Home News పాకిస్తాన్ పై చేసిన సర్జికల్ దాడులను వివరించిన పుస్తకం

పాకిస్తాన్ పై చేసిన సర్జికల్ దాడులను వివరించిన పుస్తకం

0
SHARE

మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అనూహ్య రీతిలో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను క్షణాల్లో మట్టుబెట్టి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు గట్టిగా బుద్ధిచెప్పి ఏడాది పూర్తయింది. ప్రాణాంతకమైన ఆ లక్షిత దాడులు భారత కీర్తి పతాకను, సైనిక పాటవాన్ని ప్రపంచం నలుమూలలకు చాటాయి. బరితెగిస్తే ఉగ్రవాదులకు బుద్ధిచెప్పడానికి భారత్ ఎంతకైనా తెగిస్తుందని ఆ దాడులు విస్పష్టంగా తెలియజేశాయి. ఒకరకంగా చెప్పాలంటే లక్ష్యిత దాడులు ప్రాణాలకు తెగించి భారత సైన్యం చేపట్టినవే. ఆ దాడి జరిపిన బృందానికి సారథ్యం వహించిన ఓ ఆర్మీ మేజర్ తన అనుభవాన్ని ఆ సమయంలో తన దళం ఎదుర్కొన్న విపత్కర పరిస్థితులను కళ్లకు కడుతూ ఓ పుస్తకాన్ని రాశారు.

తాము దాడులైతే చేయగలిగాం గాని తిరిగి భారత్‌లోకి రావడం అన్నది ‘ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని’ పరుగులు పెట్టిన చందంగానే మారిందని పేర్కొన్నారు. ఓ పక్క శతృ సేనల తూటాలు తమను వెంటాడుతున్నా, తమను దూసుకుపోతున్నా వాటిని తప్పించుకుని ఎట్టకేలకు సురక్షితంగా వెనుదిరగగలిగామని సర్జికల్ దాడులను కళ్లకు కడుతూ ఆయన ఈ పుస్తకం రాశారు. ఈ పుస్తకంలో సదరు అధికారి తన పేరును మేజర్ మైక్ టాంగోగా పేర్కొన్నారు.

‘భారత నిర్భీతి: ఆధునిక భారత సైనికుల విజయ గాథలు’ పేరిట ఈ పుస్తకం రాశారు. ఈ పుస్తకం రాసిన ఆయన తాము ఎదుర్కొన్న పరిస్థితుల గురించి, దాడికి ముందు తర్వాత దాడి సమయంలోనూ ఏ రకమైన సంక్లిష్టతను ఎదుర్కొన్నదీ వివరించారు. యూరిపై పాక్ మిలిటెంట్లు జరిపిన దాడికి గట్టిగా ప్రతీకారం తీర్చుకోవాలన్న కసితో ఉన్న సైనిక బృందాలనే లక్షిత దాడుల్లో ఉపయోగించారు. ఇందులో భాగంగా ఘాతక్ ప్లాటూన్‌ను ఏర్పరిచారు. మిలిటెంట్ల దాడిలో ఏ సైనిక విభాగంగాలో అయితే జవాన్లు మరణించారో ఆ రెండు విభాగాల నుంచే ఈ ప్లాటూన్‌లోకి దళాలను తీసుకున్నారు. ఎప్పటికప్పుడు ఉపరితల అంశాలు, సరిహద్దు పరిస్థితులకు సంబంధించి వివరాలు అందించేందుకు బలమైన దళాన్ని ఏర్పాటుచేశారు. దాడులకు దూసుకుపోతున్న దళానికి ఈ బృందాలు వెన్నుదన్నుగా నిలిచాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడం ద్వారా యూరి దాడిలో మరణించిన సైనికుల ఆత్మలకు శాంతి చేకూర్చాలన్న బలమైన దృక్పథం కూడా ఉందని రచయిత వెల్లడించారు.

కేవలం కొద్దిమందికే ఈ లక్షిత దాడుల గురించి తెలుసని, పాక్ ఆక్రమిత కాశ్మీర్ భౌగోళిక స్వరూప స్వభావాలు పూర్తిగా అవగతమైన వారినే ఈ ఘాతక్ ప్లాటూన్‌లో నియోగించాలమన్నారు. అంతికమంగా దాడుల ప్రతిపాదనను ప్రభుత్వ ఆమోదానికి అందించే ముందు ఏయే రకంగా ఇందుకు అవకాశాలున్నాయో కూడా వివరించామని తెలిపారు.

ఆ ఆపరేషన్‌ను నిర్వహించే బాధ్యతను అంతిమంగా మేజర్ టాంగోకు అప్పగించారు. ఆయన తన బృందాన్ని అత్యంత పదునైన రీతిలో లక్ష్యాన్ని తిరుగులేని రీతిలో సాధించే విధంగా ఏర్పరచుకున్నారు. ప్రతి అంశంపైనా నిశితమైన దృష్టి సారించారు ఈ బృందంలో పాల్గొన్న 19 మంది జీవితాలు తన చేతుల్లోనే ఉన్నాయన్న స్పృహతోనే ఆయన దాడి వ్యూహానికి పదును పెట్టారు. దాడి తర్వాత పరిస్థితి ఏమిటన్నదానిపైనా లోతైన ఆలోచన జరిపిన ఆయన ‘లక్షిత దాడులను భారత సైనికులు చేయగలిగారు. తిరిగి ఎలా రావడం అన్నది కష్టతరంగా మారింది. ఆ సమయంలోనే పలువురు సైనికులకు శతృవుల తూటాలకు బలయ్యారు’ అని ఆయన తెలిపారు. భారత దళాలు తిరిగొస్తున్న సమయంలో పాక్ సైనికులు తూటాల వర్షమే కురిపించారని, ఆ తూటాలు దూసుకుపోతున్నా తప్పించుకుంటూ సైనికులు తిరిగి రాగలిగారని తెలిపారు. మొత్తం నాలుగు ఉగ్రవాద స్థావరాలు లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు నిర్వహించారు.

(ఆంధ్రభూమి సౌజన్యం తో)