Home News అంతర్జాతీయ యోగ దినోత్సవం 2018

అంతర్జాతీయ యోగ దినోత్సవం 2018

0
SHARE

ప్రపంచ యోగ దినోత్సవమును ప్రతి సంవత్సరం జూన్ 21 న జరుపుకుంటారు.  ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగ దినోత్సవంను పురస్కరించుకొని భాగ్యనగరంలో జూన్ మాసంలో బాలగోకులం నిర్వాహకులు వివిధ కార్యక్రమాలను నగరంలోని పలు ప్రాంతాలలో నిర్వహించారు.

అందులో ప్రధానంగా వివిధ రకాల యోగాసనాల ప్రదర్శన వాటి ద్వార మన ఆరోగ్యం మీద ఉండే ప్రభావము గురుంచి తెలియచెప్పటం జరిగింది.

10 రోజుల పాటు (జూన్ 17- 27) వరకు జరిగిన ఈ కార్యక్రమాలలో బాల గోకులం వారు యోగలో నిష్ణాతులైన వారిన ఆహ్వానించి యోగ యొక్క అవసరం, ఉపయోగాలు దైనందన జీవితంలో యోగాను  ఇమిడ్చుకోవటంతో వచ్చే శుభ ఫలితాలు తెలియజేశారు.

మరికొన్ని బాలగోకులాల వాళ్ళు యోగాసనాల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు కూడా అందజేశారు.  ఇందులో పిల్లలతో పాటు పెద్ద వారు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. నగరంలోని దాదాపు 100 పైగా ప్రాంతాలలో చిన్న పెద్ద గేటెడ్  కమ్యూనిటీ లలో కార్యక్రమాలు నిర్వహించబడినవి.

నిర్వాహుకులు యోగ వేడుకను మరింత ఆహ్లాదకరం, ఆసక్తికరం చేసే ప్రక్రియలో భాగంగా కార్యక్రమంలో పాల్గొనే వారు స్వయంగా చేసిన ఆహార పదార్థాలను ఇతరులతో పంచుకోవడం, అల్పాహారం మరియు కుటుంబ క్రీడలు నిర్వహించడం జరిగింది.

2014 సెప్టెంబరు 27న భారత ప్రధాని నరేంద్రమోడి ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకొనుట గురించి ప్రతిపాదన చేశారు. ఈ ప్రతిపాదనకు వెనువెంటనే 193 ప్రపంచ దేశాలు తమ మద్ధతును ప్రకటించాయి. తరువాత డిసెంబరు 11 న ఐక్యరాజ్యసమితి భారత ప్రధాని సూచించిన జూన్ 21 నాడు ప్రతి సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవమును జరుపుకోవాలని అధికారిక ప్రకటన చేయడం జరిగింది.

యోగ అయిదు వేల సంవత్సరాలనుండి భారతదేశంలో ఆచరిస్తూ వస్తున్న ఒక శాస్త్రీయ ప్రక్రియ. చాలా మంది యోగా అంటే శారీరక వ్యాయామము, కేవలం కొన్నిశారీరిక కదలికలు (ఆసనాలు) ఇంకా శ్వాస ప్రక్రియ అని మాత్రమే అనుకుంటారు. కానీ నిజానికి మానవుని యొక్క అనంతమైన మేధాశక్తి , ఆత్మశక్తిల కలయిక యోగ.

విజ్ఞానశాస్త్ర ప్రకారము యోగా అంటే పరిపూర్ణ జీవనసార విధానము. హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయంలో భాగమైన యోగాన్ని శాస్త్రీయంగా క్రోడీకరించిన ఆద్యుడు పతంజలి.

ఆరోగ్యమే మహా భాగ్యం అను నానుడి ప్రకారము ప్రతిఒక్కరు చెయ్యి చెయ్యి కలిపి అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించుకున్నారు.