సమాజంలో మనకు నిత్యం రకరకాల వ్యక్తులు తారసపడుతుంటారు. ఎవరేమైతే నాకేంటి నేను బాగుంటే చాలు అనుకునేవారు చాలా మందే ఉంటారు. ఈ కాలంలో నిస్వార్థంగా పనిచేసే వారిని వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. అలాంటి వారిలో ఒకరే హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన గీతావర్మ. నేనే కాదు నా చుట్టూ ఉన్నవాళ్లు కూడా బాగుండాలి అని కోరుకునే వ్యక్తి ఆమె. అందుకే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్‌ఒ) గీతావర్మ చేసిన కృషికి గానూ ఆమె ఫోటోలను ఆ సంస్థ మ్యాగజైన్‌పై ముద్రించింది. గీతావర్మ ఎవరు? ఆమె ఏం చేసింది? ఆమె ఫోటోలను డబ్ల్యూహెచ్‌ఒ తన మ్యాగజైన్‌పై ఎందుకు ముంద్రించింది? వీటన్నికీ సమాధానం దొరకాలంటే గీతావర్మ కథ చదవాల్సిందే !
హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి జిల్లాకు చెందిన ఆరోగ్య కార్యకర్త గీతావర్మ. అందరూ బాగుండాలనే ఆశయంతో ఆరోగ్య కార్యకర్తగా మారింది. ఆ జిల్లాలో చిన్నారులు ఎదుర్కొంటున్న సమస్యలను చూసి చలించిపోయింది. పెద్దవారికి ఏదైనా రోగం వస్తే తట్టుకోగలరు కానీ ముక్కుపచ్చలారని చిన్నారులకు ఏదైనా వ్యాధి సోకితే వారు తట్టుకోలేరు.
ఆ ప్రాంతంలో తట్టు, రుబెల్లా, గవదబిళ్లలు వంటి వ్యాధుల వలన చిన్నారులు నిత్యం అనారోగ్యా లకు గురయ్యేవారు. ఆ ప్రాంతంలో నిరక్షరాస్యత చాలా ఎక్కువ. వైద్యసేవలు అందించేవారే లేరు. ఇవన్నీ గీతావర్మను ఎంతో బాధించాయి. చిన్నారు లను ఎలాగైనా అటువంటి వ్యాధుల నుండి కాపాడాలనుకుంది. ఆ వ్యాధులకు సంబంధించిన వ్యాక్సిన్‌ను చిన్నారులకు అందించింది. ఆమె అందించిన సేవలే నేడు తనకు అంతర్జాతీయ గుర్తింపును తెచ్చిపెట్టాయి.
ఏం చేసింది… ?
గీతావర్మ హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి జిల్లా సప్నాట్‌లోనే పుట్టి పెరిగింది. అక్కడే ఓ హెల్త్ సెంటర్‌లో ఆరోగ్య కార్యకర్తగా పనిచేస్తోంది. తన జిల్లాలో మారుమూల పల్లెల్లో చిన్నారులకు తట్టు, రుబెల్లా వ్యాక్సిన్‌ను అందించడంలో ఆమె సఫలీకృతురాలైంది. ఎంఎంఆర్ వ్యాక్సిన్‌పై భారత్ ప్రారంభించిన ప్రచార కార్యక్రమంలో భాగంగా మండి జిల్లాలోని సంచార జాతుల చిన్నారులకు ఈ వ్యాక్సిన్‌ను వందశాతం ఉచితంగా అందచేసింది. చిన్నారులకు కేవలం వ్యాక్సినేషన్‌ను అందించడమే కాదు.. ఆ ప్రాంతంలోని నిరక్షరాస్యులకు వ్యాధులపై అవగాహన కూడా కల్పించింది గీతా.
వ్యాధులను నయం చేసే టీకాల బాక్సును తన బైక్ మీద పెట్టుకొని నిత్యం కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసేది. వాహనం వెళ్లలేని కొన్ని మారుమూల ప్రదేశాలకు నడిచి వెళ్లి చిన్నారులకు వైద్యాన్ని అందించేది. గీతావర్మ కొండ ప్రాంతాలలో ఉన్నవారికి వైద్యం అందించడానికి ట్రెక్కింగ్ కూడా నేర్చుకుంది.
ఇలా ఓ సాధారణ ఆరోగ్యకార్యకర్తగా ఆమె చేసిన సేవలను గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఒ) 2018 సంవత్సరానికి గానూ తన క్యాలెండర్‌పై గీతా ఫోటోలను ముద్రించి ఆమెను గౌరవించింది. అంతకు ముందే సోషల్ మీడియాలో ఆమె గురించి చాలా ప్రచారం కూడా జరిగింది. తాజాగా ఆమె సాధించిన ఈ గుర్తింపుతో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. గీతావర్మ రాష్ట్రం గర్వించేలా చేసిందని ప్రశంసించారు.
ఆ వ్యాక్సిన్ ఏంటి ?
ఎంఎంఆర్ వ్యాక్సిన్ (measles, mumps, and rubella) చిన్నారుల్లో వ్యాధి నిరోధకతను పెంచే టీకా. ఈ టీకా వేస్తే పిల్లల్లో గవదబిళ్లలు, రుబెల్లా, తట్టు వంటి అనారోగ్య సమస్యలు రావు.
అయితే మనదేశంలో చాలా వరకు మారుమూల పల్లెల్లో ఈ వ్యాక్సిన్ గురించి సరైన అవగాహన లేకపోవడం లేదా వ్యాక్సిన్ వేయించే ఆర్థికస్థోమత తల్లిదండ్రులకు లేకపోవడం వలన చాలామంది చిన్నారులకు ఈ వ్యాక్సిన్ అందడం లేదు. దాంతో దేశవ్యాప్తంగా ఎంతోమంది చిన్నారులు ఈ వ్యాధుల బారిన పడి మరణిస్తున్నారు. అందుకే 2017 ఫిబ్రవరి నెలలో భారత్ ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో ఎంఎంఆర్ వ్యాక్సిన్‌పై ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ప్రచార కార్యక్రమం ప్రపంచం లోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ క్యాంపెయిన్లలో ఒకటిగా పేరు పొందడం విశేషం.
కొండలలో, కోనల్లో, మారుమూల గ్రామాల్లో నివసిస్తున్న ఎంతోమంది పేదవారికి ఎటువంటి స్వార్థ చింతన లేకుండా వైద్య సేవలందిస్తున్న గీతావర్మను ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి.
– విజేత
(జాగృతి సౌజన్యం తో)