తిరుగుబాటు నగారా
– డా. శ్రీరంగ్ గోడ్బోలే
హైదరాబాదు సంస్థానంలో 88% ఉన్న హిందువులపై నిజాము, అతని ఖాక్ సార్ పార్టీ, నిజాము సైన్యము , ఇత్తెహాదుల్ ముస్లిమీ, రోహిలే , పఠానులు , అరబ్బుల దమనకాండ 1920 తరువాత మరింత పెరిగింది. 1938 నాటికి పరిస్థితి విషమించింది. హిందువులకి తమ బాధలు , కష్టాలు చెప్పుకోవటానికి అన్ని మార్గాలు మూసుకుపోయాయి . దానివల్ల నియంత నిజాము పాలనకు విరుద్ధంగా నిరాయుధ ప్రతిఘటన తప్ప వేరే గత్యంతరం లేకుండా పోయింది.
పూర్వరంగం
హైదరాబాదు సంస్థానంలో హిందువుల కోసం రెండే సంస్థలు పనిచేస్తుండేవి. ఒకటి ఆర్యసమాజం , రెండవది హైదరాబాద్ హిందూ సబ్జెక్ట్స్ లీగ్ లేక హిందూ సివిల్ లిబర్టీ యూనియన్. వీటిల్లో ఆర్యసమాజ్ 1880లో ధారూర్, 1892 లో హైదరాబాద్ లోని సుల్తాన్ బజార్ లో ప్రారంభమైంది . 1911లో హైదరాబాదు సంస్థానంలో ఆర్యసమాజ్ శాఖలు 40 వుండేవి. 1940 నాటికి వాటి సంఖ్య 250కి పెరిగి సభ్యులు 40వేలమంది అయ్యారు. భాయి శ్యామ్ లాల్, భాయి బంశీలాల్, పం. నరేంద్ర, పం. దత్తాత్రేయ ప్రసాద్, న్యా. కేశవరావు కోరట్ కర్, శ్రీ. చందులాల్, బా. వినాయక్ రావ్ విద్యాలంకార్, వేదమూర్తి పం. శ్రీపాద దామొధర సాత్వలేకర్ వంటి ఆర్యసమాజ నాయకులు ఆ క్లిష్ట సమయంలో కూడా సామాజిక మార్పుకోసం , శుద్ధీకరణ, హిందుత్వ సంరక్షణ కోసం పనిచేసారు. (చంద్రశేఖర లోఖండే గారు వ్రాసిన `హైదరాబాద్ ముక్తి సంగ్రామ్ కా ఇతిహాస్’, శ్రీ ఘూడమల్ ప్రహ్లాద్ కుమార్ ఆర్యధర్మార్థ ట్రస్ట్ , హిండోన్, రాజస్థాన్, 2004, పేజీ 35,49,55 ఆధారంగా)
1921 జూన్ 11,12న హైదరాబాదులోని విజయవర్ధిని థియేటర్ లో “దక్షిణ హైదరాబాదు రాజకీయ పరిషత్” జరిగింది. ఆ తరువాత ఇలాంటివి మళ్ళీ హైదరాబాదులో జరగటానికి అనుమతి లభించలేదు. దాంతో 1926 నవంబరు, 1928 మే లలో సంస్థానంలోని ప్రజల పరిపాలనా సంబంధిత అభిప్రాయాల నివేదనకై ముంబై , పూనాలలో సమ్మేళనాలు జరిగాయి. “హైదరాబాదు సంస్థాన రాజకీయ పరిషత్తు” సమావేశాలు 1931, ఆగస్టు 28న అకోలాలో కూడా జరిగింది. దాంట్లో నిజాము ప్రతికూల వైఖరి, నిషేధం తరువాత తీసుకురావలసిన సామాజిక మార్పు గురించి దిశానిర్దేశం జరిగింది. దీనిపై కేసరీ పత్రిక ఈ విధంగా వ్రాసింది – “ఇలా ఎన్ని సమ్మేళనాలని ఈ విధంగా బయటికిపోయి జరుపుతారు? సంస్థానంలోని ప్రజలు తాముగా సంస్థానంలో, సంస్థానానికి వ్యతిరేకంగా ముందుకు అడుగు వేస్తేనేకాని వాళ్ళ జీవితాల్లో మార్పురాదు. ఈ విషయం తెలుసుకుని దానికి అనుగుణంగా వ్యవహరించవలసిందే” (కేసరి , 1 సెప్టెంబర్ 1931). ఈ విధంగా 1920 నుండి 1938 మధ్యలో రాజకీయ చైతన్యం నెమ్మదిగ నెమ్మదిగా ప్రారంభం అయింది.
1938, ఏప్రిల్ 6 న హైదరాబాదు సంస్థానంలో ముస్లిం దుండగులు హిందువుల పై దాడులు చేసారు. నిజాం సర్కారు , పోలీసు బలగం , ఈ సంఘటన లను కేవలం చూస్తూ ఉండి పోయారు . అంతేకాదు నిజాం సర్కారు 24 మంది హిందువులపై హత్యా నేరాన్ని మోపి వాళ్ళను నిర్బంధంలోకి తీసుకుంది . దీన్ని వాదించటానికై , హిందూ నాయకులు న్యాయవాదులు నారిమన్, భులాబాయి దేసాయిలను పిలిపించారు . అందులో నారీమన్ ని నిజాము తన సంస్థానంలోకి రానివ్వలేదు , సంస్థానంలోకి వచ్చిన భులాభాయీ తానే స్వయంగా విరమించుకునేలా నిజాం చేశాడు. అఖిలా భారతీయ ప్రజా పరిషత్ అధ్యక్షుడు ఇంకా కాంగ్రెస్ కార్యసమితి సభ్యుడు డా. పట్టాభి సీతారామయ్య గారిని కూడా జూన్ 16న హైదరాబాదు సంస్థానంలో ప్రవేశించడానికి అనుమతి ఇవ్వలేదు.
1938, జూన్ 2న “హైదరాబాద్ సంస్థాన మహారాష్ట్ర పరిషత్తు”, బారిస్టర్ శ్రీనివాస్ శర్మ గారి అధ్యక్షతన లాతూర్ లో ప్రారంభం అయింది. నాగరిక స్వాతంత్ర్యం ఇంకా హైదరాబాదు అల్లరుల విషయాలపై తగు నిర్ణయాలు తీసుకునే విషయమై ( ముందుగా పత్రాన్ని అందజేసినా కూడా ) తాలూకాదారు పరిషత్తును అనుమతించకపోవటంతో పరిషత్తు అసంపూర్తిగానే రద్దయ్యింది .
1938, ఆగస్టు 22 న 15 పత్రికలపై నిజాం ప్రభుత్వం నిషేధాన్ని విధించింది. 1938 సెప్టెంబరులో మరో ఐదారు పత్రికలపై నిర్బంధం విధించింది. అనుమానాస్పద వ్యక్తులను నిర్బంధించటం , సంస్థానం బయటికి బహిష్కరించడం, అలాంటివారికి ఆశ్రయం ఇచ్చిన వారిని శిక్షించడం లాంటి పూర్తి అధికారాలు పోలీసు కమీషనర్, తాలూకాదారుకి సంస్థానం ఇచ్చింది. అదేవిధంగా హైదరాబాదు సంస్థానంలో ఏ సంస్థలైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకలాపాలను నడిపిస్తాయో వాటిని చట్టవిరుద్ద సంస్థలుగా ముద్రవేయటం, ఆ సంస్థల సభ్యులపై నోటీసులు జారీ చేయటం, వాటి ఆస్తిపాస్తులను, పత్రాలను లాక్కోవటం, నాశనం చేయడం లాంటివి కూడా జరిగాయి. ఈ పట్టుబడ్డ వాళ్ళల్లో ఎవరైనా 16 ఏళ్ళ కన్నా తక్కువ వయస్సు వారు వుంటే, వాళ్ళ కుటుంబాన్ని కూడా పోలీసులు తమ అదుపులోకి తీసుకోవాలనే ఆదేశాన్ని ఇచ్చారు. ఇది నిరంకుశత్వానికి, అరాచకత్వానికి పరాకాష్ఠ (కేసరి , 9 సెప్టెంబర్ 1938 ) .
హైదరాబాదు సంస్థానంలో హిందువులకు సంబంధించిన ఎలాంటి రాజకీయ సంస్థ లేదు. కాంగ్రెస్ భారతదేశంలోని ప్రముఖ రాజకీయ పక్షం అయినప్పటికీ అది హైదరాబాదు సంస్థానంలో హిందువుల విషయంలో ఉదాసీనంగా ఉండేది. 1938, ఫిబ్రవరి 19-21లలో హరిపూరాలో జరిగిన కాంగ్రెసు సమావేశాల్లో ఆఫ్రికా, సిలోన్ లోని భారతీయుల గురించి, చైనా, పాలస్తీనాలోని సామ్రాజ్యవాద వ్యతిరేక కార్యకలాపాల గురించి చర్చించారుకానీ నిజాము రాజ్యంలోని హిందువులపై జరుగుతున్న అత్యాచారాల గురించి పట్టించుకోలేదు. సంస్థానాలలో జరిగే ప్రజా పోరాటాలు కాంగ్రెసు పార్టీ తన ఆధ్వర్యంలో చేపట్టక పోయినా , కార్యకర్తలు నైతికమద్దతుతోపాటు, తమ సహాయాన్ని అందించడానికి పూర్తి స్వతంత్రులనే ఒక్క వాక్యం మాత్రం తీర్మానంలో చేర్చారు ( హరిపురాలో జరిగిన 51వ కాంగ్రెసు కార్యవర్గ సమావేశాల నివేదిక, అ. భా. కాంగ్రెస్ కార్యవర్గసమితి,1938 ).
ఇతర సంస్థానాలలో నడుస్తున్న కార్యకలాపాలను చూసిన నిజాము రాజ్యంలోని నాయకులు ఇక్కడ స్టేట్ కాంగ్రెస్ అనే పేరుతో ఒక సంస్థ ప్రారంభించాలని నిర్ణయించారు. “సత్యం, అహింస ఆధారంగా మనం జాతి వాదానికి విరుద్ధం ” అనే భావం ఈ స్టేట్ కాంగ్రెస్ సభ్యులకు ఉండేది . `రాష్ట్రీయ భావాలు కలిగిన వాళ్ళం, హిందూ జాతీయవాదులం కాదు, హిందూ మహాసభతో మాకెలాంటి సంబంధం లేదు’ అని స్టేట్ కాంగ్రెస్ సభ్యులు గొంతు చించుకుని చెప్పసాగారు. కానీ ఈ ప్రకటనలు నిజాము, అతని అనుచరులు, హైదరాబాదు ముసల్మానులపై ఇసుమంతైనా ప్రభావం చూపలేదు. ఈ సంస్థ అన్ని జాతుల వారికి, మతాలవారికి తన తలుపులను తెరిచినా, దానికి సిరాజ్ ఉల్ హాసన్ తిరమిఝీ తప్ప మరే ఇతర ముస్లిం అందులో చేరలేదు. అంతే కాక ఈ సంస్థ సభ్యులు హిందూ జాతీయవాద సంస్థలలో కూడా సభ్యులు అనే ఆరోపణలను ప్రభుత్వ పత్రాలలో నమోదయ్యాయి. ఆ ఆరోపణలు నిజం కాదని, తమ సభ్యులకు హిందూ జాతివాద సంస్థలకి ఎలాంటి సంబంధం లేదని సంస్థ నాయకులు ఎన్ని విధాలుగా చెప్పినా పట్టించుకొని నిజాము ప్రభుత్వం ఆ సంస్థని జాతివాద సంస్థగా నిర్ధారించి ” పబ్లిక్ సేఫ్టీ రెసెల్యూషన్ ” కింద అది పుట్టక ముందే 1938, సెప్టెంబర్ 7న నిషేధించింది. (మెమోయిర్స్ ఆఫ్ హైదరాబాద్ ఫ్రీడం స్ట్రగల్, స్వామి రామానంద తీర్థ, పాప్యులర్ ప్రకాశన్, ముంబై,1961 , పుట 86 – 95 ; , కేసరి,13 సెప్టెంబర్ 1938 ).
నిరాయుధ పోరాటం
నిజాం సంస్థానంలోనికి వెళ్ళి అక్కడి స్థితిగతులను ప్రత్యక్షంగా పరిశీలించి చూడడానికి మహారాష్ట్ర ప్రాదేశిక హిందూసభ అధ్యక్షుడు లక్ష్మణ బల్వంత్ (అణ్ణాసాహేబ్ ) భోపట్ కర్ గారి సూచన మేరకు మహారాష్ట్ర ప్రాదేశిక హిందూసభ కార్యవాహ శంకర్ రామచంద్ర (మామా రావ్) దాతే గారు , సాతార హిందూసభ ప్రముఖులు, సాతారా జిల్లా సంఘచాలక్ శివరాం విష్ణు (భావూరావ్) మోడక్, బార్షీ హిందూసభ ప్రముఖుడు గోవింద రఘునాథ్ (బాబా రావ్ )కాళేలు 1938 మార్చి – ఏప్రిల్ లో మరాఠ్వాడా ప్రాంతంలో రహస్య పర్యటన చేశారు. ఆర్యసమాజం సభ్యులు ఈ పోరాటంలో సహకరించడానికి ఒప్పుకున్నారు. 1938, జులై దిల్లీలోని “అంతర్ రాష్ట్రీయ ఆర్యన్ లీగ్” కార్యవర్గ సభ్యుల సమావేశంలో ధార్మిక స్వాతంత్ర్యానికి సంబంధించి పధ్నాలుగు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. హైదరాబాదు సంస్థాన సంబంధిత విషయాలను చర్చించటానికి సంస్థాన సరిహద్దు ప్రదేశాలలో, అంటే మహారాష్ట్ర లేక మధ్య ప్రాంతంలో అ. భా. ఆర్యన్ కాంగ్రెసు సమావేశాలు ఐదు నెలల కాలావధిలోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సంస్థానం అధికారులు ఆర్యసమాజం విషయంలో తమ ధోరణిని మార్చుకోకపోతే సత్యాగ్రహం వంటి అన్నీ మార్గాలు ఆలోచిస్తూ, ఆర్యసమాజీయులను శాంతి మార్గాలు అవలంబించటానికి ఒప్పించాలని కూడా నిర్ణయం జరిగింది (కేసరి , 5 జులై, 1938 ) .
ఆర్యసమాజ్ డిఫెన్స్ కమిటి కార్యదర్శి ఏస్. చంద్రా, ఆర్యసమాజ్ అధ్యక్షుడు ఘనశ్యాందాస్ గుప్త గార్లు హైదరాబాదు సంస్థానంలో పర్యటించి, అ.భా . హిందూ మహాసభ అధ్యక్షుడు సావర్కర్ గారిని నాశిక్ లో కలిసి వారికి హైదరాబాదు సంస్థానంలో పరిస్థితులు వివరించారు (కేసరి, 9 ఆగస్టు 1938).
నిజాం సంస్థానంలోని నిబంధనలను లెక్కచేయకుండా, అక్కడి సభాకార్యక్రమాలపై ఉన్న నిర్బంధాన్ని శాంతియుతంగా వ్యతిరేకించడానికి 1938, సెప్టెంబర్ 23న సేనాపతి పాండురంగ మహాదేవ బాపట్ గారు పూనా నుండి హైదరాబాద్ బయలుదేరారు. నిజాం సైనికులు ఆయనను హైదరాబాదులో దిగగానే బంధించి తిరిగి పూనా పంపారు . బ్రిటిష్ ఇండియాలో ఈ విషయాన్ని బాగా ప్రచారం చేసి ఆ తరువాత నవంబర్ 1 న నిరాయుధ పోరాటం కోసం తిరిగి వెళ్ళాలని సేనాపతి బాపట్ గారు నిర్ణయం తీసుకున్నారు (కేసరి , 27 సెప్టెంబర్ 1938 ). ఇదే విషయాన్ని బాపట్ గారు, సావర్కర్ గారు పూనా లో ఒక గంట పాటు గోప్యంగా చర్చించారు. ఆ తరువాత అదే రోజు సాయంత్రం శనివార్ వాడా ప్రాంగణంలో జరిగిన విశాల సభలో ప్రసంగిస్తూ సావర్కర్ గారు పోరాటపు తాత్విక భూమికని స్పష్టం చేస్తూ “పోరాటం రెండురకాలుగా చేయొచ్చు , ఒకటి సాయుధపోరాటం , రెండవది నిరాయుధపోరాటం. మొదటిది ప్రస్తుత పరిస్థితుల్లో అంతగా సరైనది కాదు కాబట్టి నిరాయుధ పోరాటాన్ని ఎంచుకోవటం జరిగింది . నేను సాయుధ పోరు తప్పని అనే వాణ్ణి కాను. పాపభీతితో దాన్ని వద్దనట్లేదు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సాయుధ విప్లవం చేసే పరిస్థితిలో మనం లేము కాబట్టి హైదరాబాదు సంస్థానంలో శాంతియుత సత్యాగ్రహమే యోగ్యమైన మార్గం” అని అన్నారు.
అదే సభలో లోకమాన్య తిలక్ గారి మనవడు, “మరాఠా” పత్రిక సంపాదకుడు గజానన్ విశ్వనాథ కేత్కర్ గారి అధ్యక్షతన ” హిందుత్వ నిష్ఠ నాగరిక సత్యాగ్రహ సహాయ మండళ్ ” (సంక్షిప్తంగా భాగానగర్ హిందూ సత్యాగ్రహ మండళ్ )ప్రారంభమైంది(కేసరి , 14 అక్టోబర్ 1938) . ప్రసంగాలు, ముద్రణ, లేఖన, సంఘం , సభ, మతం వంటి విషయాల్లో నిజాం సంస్థానంలోని ప్రజలకు స్వాతంత్ర్యం లభించేట్లు చేయడమే పోరాటం ముఖ్య ఉద్దేశం. ఈ మండలి కేంద్రం పూనాలో ఉండగా, మహారాష్ట్ర, మధ్యప్రాంతం , వర్హాడ్ ప్రాంతాల్లో అన్ని చోట్లా దాని శాఖలు ప్రారంభమయ్యాయి. ఈ పోరాటంలో వర్ణాశ్రమ స్వరాజ్య సంఘ, హిందూ మహాసభ , లోకశాహీ స్వరాజ్య పక్ష, హిందూ యువక సంఘ మండలి చేరాయి(కేసరి , 1 నవంబర్ 1938). రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్వయంసేవకులు కూడా ఈ సంస్థల తరపున పోరాటం చేసారు. అల్లర్లలో చనిపోయిన వారి కుటుంబాలకు సహాయం చేయటానికి, ఇంకా ఆరోపణలు ఎదుర్కొంటున్నవారి జరిమానాలు చెల్లించడానికి “భాగానగర్ హిందూ సహాయ నిధి” ప్రారంభించారు. ముందుగా ఊహించినట్టే దీని కూడా నిజం ప్రభుత్వం ఇంచుమించుగా దసరాకి అటూఇటుగా రద్దు చేసింది. అయితే “భాగానగర్ హిందూ సత్యాగ్రహ నిధి ” పేరిట మరోక నిధిని ప్రారంభించినట్టు సావర్కర్ గారు ప్రకటించారు. (కేసరి , 8 నవంబర్ 1938 ) .
రెండవ విడత సత్యాగ్రహంలో పాల్గొనటానికి సేనాపతి బాపట్ గారు అక్టోబర్ 31న పూనా నుండి బయలుదేరడానికి ముందు అక్టోబరు 30 సాయంకాలం , కొంతమంది కాంగ్రెస్ వారు బాపట్ గారి వద్దకు వచ్చి వారి ఆధ్వర్యంలో ఒక సభ చేసి ” స్టేట్ కాంగ్రెస్ సహాయక కాంగ్రెస్ నిష్ఠ సత్యాగ్రహ మండల్ “ని స్థాపించారు . వాస్తవానికి, బాపట్ గారు మొదలుపెట్టిన సత్యాగ్రహం సర్వ స్వతంత్రమైంది, ముందుగా నిర్ణయించుకున్నది. కానీ పూనా కాంగ్రెసు వాళ్ళు మధ్యలో కల్పించుకున్నారు. అప్పుడు బాపట్ గారు వారి సహచరులు, ఈ కొత్తగా వచ్చి చేరిన గుంపుని ప్రథమ జట్టుగా పేర్కొని ముందుకు నడిపారు. తద్వారా జాతీయతతో పాటు “బాహ్య సంబంధం ” అనే గుర్తింపు హైదరాబాదు స్టేట్ కాంగ్రెస్ కు ఆపాదించవచ్చన్నది ఆయన ఆలోచన. పూనా కాంగ్రెస్ వారి ఈ చర్య స్టేట్ కాంగ్రెస్ కి కూడా ఒక తలనొప్పిగా మారింది. స్టేట్ కాంగ్రెస్ నాయకుడు బల్వంత రావు గారు జైలుకు వెళుతూ `బయట ఏ సంస్థతో కూడా మాకెలాంటి సంబంధం లేదని’ చెప్పాల్సి వచ్చింది (కేసరి, 8 నవంబర్ 1938).
మహారాష్ట్రలో పరిణామాలు ఇలా సాగుతూ వుండగా, యశ్వంత్ రావ్ దిగంబర్ జోషీ , దత్తాత్రేయ లక్ష్మీకాంత జూకల్ కర్, మొదలైన హైదరాబాద్ హిందూ సభ నాయకులు, పూనా హిందూ సభ నాయకులతో సావర్కర్ గారితో సంప్రదింపులు జరుపుతూనే వున్నారు . దానివల్ల వీర యశ్వంత్ రావ్ దిగంబర్ జోషీ గారు “నాగరిక హిందూ స్వతంత్ర సంఘ” తరఫున హైదరాబాదులోని దివంగత హిందూ నాయకుడు వామన్ రావ్ నాయీక్ గారి సంస్మరణార్థం 1938, అక్టోబర్ 21న సుమారుగా మూడు వేలమందితో ఊరేగింపు నిర్వహించి, నిజాము ప్రభుత్వం విధించిన నిర్బంధాన్ని ధిక్కరించారు . అందుకు వారికి 21 నెలల కఠిన కారాగార శిక్ష, 200రూపాయల జరిమానా విధించారు. ఇదే నిరాయుధ తిరుగుబాటు పోరాటానికి నాంది .
ఈ సంఘటన తరువాత నిషేధిత హైదరాబాదు స్టేట్ కాంగ్రెస్ ( 24 అక్టోబర్ 1938), ఆర్యసమాజం (27 అక్టోబర్ 1938) పోరాటం మొదలు పెట్టాయి. 1938, డిసెంబర్ 25-27 న లోకనాయక్ బాపూజీ ఆణే గారి అధ్యక్షతన, భాయీ పరమానంద, సావర్కర్ వంటి నాయకుల సమక్షంలో అఖిల భారత ఆర్య పరిషత్తు సమ్మేళనం షోలాపూర్ లో జరిగింది. అందులో నిజాం వ్యతిరేక పోరాటానికి 22వేల మంది సిద్ధంగా వున్నారని చెప్పారు. ఈ పరిషత్తులో మహాత్మా నారాయణస్వామి మహారాజ్ గారికి , సత్యాగ్రహ సమితి ప్రారంభించేందుకు పూర్తి అధికారాన్ని ఇచ్చి వారిని ప్రధాన నాయకుడుగా ప్రకటించారు(కేసరి , 30 డిసెంబర్ 1938) . ఆ తరువాత 1938, డిసెంబర్ 28 – 30 న సావర్కర్ గారి అధ్యక్షతన నాగపూర్ లో అఖిల భారత హిందూ మహాసభ సమ్మేళనం జరిగింది . అందులో నిజాం వ్యతిరేక పోరాటాన్ని కొనసాగించాలని నిర్ణయం జరిగింది. సావర్కర్ గారి ఆశీస్సులతో హిందూ సత్యాగ్రహ మండల్ మొదటి జట్టు 1938, నవంబర్ 7న పూనా నుండి బయలుదేరింది.
హైదరాబాదు సంస్థానంలో స్వాతంత్ర్యం కొరకు మొదటి పోరాటం, సెప్టెంబర్ 1938 న మొదలై ఆగస్టు 1939 వరకు నడిచింది. దీంట్లో హిందూ మహాసభ, ఆర్య సమాజం, స్టేట్ కాంగ్రెస్ మాధ్యమంగా కొంతకాలం కాంగ్రెసు వారు పాల్గొన్నారు. ఆర్యసమాజం పోరాటం ధార్మిక స్వాతంత్ర్యం కోసం, హిందూ మహాసభ ఇతర నాగరిక స్వాతంత్ర్యాలు, కాంగ్రెసు నిస్పక్షిక పాలనా యంత్రాంగం కోసం తమతమ పోరాటాన్ని సాగించాయి. ఈ పోరాటంలోని ముఖ్యమైన ఘట్టాలు తరువాతి భాగాలలో తెలుసుకుందాం .
అనువాదం : పరిమళ నడింపల్లి
Read 1st Part Here – హైదరాబాద్ (భాగ్యనగరం) నిరాయుధ ప్రతిఘటన – మొదటి భాగం