17వేల దీవుల సమ్మేళనమైన ఇండోనేషియాలో క్రీ.శ. ఒకటవ శతాబ్దం నుండి హిందూ సంస్కృతి ప్రభావం కనిపిస్తుంది. ఆ తరువాత 6వ శతాబ్దంలో బౌద్ధం ఇక్కడకు వచ్చింది. మజపాహిత్, శైలేంద్ర, శ్రీవిజయ, మాతరం మొదలైన హిందూ, బౌద్ధ రాజులు ఈ దేశాన్ని పాలించారు. ఇప్పటికీ ఈ దేశంలో హిందూ సంస్కృతి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. 13వ శతాబ్దంలో ఇక్కడకు ఇస్లాం వచ్చింది. అప్పటి నుండి ఇది ముస్లిం దేశంగా మారింది. అయినా హిందుత్వ ప్రభావం పూర్తిగా మరుగున పడిపోలేదు. ఇప్పుడు మాజీ దేశాధ్యక్షుడు సకర్నో కుమార్తె సుకమావతి సుకర్నొపుత్రి తన 30వేలమంది సహచరులతోపాటు తిరిగి హిందూత్వంలోకి రావడంతో ఆ ప్రభావం గురించి మరోసారి చర్చ జరుగుతోంది. ఇండోనేషియా మరోసారి హిందుత్వ బాట పడుతోందా అని విశ్లేషణలు చేస్తున్నారు.