Home News యుపిలో మత ప్రార్థనను విద్యార్థులచే పాడించిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విధుల నుండి బహిష్కరణ

యుపిలో మత ప్రార్థనను విద్యార్థులచే పాడించిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విధుల నుండి బహిష్కరణ

0
SHARE

బిసాల్‌పూర్, బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (బీఈఓ) ఉపేంద్ర కుమార్ జరిపిన విచారణలో  బిసాల్‌పూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఫుర్కాన్ అలీ(45), 1902 లో ముహమ్మద్ ఇక్బాల్ రాసిన “లబ్ పె ఆతి హై దువా” అనే కవితను విద్యార్థులచే పఠింప చేశారని నిర్ధారణ కావడంతో అతడిని విధుల నుండి బహిష్కరించారు.

ఉదయం పాఠశాల ప్రార్థన సమయంలో  మదర్సాల్లో పఠించే మత ప్రార్థనను పాఠశాల విద్యార్థులచే పఠింప చేశాడని స్థానిక వీహెచ్‌పీ కార్యకర్తలు ఫిర్యాదు చేయడంతో  ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని  పిలిభిత్ జిల్లా పరిపాలన యంత్రాంగం బిసాల్‌పూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని విధుల నుండి బహిష్కరించింది.

పిలిభిత్ డి.ఎం వైభవ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ-  ప్రధానోపాధ్యాయుడు జాతీయ గీతం పాడించకుండా విద్యార్థులచే  మత ప్రార్థన పాడిస్తున్నందున విధుల నుండి బహిష్కరించామని అన్నారు. బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, ఉపేంద్ర కుమార్ చేసిన విచారణలో, “ప్రధానోపాధ్యాయుడు జాతీయ గీతం కాకుండా మత ప్రార్థనను  పాడిస్తున్నాడని అతనిపై నేరం ఆరోపించబడిందని, ఒకవేళ అతను ఆ పని చేయాలనుకుంటే, ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి… ” అని డి.ఎం. వైభవ్ శ్రీవాస్తవ అన్నారు.

బిసాల్‌పూర్ బేసిక్ శిక్షా అధికారి (బీఎస్‌ఏ) దేవేంద్ర స్వరూప్ ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ, పాఠశాలలో జాతీయ గీతం పాడబడుతున్నట్లు బి.యి.ఒ నాకు చెప్పింది. అయితే సమస్య అది కాదు, ఫిర్యాదు మదర్సాల్లో పాడిన ప్రార్థనకు సంబంధించినది, జాతీయ గీతం గురించి కాదని వివరించారు.

అయితే ఈ ఆరోపణలను ఖండిస్తూ,  ప్రధానోపాధ్యాయుడు ఫుర్కాన్ అలీ జాతీయ గీతాన్ని విద్యార్థులు ప్రతి రోజు పాడతారని అంటున్నారు. ఇక్బాల్ రాసిన పద్యం 1 నుండి 8 తరగతులకు ఉర్దూ సిలబస్‌లో భాగం అని, నన్ను తొలగించాలని కోరుతూ వి.హెచ్.పి, హిందూ యువ వాహిని కార్యకర్తలు పాఠశాల వెలుపల, కలెక్టరేట్ వద్ద నిరసనలు నిర్వహించారని, ప్రభుత్వ పాఠశాల సిలబస్‌లో భాగమైన పద్యం మాత్రమే నేను పాడించానని, విద్యార్థులు ప్రతి రోజు అసెంబ్లీ సందర్భంగా ‘భారత్ మాతా కి జై’ వంటి దేశభక్తి నినాదాలు కూడా చేస్తారని అలీ అన్నారు.

వీహెచ్‌పీ జిల్లా కార్యదర్శి అంబరీష్ మిశ్రా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మదర్సాలోని మత ప్రార్థన పఠించడాన్ని వ్యతిరేకించారు. “ప్రభుత్వ పాఠశాలలో మత ప్రార్థన పఠించినందుకు ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని బిఎస్ఎకు మేము లిఖితపూర్వక ఫిర్యాదు ఇచ్చాము” అని మిశ్రా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో టెలిఫోన్ ద్వారా తెలియచేశారు.

బిఎస్ఎ దేవేంద్ర స్వరూప్ జారీ చేసిన ఒక ఉత్తర్వులో, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం, బిలాస్పూర్ లోని ప్రైమరీ స్కూల్లో, విద్యార్థుల చేత జాతీయ గీతం కాకుండా వేరే మత ప్రార్థన పాడిస్తున్నారని మాకు తెలిసింది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మొహమ్మద్ ఫుర్కాన్ అలీ ప్రిమా ఫేసీ దీనికి కారణమని తేలడంతో అతన్ని విధుల నుండి బహిష్కరించాము అని పేర్కొన్నారు.