ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో గురువారం రూ.100 కోట్ల విలువైన హెరాయిన్, ఇతర మాదక ద్రవ్యాలు, రూ. 30 లక్షల నగదును నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో ఒకరిని అరెస్టు చేశారు. నిషిద్ధ వస్తువులతో పాటు, ఒక చెట్టు మొదలులో దాచిపెట్టిన రూ. 30 లక్షల నగదు, 47 కిలోల ఇతర మాదక ద్రవ్యాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నార్కో-టెర్రరిజం మాడ్యూల్ ఉండే అవకాశాలు ఉన్నాయని నార్కోటిక్ అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా NCB డైరెక్టర్ జనరల్ SN ప్రధాన్ మాట్లాడుతూ, “ఇక్కడి మాదక ద్రవ్యాల నెట్‌వర్క్‌కు పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, మధ్యప్రాచ్య దేశాలతో సంబంధాలు ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి నార్కో-టెర్రరిజం మాడ్యూల్ ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. విచారణ కొనసాగుతుంది.” అని తెలిపారు.
“ఈ వ్యవహారం చాలా రోజులుగా జరుగుతోంది. ఈ కేసులో మరింత మంది ప్రమేయం ఉంది. ఈ నెట్‌వర్క్‌ను పట్టుకోవడానికి సంబంధిత అధికారులు ప్రయత్నిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఓ ఆపరేషన్‌లో పాకిస్థానీ పౌరులు పట్టుబడ్డారు. మరోసారి ఉగ్రవాద వ్యతిరేక బృందం (ATS) దాడిలో ముజఫర్‌నగర్, కైరానాకి చెందిన వ్యక్తులు పట్టుబడ్డారు. వారి విచారణలో షాహీన్‌బాగ్ అపార్ట్‌మెంట్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. హెరాయిన్‌ను దిగుమతి చేసుకోవడమే కాకుండా, అపార్ట్‌మెంట్‌లో నల్లమందుతో హెరాయిన్‌ను తయారు చేస్తున్నారు” అని ఆయన తెలిపారు.
గతంలో తాలిబన్ల ఆధ్వర్యంలో నల్లమందు సాగు చేసే పరిస్థితి ఆఫ్ఘానిస్థాన్‌లో ఉండేదన్నారు. భారత్ లాంటి పెద్ద మార్కెట్‌ను కైవసం చేసుకునేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. భారత్‌లో విక్రయించిన హెరాయిన్ నుంచి వచ్చిన డబ్బును హవాలా మార్గంలో దుబాయ్‌కు పంపుతున్నారని తెలిపారు.
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ ప్రభుత్వం హెరాయిన్ సాగుపై నిషేధాన్నిఇటీవల ప్రకటించింది. అప్పటి నుంచి ఇతర దేశాలకు ఎగుమతులు, అక్రమ రవాణా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. భారత మార్కెట్‌లో డిమాండ్ ఉంది. ఇది చాలా పెద్ద మార్కెట్ అని ప్రధాన్ చెప్పారు.
గతంలో ఆఫ్ఘనిస్థాన్ నుంచి దక్షిణాఫ్రికా, శ్రీలంక మీదుగా హెరాయిన్ అక్రమంగా రవాణా అయ్యేదని ఆయన తెలిపారు. ఈ సిండికేట్లు సముద్ర, భూ సరిహద్దు మార్గాల ద్వారా భారతదేశానికి వస్తువులను అక్రమంగా రవాణా చేస్తున్నారు, ఇందులో హెరాయిన్ వివిధ వస్తువులతో పాటు అక్రమంగా రవాణా చేయబడింది. లిక్కోరైస్, ట్రక్ టైర్లు మొదలైన వాటిలో దాచిపెట్టి హెరాయిన్ భారతదేశానికి అక్రమంగా రవాణా జరుగుతోంది. తర్వాత కొంతమంది ఆఫ్ఘన్ జాతీయుల సహాయంతో ఆ వస్తువుల నుంచి హెరాయిన్‌ను భారతీయ సహచరులు సేకరించారని ఆయన చెప్పారు.
అంతర్జాతీయ మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌ను తొలగించడానికి అంతర్జాతీయంగా చట్టాల అమలు పటిష్టంగా జరగాలని ఆయన అన్నారు.
ఇప్పటి వరకు జరిపిన విచారణలో ఢిల్లీ, పొరుగు రాష్ట్రాల్లో భారత్-ఆఫ్ఘన్ సిండికేట్ ఉన్నట్లు తేలిందని NCB డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (ఆపరేషన్స్) సంజయ్ కుమార్ సింగ్ తెలిపారు. స్థానికంగా హెరాయిన్ తయారీ, కల్తీ చేయడంలో ఈ సిండికేట్‌లు పని చేస్తున్నాయని తెలిపారు. నెట్‌వర్క్‌కు చెందిన చాలా మంది వ్యక్తులను గుర్తించామని, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా మరియు ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు.