇచ్చిన సమాచారం చాలా విషయాలను బయట పెడుతున్నాయి. రాచప్ప అతని మిత్రులు తుకారాం కదమ్, గ్యానోబా ఢగే ఆయుధాలు సేకరించి పెట్టారు. రైతు దళాలతో సంబంధాలు ఏర్పర్చుకొని అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. మనపై తిరుగుబాటు చేయడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. వీళ్ళ ప్రయత్నాలు మొగ్గలోనే తుంచివేయని పక్షంలో మహాప్రమాదం ముంచుకు రాబోతోంది.