భారత్‌పై దుష్ప్రచారం చేస్తున్న డిజిటల్ మీడియా చానెళ్ళపై కేంద్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంది. వార్తలు ప్రాతిపదికగా పనిచేసే 22 యూట్యూబ్ చానెళ్ళను, మూడు ట్వీటర్ ఖాతాలను, ఒక ఫేస్‌బుక్ ఖాతాపై ప్రభుత్వం వేటు వేసింది. 2021 నాటి ఐటీ నిబంధనలకు లోబడి కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ 22 యూట్యూబ్ చానెళ్ళపై చర్య తీసుకుందని ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో – పీఐబీ ఇండియా ట్వీట్ చేసింది. కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసిన 22 యూట్యూబ్ చానెళ్ళలో 18 భారత్‌కు చెందినవి కాగా మిగిలినవి పాకిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నవి.
వీక్షకులను తప్పుదారి పట్టించే విధంగా టీవీ న్యూస్ చానెళ్ళ లోగోలను, అవాస్తవికమైన థంబ్ నెయిల్స్‌ను సదరు యూట్యూబ్ చానెళ్ళు వినియోగించినట్టు పీఐబీ ఇండియా పేర్కొంది. జాతీయ భద్రత, భారత్ అనుసరిస్తున్న విదేశీ సంబంధాలు, ప్రజా భద్రత లాంటి అత్యంత సున్నితమైన అంశాలపై అవాస్తవికమైన వార్తలను మొత్తంగా 260 కోట్లకు పైగా వ్యూయర్ షిప్ కలిగి ఉన్న 22 యూట్యూబ్ చానెళ్ళు వ్యాప్తి చేస్తున్నాయని తెలిపింది.
“ఉక్రెయిన్‌లో పరిస్థితిని తమకు అనువుగా మలచుకొని ఇతర దేశాలతో భారత్ దౌత్య సంబంధాలను దెబ్బ తీసేలా పెద్ద ఎత్తున అవాస్తవిక సమాచారాన్ని భారత్ కేంద్రంగా పనిచేస్తున్న యూట్యూబ్ చానెళ్ళు వ్యాప్తి చేస్తున్న వైనం మా దృష్టికి వచ్చింది” అని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తెలిపింది.
గత ఏడాది ఫిబ్రవరిలో 2021 నాటి ఐటీ నిబంధనల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత భారత్ కేంద్రంగా పనిచేస్తున్న యూట్యూబ్ చానెళ్ళపై కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా చర్య తీసుకుంది. అలాగే జనవరిలో డిజిటల్ మీడియా వేదికగా భారత్‌పై దుష్ప్రచారం చేస్తూ భారత్ కేంద్రంగా పనిచేస్తున్న 35 యూట్యూబ్ చానెళ్ళు, రెండు వెబ్ సైట్లను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ బ్లాక్ చేసింది.