
ఎయిర్ నేవిగేషన్ సర్వీసుల్లో ఒక అనూహ్యమైన మైలు రాయిని భారత్ చేరుకుంది. గగన్ (GPS Aided GEO Augmented Navigation) పేరుతో పిలిచే స్వదేశీ పరిజ్ఞానపు ఉపగ్రహ ఆధారిత వర్థమాన వ్యవస్థ (SBAS) ను వినియోగించడం ద్వారా ఒక తేలికపాటి ప్రయోగాత్మక పరీక్షను రాజస్థాన్‌లోని కిషన్‌గఢ్ విమానాశ్రయం వద్ద భారత విమానాశ్రయాల అథార్టీ (AAI) విజయవంతంగా నిర్వహించింది.
భారత్, పొరుగుదేశాల కోసం AAI, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) సంయుక్తంగా గగన్‌ను తొలిసారిగా అభివృద్ధి చేశాయని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది.
గగన్‌ను 2015లో పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (DGCA) ధృవీకరించింది. ప్రపంచంలో గగన్ లాంటి ఉపగ్రహ ఆధారిత వర్థమాన వ్యవస్థలు కేవలం నాలుగు చోట్ల మాత్రమే ఉన్నాయి. వాటిలో భారత్‌ను కలుపుకొని అమెరికా, ఐరోపా, జపాన్ ఉన్నాయి.
గగన్ సేవలను వినియోగించుకొని ఇండిగో ఎయిర్ లైన్స్‌కు చెందిన ఒక విమానం 250 అడుగుల అతి తక్కువ ఎత్తులో గాల్లోకి ఎగిరిందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. DGCA బృందం తోడుగా తొలిసారిగా గగన్ సేవల వినియోగంపై ప్రయోగాత్మ పరీక్షలను కిషన్‌గఢ్ విమానాశ్రయం వద్ద జరిపారు. DGCA నుంచి తుది ఆమోదం పొందిన తర్వాత వాణిజ్య విమానాల వినియోగానికి కూడా ఈ ప్రక్రియ అందుబాటులోకి వస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఖరీదైన ల్యాండింగ్ వ్యవస్థలు లేని విమానాశ్రయాల్లో విమానాల ల్యాండింగ్‌కు గగన్ ఉపకరిస్తుంది. పలు చిన్న విమానాశ్రయాలకు సైతం ఇది ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు.
250 అడుగులకు ఎత్తును తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం అననుకూల వాతావరణం మరియు వెలుతురు లోపించిన పరిస్థితుల్లోనూ సమర్థమంతమైన నిర్వహణ లబ్దికి ఉపకరిస్తుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రాంతీయ అనుసంధాన పథకం (RCV) కిందకు వచ్చే విమానాశ్రయాలతో పాటుగా అనేక విమానాశ్రయాల్లో గగన్ ఆధారిత సేవలను అందించడానికి అవసరమైన విధానాల అభివృద్ధిపై సర్వే జరిగింది. తదనుగుణంగా పరికరాలను సంతరించుకున్న విమానం మెరుగైన సురక్షిత ల్యాండింగ్, ఇంధన వినియోగంలో తగ్గుదల, జాప్యాలు, మళ్ళింపులు, రద్దులు లాంటి అంశాల్లో గరిష్టమైన ప్రయోజనాన్ని పొందుతుందని ఆ ప్రకటన వివరించింది.
భారత జాతీయ సాగర సమాచార సేవల కేంద్రం (INCOIS) సమన్వయంతో గగన్ సందేశం సేవలు (GMS) ను AAI అమలు చేస్తున్నది. వరదలు, భూకంపాలు లాంటి ప్రకృతి విపత్తుల సందర్భంగా మత్స్యకారులు, రైతులు, విపత్తు బాధిత ప్రజలకు హెచ్చరిక సందేశాలను GMS పంపిస్తుందని పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది.












