Home Hyderabad Mukti Sangram హైదరాబాద్ నిజాం అరాచకాలను ఎండగట్టిన ‘ఇమ్‌రోజ్’ పత్రిక

హైదరాబాద్ నిజాం అరాచకాలను ఎండగట్టిన ‘ఇమ్‌రోజ్’ పత్రిక

0
SHARE

ముందుముల నర్సింగరావుగారి సహాయంవల్ల షోయీబ్ “ఇమరోజ్‌” దినపత్రికను వెలువరించే ఏర్పాటు చేసుకున్నాడు. శ్రీ బూర్గుల రామకృష్ణారావుగారు ఆర్థిక సహాయం అందచేశారు. 1947 నవంబరు 15వ తేదీనాడు “ఇమరోజ్‌” దినపత్రిక మొదటి సంచిక వెలువడింది. సంస్థానంలో క్రమంగా పత్రిక పలుకుబడితోపాటు పాఠకుల సంఖ్య కూడా బాగా పెరిగిపోయింది. కొంతకాలం తర్వాత రామకృష్ణారావుగారి ఇంట్లోకి “ఇమరోజ్‌” కార్యాలయం తరలించబడింది.

ఆ రోజుల్లో శ్రీ రామకృష్ణారావుగారు న్యాయవాద వృత్తిని వదిలివేశారు. ప్రభుత్వ దమన నీతికి నిరసనగా చాలామంది న్యాయవాదులు ఆనాడు న్యాయస్థానాన్ని బహిష్కరించారు. “ఇమరోజ్‌” ఒక విధంగా ఆనాటి స్టేట్ కాంగ్రెస్ వాణిగా వెలువడేది. నిజాం సంస్థానం పోకడలను నిశితంగా విమర్శిస్తూ షోయీబ్ సంపాదకీయాలు రాసేవాడు. రాష్ట్రంలో ప్రబలుతున్న అరాచకమైన పాలనా దుస్థితిని తీవ్రంగా ఖండిస్తూ ఆయన తన కలం పదునును మరింతగా పదునుపెట్టేవాడు. 1948 జనవరి 29 నాటి సంపాదకీయంలో ఇలా రాశాడు. దాని శీర్షిక….

‘పగటి ప్రభుత్వం-రాత్రి ప్రభుత్వం’

“ఈనాడు గ్రామస్థులు ప్రభుత్వ తిరుగలిలో పిండి చేయబడుతున్నారు. ఇంతవరకు జరిగిన సంఘటనలు ప్రజల ఎదుట ఉన్నాయి. అరాచకం ఏ విధంగా రాజ్యం చేస్తున్నదో అందరికీ తెలుసు. కొన్నిచోట్ల కమ్యూనిస్టు దళాలు చెదురుమదురుగా హింసాచర్యలు సాగించిన విషయాన్ని మేము సమర్థించటం లేదు. కానీ ప్రతీకారచర్యలనే పేరుతో జరుగుతున్న హింసాకాండ మితిమీరిపోతున్నది.

“ఇత్తెహాదుల్ ముసల్ మీన్‌” సంస్థ తన సభ్యులకు సైనిక శిక్షణ ఇస్తున్నది. తన దళాలను రాష్ట్ర సరిహద్దులపైకి పంపిస్తున్నది. గ్రామాలలో జరుగుతున్న దోపిడీలు, మానభంగాలు ఎవరివల్ల జరుగుతున్నాయో ఈనాడు అందరికీ తెలుసు. బీబీనగర్, నిజామాబాద్‌లలో జరిగిన సంఘటనలు మరీ క్రూరంగా ఉన్నాయి. అక్కడక్కడా ఈ దోపిడీ, మానభంగాలకు సంబంధించిన ప్రత్యక్ష ప్రమాణాలు లభిస్తున్నాయి. ఇత్తెహాదుల్ ముసల్‌మీన్ సభ్యులు గాంధీ టోపీలు ధరించి గాంధీజీకి జై అనే నినాదాలు చేస్తూ గ్రామాలను దోచుకుంటున్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు వీటినన్నింటినీ సాధారణమైన చోరీ నేరాల క్రింద త్రోసివేస్తున్నారు.

మా అభిప్రాయంలో ఈ అరాచకమైన వ్యవస్థ ఒక విషవలయంగా పరిణమించింది. ఒక గ్రామీణుడు బాధతో “పగటిపూట ఒక ప్రభుత్వం  రాత్రి మరొక ప్రభుత్వం రాజ్యం చేస్తున్నది” అన్నమాట సత్యదూరమేమీ కాదు. పరిస్థితులు ఇత్తెహాదుల్ సంస్థ దుశ్చర్యలను మాత్రమే ప్రజలకు బాహాటంగా చూపుతున్నాయి. ప్రభుత్వ ప్రచార యంత్రాంగం ఈ వాస్తవాన్ని కప్పిపుచ్చలేదు.

(విజయక్రాంతి సౌజన్యం తో)