అందువల్ల మనం రేపే బాలూర్ గ్రామంపై పోలీసు బలగంతో దాడి జరుపుదాము. రేపు హిందూ రైతులకు పొలిపండుగ. ఆ సందడిని ఆసరాగా తీసుకొని రేపే దాడిచేయడం మంచిది. రేపు సాయంత్రమే విజేతలుగా తిరిగివచ్చి అల్లాకు నమాజులు చేద్దాం ‘అల్లాహో అక్బర్. షాహే ఉస్మాన్ జిందాబాద్.’
పొలిపండుగ జరుగుతున్న రోజు ఉదయం పొలాల్లో ఉన్నారు తుకారాంకదమ్, గ్యానోబా. అకస్మాత్తుగా రజాకార్ల దాడి జరిగింది. ఏమరుపాటున ఉన్న ఆ ఇద్దరు అన్నదమ్ములపై ఆయుధాలతో దాడి చేశారు. గ్యానోబా తీవ్రంగా గాయపడి కిందపడి పో యాడు. తుకారాం రెండుచేతులను రజాకార్లు భుజాల దగ్గరగా నరికివేశారు. ఎదురుగా పశువులు ఈ దాడిని చూసి పరుగెత్తడం మొదలు పెట్టాయి. పశువులకంటే హీనంగా పరిణమించారు దుండగులు, రాక్షసులను తలదన్నే చర్యలకు పాల్పడ్డారు ఆ రజాకార్లు.
నరకబడిన చేతులతో రక్తం కారుతుండగా తుకారామ్ గ్రామంవైపు పరుగెత్తాడు. గ్రామస్తులకు ఈ దాడి గురించి హెచ్చరిక చేయాలని వెడుతున్నాడు. ఈ లోగా కమాల్నగర్ నుంచి వచ్చిన వందమంది పోలీసులు, రజాకార్లు గ్రామాన్ని చుట్టుముట్టి వేశారు. గాయపడిన గ్యానోబా కదమ్‌ను ఎత్తుకెళ్ళిపోయారు. పశువులకొట్టాలకు నిప్పు అంటించారు. మండుతున్న కొట్టాలలోకి గాయపడిన గ్యానోబాను విసిరివేశారు. సజీవంగా ఉన్న వ్యక్తిని నిలువునా దహనం చేయడం! ఎంతటి విపరీతమైన ఘోరమో చెప్పడం సాధ్యం కాదు. గ్రామంలోకి మొండి భుజాలతో వచ్చిన తుకారంను చూసి గ్యానోబా ఢగే, గ్యానోబా కదమ్, తుకారాం తమ్ముడు మండిపోయారు. గ్రామస్థులు పరుగెత్తి తుకారంకు నీళ్ళు తాగించాలని ప్రయత్నం చేస్తున్నారు.
తుకారాం మూలుగుతూనే అన్నాడు, ‘మీరంతా వెళ్ళి గ్రామాన్ని కాపాడండి. రజాకార్లు చుట్టుముట్టారు. మన ఆడవాళ్ళ మానాలను రక్షించండి. నాకు నీళ్ళు తాగించే బదులు రజాకారు దుండగులను ఆ నీళ్ళలోనే ముంచండి.’ ఈ మాటలు వినగానే ఢగే సోదరులు గ్యానోబా, సదాశివ్ వడిసెలలు తీసుకొని గ్రామ ప్రవేశద్వారం దగ్గరికి పరుగెత్తారు. అక్కడే తులసీరాం పటేల్ రెండంతస్తుల భవనం ఉంది. దానిపైకి ఎక్కి ఢగేసోదరులు గురిచూసి వడిసెలు విసరడం ప్రారంభించారు. మరోవైపు రైతుదళం సహాయం కోసం రామఘాట్కు ఒక వ్యక్తిని పంపించారు. ఢగే సోదరులు వడిసెలతో రాళ్ళు విసురుతుంటే గ్రామంలోకి అడుగుపెడుతున్న రజాకార్లు రాళ్ళ దెబ్బలు తిని వెనక్కి పరుగెత్తడం మొదలు పెట్టారు.
గురుగోవింద్ సింగ్ మొగల్ కాలంలో ఒక సందర్భంలో ఇలా అన్నాడు. ‘పిచ్చుకలతో డేగలను తరిమి కొడ్తాను, అప్పుడే గురుగోవింద్ సింగ్ అని పిలవండి.’ ఈ రోజు అక్కడ నిజంగానే బాలూరులో పిచ్చుకలు డేగలను తరిమికొట్టే సాహసం చేస్తున్నాయి. అటువైపు దాదాపు రెండు వందల మంది రజాకార్లు, పోలీసులు ఆధునిక ఆయుధలతో దాడి చేస్తున్నారు. ఇటువైపు కేవలం వడిసెళ్ళతో రాళ్ళతో ఎదుర్కొంటున్నారు. బాలూర్ వాసులు, రాచప్ప పటేల్ దగ్గర ఒక భర్మార్ తుపాకి, కొన్ని నాటుబాంబులు ఉన్నాయి. ఢగే సోదరులు మరికొంతమంది మొత్తం డజను మంది మాత్రం అతి పెద్ద సాయుధ ముఠాను వడిసెళ్ళ రాళ్ళతో మూడు గంటలసేపు ఎదుర్కొన్నారు.
గ్యానో బా ఢగేను వదలి సదాశివ ఢగే, రాచప్పపటేల్ భవంతిపైకి వెళ్ళి అటునుండి వడిసెల విసరడం మొదలు పెట్టాడు. రెండువైపుల నుంచి ఎదురుగా వస్తున్న దుండగులపైకి గురిచూసి రాళ్ళు విసురుతూనే ఉన్నా రు. ఇతర గ్రామాల నుంచి రజాకార్ల బలగం, పోలీసులు వచ్చినా గ్రామంలోకి అడుగు పెట్టలేక పోయారు. సూర్యాస్తమయం జరుగుతున్న వేళ నిజాం పోలీసులు ముందుకు వచ్చి గ్యానోబా ఢగేను పిలిచారు. ‘అనవసరంగా ప్రాణాలు వదులుకుంటావు లొంగిపో’ అని అన్నారు. మీరు రజాకార్లను వెనక్కి తిప్పి పంపించి వేయండి. మీ ప్రభుత్వంతో నాకు పేచీ లేదు. అని గ్యానోబా ఢగే జవాబు ఇస్తున్నాడు. ఈ అవకాశాన్ని చూసుకొని అమాయకుడైన గ్యానోబా ఢగేను గురిచూసి తుపాకితో కాల్చివేశారు.
ఒకపక్క రాళ్ళ వర్షం ఆగిపోగానే నిజాం పోలీసులు, రజాకార్లు గ్రామంలోకి చొచ్చుకొని వచ్చారు. రాక్షసకాండ ప్రారంభించారు. ఎదురుపడిన ప్రతి ఒక్క హిందువును బల్లాలతో పొడిచి వేయడం మొదలైంది. ఇండ్లకు నిప్పు పెడుతున్నారు. పొడచివేయబడిన వ్యక్తులను కాలుతున్న ఇండ్లలోకి విసరి వేస్తున్నారు. పిడకలున్నచోట నిప్పు అంటించి వాటిలో తీవ్రంగా గాయపడిన వాళ్ళను తోసివేస్తున్నారు. ఈ విధంగా సజీవ దహనం పొందిన గ్రామీణులు శంభాజీ కరగ్భోంలే, సంత్‌రాం సర్బావేల్ బాడే, నారాయణ్ నాగోబా, కాక్నోలే, గుండప్పా శిర్సగే, గుణవంత్ గుండిజీ రాయఫల్, మనహులప్పా ధన్గర్. ఈ వ్యక్తులలో మొదటివాడు శంభాజీ మూడు పాతికల వయోవృద్ధుడు. దారిలో చెట్టుక్రింద కూర్చున్న వాడిని చంపి అతన్ని కాలుతున్న ఇంట్లో పడేశారు. సంత్‌రాం ఇంట్లో రెండు నెలల పసిపాప కూడా దహనమై పోయింది.
ఆ తర్వాత రాచప్ప కౌలఖేడే అనే రైతుని చిత్రహింసలపాలు చేశారు. రాచప్ప ఇంటిపేరు కౌల్‌ఖేడ్ కాబట్టి అతనికి రైతు విప్లవకారులతో సంబంధం ఉంటుందని అనుమానించారు. రైతుదళం నాయకుడు అప్పారావు పటేల్ కౌల్‌ఖేడే ప్రాంతంవాడు. అందువల్ల అతనికి రాచప్పకు సంబంధం ఉందనే అనుమానంపై రాచప్పను పాశవికంగా హింసించారు. కమాల్నగర్ చుట్టుపక్క ఉన్న హిందువుల్లో బీభత్సాన్ని సృష్టించాలని రజాకార్లు రాచప్పను అంత రాక్షసంగా హింసించారు. మొదటిరోజు రాచప్ప చేతిని నరికివేశారు. రెండోరోజు రెండోచేతిని నరికివేశారు. మూడోరోజు అతని ముక్కు, చెవులుకోసి, కళ్ళు పెరికివేశారు. బహిరంగంగా అతన్ని హత్య చేశారు. బాలూర్ వాసులకు ఎవరు ఆశ్రయం ఇవ్వకూడదని, ఎవరైనా రైతుదళం వాళ్ళు కనపడితే మజ్లిస్ కార్యాలయానికి సమాచారం అందచేయాలని ఆ ప్రకటన సారాంశం.
మరోవైపు గ్యానోబా ఢగే ఆ భవంతిపై తీవ్రంగా గాయపడి కూలిపోయాడు. రజాకార్లు రకరకాల ప్రయత్నాల ద్వారా ఆ భవంతిమీదికి ఎక్కి చేరుకున్నాడు. గాయపడిన గ్యానోబా నీళ్ళు అడిగితే మూత్రం పోస్తామని బూతులు తిట్టారు. ప్రభుత్వానికి విరుద్ధంగా కుట్రపన్నుతావా? రాచప్పకు సహాయపడతావా? అని అతన్ని క్రింద కాలుతున్న ఇంటిలోకి సజీవంగా విసిరివేశారు. విసిరివేసే ముందు అతని కాళ్ళు, చేతులను నరికివేశారు. వర్ణనాతీతమైన ఆ బాధతో కూడా గ్యానోబా మీరు మీ పనిచేయండి అంటూనే ఉన్నాడు. హంతకులబలాన్ని సవాలుచేస్తూనే, అన్యాయాన్ని ఎదుర్కొంటూ ప్రాణాలు కోల్పోయాడు. దూరంగా తీవ్రంగా గాయపడి ఉన్న తుకారాం కదమ్ దుండగులను ఎదుర్కోమని గ్రామీణులను ప్రేరేపించుతూనే ఉన్నాడు. అతన్ని కూడా రజాకార్లు పట్టుకొని సజీవంగా దహనం చేశారు. బాలూర్ గ్రామస్థులు ఈ వీరుల బలిదానాన్ని, సాహసాన్ని ఏనాటికీ మరిచిపోరు.
భారతదేశంలోని అనేక మంది సుపుత్రుల్లో వీరు చిరకాలం చరిత్రలో నిలుస్తారు. మరోవైపు గ్యానోబా తమ్ముడు సదాశివ ఢగే, రాచప్ప పటేల్ భవంతి పై నుంచి వడిసెలతో రాళ్ళు విసరి శత్రువులను వెనక్కి తరుముతున్నాడు. గ్యానోబా కూలిపోగానే సదాశివ్ శివమెత్తిన వాడిలా తన బలాన్ని అంతా కూడదీసుకొని రాళ్ళు విసరి కొడుతున్నాడు. రాచప్పపటేల్ ఇంట్లో అనేకమంది స్త్రీలు, పిల్లలు తలదాచుకున్నారు. గ్యానోబా భార్య ప్రసవించి అనారోగ్యంగా ఉంది. చివరికి సదాశివ ఢగే కూడా తుపాకి గుండుకు బలైపోయాడు.
రాచప్పపటేల్ స్వయంగా తుపాకిపట్టి దుండగులను ఎదుర్కొన్నాడు. రాచప్ప ఇంట్లో చాలా ఆయుధాలున్నాయనే భ్రమ కొంత ఆ ఇంట్లో తలదాచుకున్న వాళ్ళను కాపాడింది. రాచప్ప ప్రయోగించిన రెండు మూడు చేతిబాంబులు పనిచేశాయి. అయితే ఏడు లేక ఎనిమిది మంది తప్ప మిగతా వాళ్ళు ఆయుధాలు పట్టి ఎదుర్కోలేక పోయారు. శతృవులతో ధైర్యంగా తలపడిన వ్యక్తులు గంగారాంఢగే, నివృత్తిరామ్ కదమ్, జాన్వల్, శ్రీపతి గణపతి ఢగే మొదలైనవాళ్ళు. వీళ్ళు అందుబాటులో ఉన్న ఆయుధాలతో రాచప్ప ఇంటిని కాపాడారు. ఆశ్రయం పొందినవాళ్ళకు రక్షణ ఇవ్వగలిగారు. చీకటిపడ్డదేగాని ఆ ఇంటిని స్వాధీనం చేసుకోలేక పోయారు. రైతుదళం వచ్చి దాడి చేస్తుందనే భయంకొద్దీ రజాకార్ల జట్టు వెనక్కి మళ్ళి వెళ్ళిపోయింది. కమాల్ నగర్‌కు ఆరోజు రాత్రి విజయంపొంద నమాజు చేస్తామన్న మాట నిలుపుకోలేక పోయారు పాపం.
రజాకార్ దుండగులు కమాల్ నగర్‌కు వెళ్ళిపోగానే రాచప్పపటేల్తో సహా అందరు బయటికి రాగలిగారు. సదాశివ ఢగేకు దహన సంస్కారాలు జరిపారు. తుపాకి గుండు తగిలి గాయపడిన గంగారం ఢగేను వెంటబెట్టుకున్నారు. భయంకరంగా కాలి నాశనమైపోయిన బాలూర్ నుంచి మిగిలినవాళ్ళు అడవులదారి పట్టారు. ఊరుకాలి, బంధువులను కోల్పోయి, రోజంతా పోరాడిన గ్రామవాసులు హృదయవిదారకమైన వాతావరణంలో అడవుల్లో తలదాచుకున్నారు. బాలూర్లో కాలుతున్న ఇండ్లలో లేగదూడలు అరుస్తూ చనిపోయాయి. వృద్ధ స్త్రీ యశోద ప్రాణాన్ని లెక్కచేయకుండా కాలుతున్న ఇంట్లో జొరబడి రెండులేగ దూడలను కాపాడుకుంది. పుత్రశోకం నుంచి ఉపశమనం పొందింది.
పొలిపండుగ ఆనందోత్సాహాలు ఈ రోజు కుమిలి కుమిలి ఏడుస్తున్న రోజుగా మారిపోయింది. ఆక్రందనల మధ్య భీషణమైన, కరుణపూరితమైన గ్రామంగా మారిపోయింది. ఈనాటికీ ప్రతి పొలిపండుగ రోజు బాలూర్ గ్రామవాసులు ఆనాటి 1948 సంఘటనలను తలచుకొని కంటతడి పెట్టుకుంటారు.