Home News ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేస్తాం.. ఆత్మహత్యలు చేసుకోవద్దు – ఏబీవీపీ వినతిపత్రంపై గవర్నర్ స్పందన

ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేస్తాం.. ఆత్మహత్యలు చేసుకోవద్దు – ఏబీవీపీ వినతిపత్రంపై గవర్నర్ స్పందన

0
SHARE

ఇటీవల ఇంటర్మీడియెట్ జవాబు పత్రాల పరిశీలనతో చోటుచేసుకున్న అవకతవకలపై అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ బృందం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కు వినతిపత్రం సమర్పించింది. తెలంగాణ ఇంటర్ బోర్డు విద్యార్థుల జవాబు పత్రాల పరిశీలనలో వ్యవహరించిన నిర్లక్ష్య వైఖరి కారణంగా అనేక మంది విద్యార్థుల మార్కులు గల్లంతయ్యాయి. సుమారు 9.5 లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్ష రాయగా 3 లక్షల మందికి పైగా విద్యార్థులు ఫెయిల్ అయినట్టు ఫలితాలు వచ్చాయి. ఈ తప్పిదం కారణంగా 22 మంది పరీక్ష రాసిన విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

ఇంటర్ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన బోర్డు అనేక అనుమానాలకు తావిస్తూ పరీక్ష ఫలితాలను వెల్లడించిందని, గ్లోబల్ ఏరినా సంస్థ తప్పిదాల కారణంగా కోటి ఆశలతో పరీక్షలు రాసిన విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఏబీవీపీ తమ వినతిపత్రంలో పేర్కొంది.

ఇంటర్ జవాబు పాత్రల పరిశీలనలో 800 మంది ప్రభుత్వ లెక్చరర్లు మాత్రమే ఉండడం వలన ఇబ్బంది ఏర్పడిందని, వెంటనే ఖాళీగా ఉన్న 5000 ప్రభుత్వ లెక్చరర్ల పోస్టులను భర్తీ చేయాలని ఏబీవీపీ తమ వినతిపత్రంలో కోరింది. ప్రైవేట్ కళాశాలలో పనిచేస్తున్న లెక్చరర్లు కాకుండా ఫ్లోర్ ఇంచార్జ్, ట్యూటర్స్ లచే మూల్యాంకనం చేయంచటం కారణంగా కూడా అనేక తప్పులు జరిగాయని ఏబీవీపీ గవర్నర్ దృష్టికి తీసుకు పోవడం జరిగింది. అవకతవకలపై సిట్టింగ్ జడ్జ్ చే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని విన్నవించింది.

విద్యార్థుల ఆత్మహత్యలకి కారణమైన విద్యా శాఖ మంత్రి ఇ జగదీష్ రెడ్డి గారిని మంత్రి మండలి నుండి బర్తరఫ్ చేయడంతో పాటు నిర్లక్ష్యానికి కారణం అయిన ఇంటర్మీడియేట్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్ ను వెంటనే విధుల నుంచి తొలగించాలని కోరింది. గ్లోబల్ ఎరీనా సంస్థని బ్లాక్ లిస్టులో పెట్టి భారీ జరిమానా విధించి ఆ సంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి గవర్నర్కు సమర్పించిన వినతిపత్రంలో ఏబీవీపీ ప్రతినిధులు డిమాండ్ చేశారు.

ఏబీవీపీ సమర్పించిన వినతి పత్రంలోని అంశాలపై సానుకూలంగా స్పందించిన గవర్నర్ నరసింహన్, ఇంటర్ అవకతవకలపై విచారణ జరిపించి బాద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

విద్యార్థులకు న్యాయం చేస్తామని, ఎవ్వరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు. గవర్నర్ ను కలిసిన ప్రతినిధి బృందంలో లో ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ గారు రాష్ట్ర కార్యదర్శి అంబాల కిరణ్ గారు, గ్రేటర్ హైదరాబాద్ నగర కార్యదర్శి పగిడిపల్లి శ్రీహరి జాతీయ నాయకులు అయ్యప్ప, ప్రవీణ్ రెడ్డి రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు చింత ఎల్ల స్వామి శ్రవణ్ రెడ్డి, మహేష్ , శ్రీశైలం వీరమల్ల పాల్గొన్నారు.